లింగమయ్యకు దినాం అభిషేకమే..

అదో చిన్న నది.. దట్టమైన అడవి మధ్య నుంచి ప్రవహిస్తుంది.. మధ్యలో ఓ చోట అన్నీ రాళ్లు.. కానీ అవి మామూలు రాళ్లు కాదు.. ఓసారి సరిగ్గా గమనిస్తే చాలా రాళ్లపై శివ లింగాలు, వాటి ముందున్న నంది విగ్రహాలు కనిపిస్తాయి. ఇలా ఒకటీ రెండూ కాదు వందలు, వేల సంఖ్యలో రాళ్లపై చిన్న చిన్న శివ లింగాలు చెక్కి ఉంటాయి. నది మధ్యలో, ఒడ్డున ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని సహస్ర లింగ పేరుతో పిలుస్తారు. కర్ణాటకలోని సిర్సి తాలూకాలోని దట్టమైన అడవిలో ఈ ప్రాంతం ఉంది. ఈ నదిని శల్మలగా పిలుస్తారు. జీవ వైవిధ్యానికి నిలయమైన ఈ చోటు ఎప్పటి నుంచో స్థానికులకు తెలిసినా.. 2011లో పర్యావరణ శాస్త్రవేత్తలు పర్యటించడంతో బయటపడింది.

విజయనగర రాజులు కట్టారు

క్రీస్తుశకం 1542 నుంచి 1569 సంవత్సరాల మధ్య విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సదాశివరాయలు ఈ సహస్ర లింగ ప్రాంతంలో లింగాలు చెక్కించినట్టు భావిస్తున్నారు. ఇక్కడ శివ లింగాలు, నందితోపాటు బ్రహ్మ, విష్ణు, లక్ష్మి, రాముడు, హనుమాన్​ విగ్రహాలు, ఆవులు, కప్పల బొమ్మలు కూడా కొన్ని రాళ్లపై చెక్కి ఉన్నాయి. నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు అవన్నీ మునిగిపోతాయి. నీటి మట్టం తగ్గగానే బయటికి కనిపిస్తాయి. అయితే ఈ ప్రాంతానికి సహస్ర లింగ అని పేరున్నా.. ఇక్కడ వేల సంఖ్యలో లింగాలు కనిపిస్తాయి. మొత్తం ఎన్ని ఉన్నాయనేది ఇప్పటివరకు లెక్క పెట్టలేకపోయారు.

మరెన్నో చోట్ల ఉన్నయ్..

ఇలా శివ లింగాలు చెక్కిన ప్రాంతాలు మరికొన్ని చోట్ల కూడా ఉన్నాయి. కాంబోడియా దేశంలోని కులెన్​హిల్స్​ప్రాంతంలో స్పీన్​ నదిలోనూ సహస్ర లింగ తరహాలో పెద్ద సంఖ్యలో శివ లింగాలు చెక్కి ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఆ నదిని ‘వెయ్యి లింగాల నది (ది రివర్​ ఆఫ్​ థౌజండ్​ లింగాస్)’గా పిలవడం గమనార్హం. ఇక కర్ణాటకలోని హంపి, ఒడిశాలోని పరశురామేశ్వర ఆలయంలోనూ ఇలా శివలింగాలు ఉన్నాయి.

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates