భారత్‌పై పాక్ విషం: ముంబై ఉగ్రదాడికి కసబ్‌కి ఏం చెప్పి పంపారంటే

దొంగతనాలు చేసి డబ్బు సంపాదించాలని లష్కరే తొయిబాలోకి

భారత్‌లో నమాజ్ నిషేధమని చెప్పి.. జీహాదీ ట్రైనింగ్

లక్షా 25 వేల రూపాయల డబ్బు.. వారం సెలవు

26/11 ముంబై అటాక్‌కి ముందు కసబ్‌కి నజరానా

హిందువుగా పేరు పెట్టుకుని ముంబై అటాక్..

హిందూ టెర్రరిజంగా నమ్మించాలని ప్రయత్నం

లష్కరే టెర్రరిస్టుని ఇంటరాగేషన్ చేసిన ముంబై మాజీ సీపీ బుక్‌లో వెల్లడి

2008 నవంబర్ 26.. భారత చరిత్రలో చీకటి రోజు. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహా నగరంలోకి పాకిస్థాన్ ముష్కర మూకలు చొరబడి.. మారణ హోమానికి పాల్పడిన రోజు. ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్, తాజ్ హోటల్ సహా పలు ప్రాంతాల్లో రక్తపాతం సృష్టించారు లష్కరే తొయిబా ఉగ్రవాదులు. దాదాపు 168 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ముంబై పోలీసులు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు కలిసి దాదాపు రెండ్రోజుల ఆపరేషన్ తర్వాత పాక్ ముష్కరులను మట్టుబెట్టారు. మన దేశంలోకి అడుగుపెట్టి.. నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒక్క అజ్మల్ కసబ్‌ను మాత్రమే ప్రాణాలతో పట్టకున్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత 2012 నవంబరు 21న అతడిని ఉరి తీశారు. అయితే కసబ్‌ ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో ఉండగా ఇంట్రాగేషన్ చేసిన నాటి ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా కొన్ని ఆసక్తికర నిజాలతో ‘లెట్ మీ సే ఇట్ నవ్’ అనే పేరుతో పుస్తకం రాశారు. కసబ్ లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలోకి ఎందుకెళ్లాడు? అక్కడ ట్రైనింగ్‌లో అతడికి ఏం చెప్పి బ్రెయిన్ వాష్ చేశారు? ముంబై అటాక్‌ను ఎలా ప్లాన్ చేశారు? అన్న విషయాలను వెల్లడించారు.

భారత్‌లో నమాజ్ నిషేధమని నమ్మించి..

ముంబై మాజీ సీపీ రాకేశ్ మారియా

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలు జీహాదీ పేరుతో యువకులను ఎంతగా మోసం చేస్తారన్నది మాజీ కమిషనర్ మారియా పుస్తకం ద్వారా అర్థమవుతుంది. అక్కడి ప్రజల్లో పాక్ ముష్కర సంస్థలు భారత్‌పై ఎంతటి విషాన్ని నింపుతున్నాయో తెలుసుకోవడానికి ఈ బుక్‌లో కసబ్ చెప్పిన మాటలు చాలు. వాస్తవానికి కసబ్ దొంగతనాలు, దోపిడీలు చేసి డబ్బు సంపాదించడానికి తుపాకీ పట్టాడట. లష్కరే తొయిబాలో చేరడానికి కారణం జీహాదీ కోసం కాదని, పేద కుటుంబం కావడంతో డబ్బు కోసమే వెళ్లానని చెప్పాడు. అయితే ఇండియాలో అసలు పూర్తిగా ముస్లింలను నమాజ్ చేయనివ్వరని, మసీదులను అధికారులు తాళాలు వేసి పెడతారని జిహాద్ శిక్షణలో అతడికి చెప్పినట్లు సీపీకి వివరించాడు. ఇలా చెప్పి తనను రెచ్చగొట్టి ముంబై దాకి పంపారని మారియాకు తెలిపాడు. జైలు సమీపంలో తరచూ నమాజ్ శబ్ధం వినిపిస్తున్నప్పుడు కూడా అది తన భ్రమ అని భావించేవాడట. అంటే నిజాన్ని నమ్మలేనంతగా ఉగ్రవాద సంస్థలు బ్రెయిన్ వాష్ చేస్తాయని దీన్ని బట్టి తెలుస్తోంది. భారత్‌లో ముస్లింలు నమాజ్ చేయనివ్వరు కదా అని కసబ్ అడగడంతో అతడిని ఓ సారి సమీపంలోని మసీదుకు తీసుకెళ్లినట్లు తెలిపారు మారియా.

హిందూ ఉగ్రవాదంగా ముద్ర వేయాలని కుట్ర

ముంబై అటాక్‌ను పాక్ ముష్కర మూకలు హిందూ ఉగ్రవాదుల పనిగా నమ్మించాలని కుట్ర చేశాయి. ఇందుకోసం బెంగళూరు నుంచి వచ్చిన సమీర్ దినేశ్ చౌదరి అనే పేరుతో కసబ్‌ను క్రియేట్ చేశారు. ఆ పేరుతో ఫేక్ ఐడీ ప్రూఫ్స్ కూడా అతడి బ్యాగ్‌లో ఉంచింది లష్కరే తొయిబా. అతడు భారత బలగాల చేతిలో మరణించిఉంటే మీడియాలో బెంగళూరుకు చెందిన హిందువు ఈ దాడి చేశాడని వార్తలు ప్రసారం అవుతాయని భావించింది ఆ ఉగ్రవాద సంస్థ.  న్యూస్ రిపోర్టర్లు కూడా బెంగళూరుకు క్యూ కడతారని అనుకున్నాడు కసబ్. తద్వారా కేసు పక్క దారిపట్టి.. హిందూ ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారని ప్రపంచం నమ్ముతుందని భావించాడు. అందుకోసం చేతికి ఎర్రటి కాశీ దారం కూడా కట్టుకున్నాడు. కానీ లష్కరే తొయిబా చేసిన కుట్ర భగ్నం చేశారు మన బలగాలు. కసబ్‌ని సజీవంగా పట్టుకుని అతడు పాకిస్థాన్‌లోని  ఫరీద్‌కోట్‌కు చెందిన వాడిగా తేల్చడంతో తమ కుట్రపారలేదని అతడు నిరాశ చెందాడు.

సోదరి పెళ్లికి డబ్బు

చాలా రోజుల పాటూ ఇంట్రాగేషన్‌ నడవడంతో కసబ్ నెమ్మదిగా తనతో మంచిగా మాట్లాడడం మొదలుపెట్టాడని మాజీ సీపీ మారియా చెప్పారు. అతడి వ్యక్తిగత విషయాలను కూడా చెప్పడం స్టార్ట్ చేశాడన్నారు. తనది కుటుంబం నిరు పేద కుటుంబమని, డబ్బు సంపాదన కోసమే లష్కరే తొయిబాలోకి వెళ్లినట్లు సీపీకి చెప్పాడు కసబ్. ముంబై అటాక్‌కి ముందు రూ.1.25 లక్షల డబ్బు, వారం రోజుల సెలవులు లష్కరే తొయిబా నజరానాగా తనకు ఇచ్చినట్లు తెలిపాడు. ఆ డబ్బును తన సోదరి పెళ్లి కోసం ఇంట్లో ఇచ్చి.. ముంబైలో మారణ హోమానికి దిగినట్లు చెప్పాడు.

Latest Updates