కశ్మీర్ పై జోక్యం సహించం: భారత్

జమ్మూకశ్మీర్ దేశంలో అంతర్భాగమని భారత్ పునరుద్ఘాటించింది. కశ్మీర్ అంశం పూర్తిగా ఇండియాకు సంబంధించిందని స్పష్టం చేసింది. కశ్మీర్ విషయంలో ఇండియా వైఖరిని విమర్శించిన ఆర్గనైజేషన్​ ఆఫ్​ ఇస్లామిక్ కో ఆపరేషన్​​(ఓఐసీ) రెజల్యూషన్​కి ఇండియా విదేశాంగశాఖ కౌంటర్ ఇచ్చింది. మొదటి నుంచి జమ్మూకశ్మీర్ ఇండియాలో భాగమని, ఈ విషయంపై ఇండియా స్టాండ్ లో ఏ మాత్రం మార్పు ఉండదని, ఇందులో ఎవరి ప్రమేయాన్ని సహించబోమని ప్రకటించింది.

ఇదీ ఓఐసీ సదస్సు తీర్మానం
అమాయక కశ్మీరీలపై దాడులు చేస్తూ ఇండియా సైనిక దళాల అధికారాలను దుర్వినియోగం చేస్తోందని శనివారం ఓఐసీ రెజల్యూషన్​లో పేర్కొంది. 2016 జులై నుంచి కశ్మీరీలు, మైనారిటీ కమ్యూనిటీలపై బెదిరింపులు, దాడులు జరుగుతున్నాయని, కొందరు అమాయకులు అన్యాయంగా గల్లంతవుతున్నారని ఆరోపించింది. అంతేకాకుండా తమ ఆధీనంలో ఉన్న అభినందన్​ను భారత్ కు అప్పగించిన పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ను ప్రశంసిస్తూ ఓఐసీ తీర్మానం ప్రకటించింది. దీనిపై పాకిస్థాన్​విదేశాంగ శాఖ హర్షం వ్యక్తం చేసింది. కశ్మీర్ అంశంపై ఓఐసీలోని 57 దేశాలు పాకిస్థాన్​కు మద్ధతు ప్రకటించాయని సమర్థించుకుంది. భారత్ హాజరైతే ఈ సమావేశానికి తాము హాజరుకాబోమంటూ ఓఐసీ సభ్యదేశమైన పాక్ హెచ్చరించినా లెక్కచేయకుండా ఇండియాను ప్రత్యేకంగా సదస్సుకు ఇన్వైట్ చేసింది. దీంతో పాక్ మంత్రి ఖురేషి ఈ సదస్సుకు హాజరు కాలేదు.

టెర్రరిజంపై కలిసి పోరాడుదామన్న సుష్మా
అబుదాబిలో జరిగిన ఓఐసీ సమావేశానికి శుక్రవారం విశిష్ఠ అతిథిగా హాజరైన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సుమారు 17 నిమిషాల పాటు ప్రసంగించారు. ఉగ్రవాదంపై కలిసి పోరాడుదామని ఈ సందర్భంగా ఓఐసీకి పిలుపునిచ్చారు.

Latest Updates