యువతిని 60 అడుగుల లోతు బావిలో తోసేసిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్

సోషల్ మీడియా చాటింగ్‌తో ఏర్పడిన స్నేహాన్ని నమ్మి వెళ్లిన ఓ యువతికి చావు నోట్లో తలపెట్టినంత పనైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఫ్రెండ్‌ ఆమెను బావిలో తోసేసి.. పరారైంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాదాపు మూడ్రోజుల పాటు ఆ యువతి బావిలోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువతికి బెంగళూరు రూరల్ జిల్లాలోని దేవనహళ్లిలో ఉండే ఆదర్శ అనే మహిళతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. కొన్ని నెలలుగా చాటింగ్ చేసుకుంటున్న ఆ ఇద్దరు ఒకసారి కలవాలని అనుకున్నారు. దేవనహళ్లికి రావాలని ఆదర్శ చెప్పడంతో ఆ యువతి గత శనివారం నాడు వెళ్లింది. ఆదర్శ ఇంటికి వెళ్లిన తర్వాత ఇద్దరూ కలిసి అక్కడికి దగ్గరలో ఉన్న పొలాల్లోకి షికారుగా పోయారు. అక్కడ కోలార్ యువతిని మాటల్లో పెట్టిన ఆదర్శ పొలంలో ఉన్న 60 అడుగుల లోతు బావిలో తోసేసింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో సైలెంట్‌గా పరారైంది. బాధిత యువతి కాపాడాలని కేకలు వేసినా ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది. బావిలో పడిన ఆమెకు చేయి విరిగింది. ఆ బాధను భరిస్తూ మూడు రోజుల పాటు లోపలే ఉన్న తర్వాత మంగళవారం రోజు అటుగా వచ్చిన ఓ వ్యక్తి బావిలో ఆమెను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైర్ ఇంజన్ సిబ్బంది సాయంతో ఆమెను బయటకు తీశారు. బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఆమెకు చికిత్స చేయిస్తున్నారు. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ నోట్ చేసుకున్న విజయపురా పోలీసులు ఆదర్శపై కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత యువతికి నిందితురాలు ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ ద్వారా పరిచయమైందని, ఆ ఇద్దరూ తొలిసారిగా కలిసింది ఈ ఘటన జరిగిన రోజేనని పోలీసులు తెలిపారు.

Latest Updates