ఇద్దరు హిజ్బుల్ టెర్రరిస్టులను చంపిన సెక్యూరిటీ ఫోర్స్

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ లో ఇద్దరు హిజ్బుల్ టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్స్ ఎన్ కౌంటర్ లో కాల్చిచంపాయి. శ్రీనగర్ లోని నవకాడల్ ఏరియాలో అర్థరాత్రి నుంచి జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్ట్ లు హతమయ్యారు. చనిపోయిన టెర్రరిస్ట్ లలో కశ్మీర్ సెపరేటిస్ట్ గ్రూప్ తెహ్రీక్ హురియత్ ఛైర్మన్ అష్రఫ్ షెహ్రయ్ కుమారుడు జునైద్ షెహ్రయ్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం నవకాడల్ లో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్ల బృందం జాయింట్ గా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. టెర్రరిస్టులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టాయి. దీంతో టెర్రరిస్టులు కాల్పులు మొదలుపెట్టారు. భద్రత బలగాలు సైతం ఎదురుకాల్పులు స్టార్ట్ చేశాయి. కొన్ని గంటల పాటు భద్రత బలగాలు, టెర్రరిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ట్రెరిస్టులు చనిపోయినట్లు భద్రత బలగాలు తెలిపాయి. ముగ్గురు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. టెర్రరిస్టుల నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఐతే ఎన్ కౌంటర్ కారణంగా స్థానికంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇంటర్ నెట్, మొబైల్ సర్వీసులు కూడా నిలిపివేశారు.

Latest Updates