ఢిల్లీలో ఎంపీ కవిత ఇంట్లో వసూల్ ముఠా... డ్రైవర్ సహా ముగ్గురి అరెస్టు

ఢిల్లీలో ఎంపీ కవిత ఇంట్లో వసూల్ ముఠా... డ్రైవర్ సహా ముగ్గురి అరెస్టు

ఢిల్లీలో తెలంగాణ ఎంపీ మాలోతు కవిత పీఏలమంటూ ముగ్గురు వ్యక్తులు డబ్బులు వసూలు చేశారు. ఢిల్లీలోని ఓ ఇంటి యజమానిని రూ. 5 లక్షల డబ్బులు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణం అక్రమం అంటూ ఆ వ్యక్తి దగ్గర డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. లంచం తీసుకుంటుండగా వారిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులు ఎంపీ మాలోతు కవిత అధికారిక క్వార్టర్‌లో పట్టుబడినట్టు సమాచారం.

లంచం వసూలు చేసిన వారిని రాజీవ్ భట్టాచార్య, శుభాంగి గుప్త, దుర్గేశ్ కుమార్‌గా గుర్తించింది సీబీఐ. వారిని అరెస్ట్ చేసింది. బాధితుడు మన్మిత్ సింగ్ లాంబా ఇచ్చిన ఫిర్యాదులో రంగంలో దిగిన సీబీఐ.. నిందితులు లక్ష రూపాయలు వసూలు చేస్తుండగా పట్టుకుంది. ఈ కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది.

అయితే లంచం వసూళ్లకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధంలేదని తెలిపారు ఎంపీ మాలోతు కవిత. డబ్బులు తీసుకుంటూ పట్టుబడిన వాళ్లు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ప్రస్తుతం తాను నా నియోజకర్గలో ఉన్నానన్న మాలోతు కవిత.. ఇల్లుకు సంబందించిన కీస్ డ్రైవర్  దుర్గేశ్ దగ్గర ఉంటాయని తెలిపారు.
 
మాలోతు కవిత తెలంగాణలోని మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.