పుల్వామా ఎటాక్‌ కోసం అమెజాన్‌‌లో కెమికల్స్ తెప్పించారు

  •                 దాడిలో బాంబు తయారు చేసింది జైషే టెర్రరిస్టులే
  •                 బయటపెట్టిన ఎన్ఐఏ…మరో ఇద్దరు నిందితుల అరెస్ట్

పుల్వామా టెర్రర్ ఎటాక్ తో సంబంధం ఉన్న మరో ఇద్దర్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. వాజ్ ఉల్ ఇస్లాం(19), మహ్మద్ అబ్బాస్  (32) లను  శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఇందులో వాజ్ ఉల్ ఇస్లాం  టెర్రరిస్టులు దాడికి ఉపయోగించిన బాంబు, ఇతర మెటీరియల్ అంతా ఎలా సమకూర్చుకున్నారన్నది విచారణలో వెల్లడించాడు.  ఐఈడీ బాంబు తయారీకి కావాల్సిన కెమికల్స్, బ్యాటరీ, ఇతర మెటీరియల్ అంతా ఆన్ లైన్ రిటైల్ షాపింగ్ అమెజాన్ సైట్ ద్వారా కొన్నట్టు పోలీసులకు చెప్పాడు. అమెజాన్ ఆన్ లైన్ షాపింగ్ అకౌంట్ ను ఉపయోగించాలని జైషే మహ్మద్ టెర్రరిస్ట్ సంస్థ ఇచ్చిన డైరెక్షన్ల మేరకు అతను ఇదంతా చేశాడు. ఆన్ లైన్ లో వచ్చిన మెటీరియల్ ను వాజ్ ఉల్ స్వయంగా జైషే టెర్రరిస్టులకు చేరవేసినట్లు విచారణలో
అంగీకరించాడు.

జైషే టెర్రరిస్టులకు ఆశ్రయం

రా మెటీరియల్‌ ఉపయోగించి జైషే ఐఈడీ తయారు చేసింది. ఇందులో మహ్మద్ ఉమర్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడు. అతనికి 2018 నుంచి మహ్మద్ అబ్బాస్ షెల్టర్ ఇచ్చినట్లు గుర్తించారు. జవాన్ల కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ దార్, పాకిస్తాన్ నుంచి వచ్చిన సమీర్ అహ్మద్ దార్, కమ్రాన్ లకు కూడా అబ్బాస్ సహకరించాడట. కొన్నేళ్లుగా జైషే కోసం పనిచేస్తున్నట్లు అబ్బాస్ విచారణలో అంగీకరించాడు. జైషే టెర్రరిస్టులకు సహకరించారని పోలీసులు ఈ మధ్యనే అరెస్ట్ చేసిన తారీఖ్ అహ్మద్ షా, అతని కూతురు ఇన్షా జాన్‌కు కూడా అబ్బాస్ సహకరించే వాడని పోలీసులు చెప్పారు. వీరిని ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేసినట్లైంది. గతేడాది జరిగిన పుల్వామా ఎటాక్ లో సీఆర్పీఎఫ్ కు చెందిన 40 మంది జవాన్లు చనిపోయారు. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.

Latest Updates