డేంజర్​లో కవ్వాల్‌ టైగర్

  • అడవుల్లో పెద్దసంఖ్యలో వేటగాళ్ల సంచారం
  • డబ్ల్యూసీసీబీ,ఎన్‌టీసీఏ హెచ్చరిక
  • పులుల సమాచారం గోప్యంగా ఉంచాలని సూచన
  • అప్రమత్తమవుతున్నఫారెస్టు ఆఫీసర్లు

ఆదిలాబాద్,​ వెలుగు:  కవ్వాల్‌ టైగర్ రిజర్వ్‌ జోన్‌లో వేటగాళ్లు పాగావేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ సరిహద్దు అటవీ ప్రాంతాలన్నీ పలువురు పేరుమోసిన హంటర్ల ఉచ్చులో బిగుసుకుపోతున్నాయి. వీరు ప్రధానంగా పులులు, విలువైన ఇతర వన్యప్రాణులను వేటాడుతున్నట్లు ఢిల్లీలోని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డు(డబ్ల్యూసీసీడీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్‌టీసీఏ) ఫారెస్ట్‌ ఆఫీసర్లను హెచ్చరించాయి. అలాగే చెన్నైలోని దక్షిణ భారత క్రైమ్ కంట్రోల్ బ్యూరో కూడా వేటగాళ్ల సమాచారాన్ని అటవీ అధికారులకు అందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధించిన ఏ చిన్న సమాచారం కూడా బయటకు పొక్కకుండా చర్యలు చేపట్టాలంది. ఇటీవలే కొందరు దుండగులు అడువుల్లో సీసీ కెమరాలను ధ్వంసం చేసిన సంగతి కూడా తెలిసిందే.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇచ్చోడ, ఖానాపూర్, పెంబిరాజురా బోథ్​, మామడ, సారంగాపూర్, దస్తురాబాద్, జన్నారం ప్రాంతంలోని కవ్వాల్ అభయారణ్యంలో వన్యప్రాణుల షికారికి సెంటర్లుగా మారాయి. ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లోనే వేటగాళ్లు పెద్ద ఎత్తున వన్యప్రాణులను వేటాడినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల ఖానాపూర్ ప్రాంతంలోని పుల్గంపాండ్రి అడవుల్లోనే వేటగాళ్లు పులిని వేటాడి చంపిన విషయం తెలిసిందే. రాజూరా, సింగాపూర్, ఎక్బాల్పూర్, పెంబి, నాగాపూర్, యాపల్గూడా, తాటిగూడ, కవ్వాల్, మందపల్లి, మైసంపేట తదితర గ్రామాల పరిసరాల్లో వేటగాళ్ల సంచారం కొనసాగుతూనే ఉంది. ఈ ప్రాంతాలు హంటర్ల అడ్డాలుగా కొనసాగుతున్నప్పటికీ అధికారుల పెద్దగా పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి.

ఇన్ఫార్మర్లను ఏర్పరచుకొని వన్య మృగాల వేటాడితే వేసే శిక్షలు కఠినతరం చేయడంతో హంటర్లు రూటు మార్చారు. కొద్ది రోజులుగా ప్రభుత్వం అడవుల సంరక్షణకు చర్యలు చేపట్టడంతో వీరికి ఇప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాలోని కొన్ని అటవీ ప్రాంతాలు వన్యప్రాణుల షికారికి వేదికగా కొనసాగుతున్నాయి. అయితే వేట వదిలివేయలేని వారంతా ఏదోలా తమ ప్రవృత్తిని కొనసాగించేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అటవీ అధికారుల కన్నుగప్పే మార్గాలు వెతుకుతున్నారు. వేటకు అనువైన ప్రాంతాల్లో ఇన్ఫార్మర్లను ఏర్పరచుకొని సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఖానాపూర్ రేంజ్ ఇచ్చోడ, జన్నారం తదితర ఏరియాలు షికారికి పేరుపొందాయి. ఈ ప్రాంతాల్లో దట్టమైన అడవులు, అనుకూలమైన వాతావరణం ఉండడంతో వన్యప్రాణులు సంచారం ఇక్కడ ఎక్కువ.

పక్క రాష్ట్రాల వేటగాళ్లు కూడా..

జిల్లాకు చెందిన కొంతమంది వేటగాళ్లతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి నిపుణులైన వేటగాళ్లు పెద్ద సంఖ్యలో అడవుల్లో సంచరిస్తున్నట్లు బోర్డు నుంచి సూచనలు వచ్చాయని సమాచారం. మరోవైపు హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది ఇక్కడికి వేట కోసం వస్తున్నట్లు తెలుస్తోంది. వీరు ఎక్కువగా సెలవులు, పండగ పర్వదినాల సందర్భంగా తరచూ ఇక్కడికి వచ్చి షికారి చేస్తున్నారు.

వైల్డ్​ లైఫ్ క్రైం కంట్రోల్​ బోర్డు ఆదేశాలమేరకు జిల్లా ఫారెస్ట ఆఫీసర్లు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెంచామంటున్నారు. కూంబింగ్ విధానంలోనే వేటగాళ్ల కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వేటగాళ్ల దృష్టంతా పెద్దపులులపైనే ఉందని పులుల సంఖ్యపై, అవి సంచరించే ప్రాంతాలు, నివసించే ఏరియా వివరాలు ఎవరికీ తెలియకుండా గోప్యత పాటించాలంటూ క్రైం బోర్డ్ సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. స్వచ్ఛంద సంస్థలకు సైతం వన్యప్రాణులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించవద్దంది. డబ్యూసీసీబీ, ఎన్‌టీసీఏ జారీ చేసిన వార్నింగ్‌తో జిల్లా అటవీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. జిల్లాలోని పేరుమోసిన వేటగాళ్ల పైనే కాకుండా పొరుగు రాష్ట్రాల హంటర్ల లిస్ట్‌ సేకరిస్తున్నామన్నారు. గతంలో పట్టుబడ్డ వేటగాళ్లను పిలిపించి విచారిస్తున్నట్లు తెలిపారు.

నిరంతర తనిఖీలు చేస్తున్నాం

వన్యప్రాణులను వేటాడేందుకు కొందరు వేటగాళ్లు తిరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాం. ఎప్పటికప్పుడు నిఘా పెంచుతున్నాం.   –సీసీ వినోద్​కుమార్​, సీఎఫ్

 

Latest Updates