అప్పులు గొప్పకాదు: నిధులపై కేసీఆర్​, కేటీఆర్​ చర్చకు వస్తరా?

రుణాల కోసం కార్పొరేషన్లు పెట్టిన ఘనత టీఆర్​ఎస్​ది
రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో అసెంబ్లీలో కేసీఆరే చెప్పారు
రెండు లక్షల ఇండ్లిస్తే.. ఆరేండ్లయినా కట్టలేదు..
నిధులపై కేసీఆర్​, కేటీఆర్​ చర్చకు వస్తరా?
మోడీ వీళ్ల లెక్క పక్షపాతంతో సొంతూరిలో ఇంటింటికి లక్షలు పంచలేదు
303 మంది ఎంపీలున్న పార్టీని ప్రాంతీయ పార్టీ అంటరా?

హైదరాబాద్, వెలుగుఅప్పులు చేయటం గొప్పదనం కాదని, అప్పులు తెచ్చేందుకు ఇష్టమొచ్చినట్లు కార్పొరేషన్లు పెట్టిన ఘనత టీఆర్​ఎస్​ సర్కార్​ది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు.‘‘అప్పులు తీసుకోవద్దని కాదు. ఉన్నంతలో పరిమితి మేరకు అప్పులు తీసుకోవాలి. కేసీఆర్, కేటీఆర్​ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం కేంద్రానికి లేదు” అని అన్నారు. తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీకి, ప్రతి మున్సిపాలిటీకి గడిచిన ఆరేండ్లలో ఎన్ని నిధులిచ్చామో.. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చర్చకు వస్తారా..? అని సీఎం కేసీఆర్​కు, మంత్రి కేటీఆర్​కు ఆయన సవాల్​ విసిరారు. పక్షపాతంగా సొంతూరిలో ఇంటింటికో రూ. 10 లక్షలు ఇచ్చే అలవాటు తమకు లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నోట్లు ముద్రించే కంపెనీ కాదని, రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత దానిపై ఉందని తెలిపారు.  శనివారం కిషన్​రెడ్డి ‘వీ6- వెలుగు ’కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై మాట్లాడారు. తెలంగాణకు కేంద్రం నిధులేమీ ఇవ్వలేదంటూ సీఎం కేసీఆర్​, మంత్రి  కేటీఆర్ చేసిన విమర్శలపై ఆయన సూటిగా స్పందించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో టీఆర్​ఎస్​కు బీజేపీనే ప్రత్యామ్నాయ పార్టీ అని చెప్పారు.టీఆర్​ఎస్​మాదిరిగా తమది వందల వేల కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేసే పార్టీ కాదని, అధికారాన్ని దుర్వినియోగం చేసే పార్టీ కాదని అన్నారు.

వీ6 వెలుగు: ఆరేండ్లుగా రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోలేదని, అభివృద్ధికి నిధులిచ్చిందేమీ లేదని సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లపై మీరేమంటారు?

కిషన్​రెడ్డి: అసెంబ్లీ రికార్డులు చూసుకోండి. గతంలో రెండు గంటలపాటు కేసీఆర్​ కేంద్రాన్ని ప్రశంసించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆరేండ్ల కిందటివరకు తెలంగాణలో ఎన్ని నేషనల్​ హైవేస్​ ఉన్నాయో.. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక  ఎన్ని హైవేస్​ వచ్చాయో చూడండి. కేసీఆర్​ ఆన్​ ది రికార్డు మాట్లాడారు. అంతకు మించి చెప్పేదేముంది. ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు.. కేంద్ర ప్రభుత్వం దేశమంతా అభివృద్ధి చేస్తోంది. రూపాయికి కిలోబియ్యం పథకంలో ప్రతి కేజీకి రాష్ట్రం రూ. 2 ఇస్తే.. కేంద్రం రూ. 28 ఇస్తోంది. అది కేంద్రం ఇచ్చినట్లు కాదా..? ఇండ్ల నిర్మాణానికి కేంద్రం దేశమంతటికీ డబ్బులిస్తోంది. ఏపీకి ఇరవై లక్షల ఇండ్లు ఇచ్చినం. తెలంగాణకు ఇచ్చిన 2 లక్షల ఇండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టలేకపోయింది. అది దురదృష్టం. నిధులన్నీ మురిగిపోతున్నయ్. ఆరేండ్లయింది. లబ్ధిదారులకు ఒక్క ఇల్లు ఇవ్వలే. కనీసం హౌసింగ్​ మినిస్ట్రీ  రివ్యూ మీటింగ్​కు వచ్చేందుకు కూడా ఇక్కడి నేతలకు ముఖం లేదు.

కాళేశ్వరం, భగీరథలకు నిధులేమీ ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అంటున్నారు కదా?

ప్రగతిభవన్​లో మీ ఇంట్లో డైనింగ్​ టేబుల్​ దగ్గర మీరే చర్చించుకొని పథకాలు పెట్టుకొని.. కేంద్ర ప్రభుత్వం డబ్బులివ్వాలంటే ఎట్ల?  ఏ రాష్ట్రానికా రాష్ట్రం కొత్త స్కీం పెట్టుకొని డబ్బులు అట్లనే అడిగితే కేంద్రం ఇస్తుందా..? కేంద్ర ప్రభుత్వం నోట్లు  ముద్రించే కంపెనీ కాదు. దేశ ఆర్థిక వనరులను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది.

ప్రత్యేకంగా తెలంగాణకు ఇచ్చిందేమీ లేదనే విమర్శలున్నాయి?

కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తోంది. తెలంగాణకు ప్రత్యేకంగా ఎట్లిస్తరు? మీలాగా పక్షపాతం మాకు లేదు. అన్ని రాష్ట్రాలు మాకు ఒక్కటే. ఏ రాష్ట్రానికి అన్యాయం చెయ్యదు. సబ్​కా సాథ్​.. సబ్​కా వికాస్​.. సబ్​కా విశ్వాస్​ అనే నినాదం మా ప్రభుత్వానిది. మీలెక్క గజ్వేల్​కు సెపరేట్​ కార్పొరేషన్​ పెట్టుకోవటం.. ముఖ్యమంత్రి సొంతూరిలో ఇంటింటికి పది లక్షలు ఇవ్వటం ప్రధాని మోడీకి అలవాటు లేదు. ప్రత్యేకంగా నిధులివ్వటం మోడీకి ఇష్టం లేదు. తెలంగాణకు ఇవ్వలేదంటున్నారు.. ఏ రాష్ట్రానికైనా ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చారా? ప్రధాని ఎక్కడన్నా ఒక్క రూపాయి దుర్వినియోగం చేశారా?  వచ్చే డబ్బును కాళేశ్వరం కమీషన్ల లాగా కొట్టేశారా..? కాంగ్రెసోళ్లలాగా కుంభకోణాల్లో కొట్టేశారా? ఎక్కడైనా పొరపాటు చేసినట్లు చూపించగలరా..?

రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులకు కేంద్రమే కారణమని మంత్రి కేటీఆర్​ అన్నారు. మీ సమాధానం?

ఇది ఆడలేక మద్దలోడు అన్నట్లు ఉంది. ప్రాజెక్టులు పెట్టుకున్నది మీరు. బడ్జెట్​ అంతా దానికే పెట్టుకుంటున్నరు. అందుకే  ఫీజు రీయింబర్స్​మెంట్​ సరిగ్గా ఇస్తలేరు. ఆరోగ్యశ్రీని సరిగ్గా అమలు చెయ్యలేకపోతున్నరు. పెన్షన్ టైమ్​కు​ ఇవ్వలేకపోతున్నరు. అదెవరి పొరపాటు? కేంద్రం తప్పు ఎలా అవుతది?

రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం ఇవ్వలేదనే విమర్శలున్నాయి?

ప్రతి ఒక్కరు ఎకనామిక్​ పాలసీ గురించి మాట్లాడుతున్నరు. రాష్ట్రాలకు గతంలో 32 పర్సెంట్​ ఉన్న పన్నుల వాటా 41 శాతం పెరిగింది. అది మంచి పరిణామం కాదా, రాష్ట్రాలు స్వయం సమృద్ధిగా ఉండాలి. ఎలక్ట్రిసిటీ బోర్డులన్నీ సొంత కాళ్ల మీద నిలబడాలనే సంస్కరణలు తెచ్చిందెవరు? స్థానిక సంస్థలను ప్రోత్సహించిందెవరు? ఆరేండ్లుగా  పంచాయతీలకు.. మున్సిపాలిటీలకు మీరు (రాష్ట్రం) ఎన్ని నిధులిచ్చారు.. కేంద్రం ఎన్ని ఇచ్చింది?  దీనిపై కేసీఆర్​, కేటీఆర్​ చర్చకు సిద్ధమా?

రాష్ట్రం కేంద్రానికి 2 లక్షల కోట్లకు మించి పన్నులు కడితే.. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది రూ.1.12 లక్షల కోట్లే అని కేటీఆర్​అంటున్నారు కదా.. రాజ్యాంగబద్ధంగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయమనేది ప్రజల డబ్బు. కేంద్రం, రాష్ట్రాలు దాన్ని ఎలా ఖర్చు చేయాలో రాజ్యాంగం చెబుతోంది. ఇటీవలే రాష్ట్రానికి ఎన్ని నిధులిచ్చారో ఆర్థిక మంత్రి రాజ్యసభలోనే ప్రకటించారు. ఉపాధి హామీ నిధులతోనే తెలంగాణలో గ్రామ పంచాయతీల్లో రోడ్డు, చెరువుల్లో పూడిక తీసేందుకు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ కేంద్రం ఇచ్చిన నిధులు కావా..?  గ్రామాలకు నిధులు నేరుగా ఇస్తే.. ఎందుకు నేరుగా ఇవ్వాలని కేసీఆర్​ అడుగుతున్నారు. మీకిస్తే మీరు గ్రామాలకు ఇవ్వరు.. మేమిస్తే ఇవ్వనివ్వరు.. ఇచ్చినా మీకు బాధనే.

మేకిన్​ ఇండియా.. అసెంబ్లింగ్​ ఇన్​ ఇండియాగా మారిందనే కేటీఆర్​ కామెంట్లపై..?

దేశంలో ఉన్న రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఇక్కడ పెట్టుబడులు పెడితే సేఫ్​ అని అనుకున్నప్పుడే పెట్టుబడులు వస్తాయి. మేకిన్​ ఇండియా ద్వారా హైదరాబాద్​కు ఎన్ని ఇండస్ట్రీలు వచ్చాయో ఆలోచించుకోండి. మీ ముఖం, నా ముఖం.. కేటీఆర్​ ముఖం చూసో తెలంగాణకు పెట్టుబడులు, కంపెనీలు వస్తున్నాయనుకుంటే తప్పు. దక్షిణ భారతదేశంలో ఉన్న  వాతావరణం కూడా చూసి కంపెనీలు వస్తున్నాయి. రాజశేఖర్​రెడ్డి, చంద్రబాబు సీఎంలుగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికెన్నో  కంపెనీలు వచ్చాయి. కేటీఆర్​ జబ్బలు చరుచుకొని తానే తీసుకొని వస్తున్నానంటే తప్పు.

కేటీఆర్ అప్పుల పరిమితి పెంచాలి, ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలని ​ అన్నారు? మీరేమంటారు?

భవిష్యత్తు తరాలు ఏమైనా ఫర్వాలేదని,  దేశం ఏమైనా ఫర్వాలేదని అనుకుంటే ఎన్ని లక్షల కోట్లయినా మోడీ అప్పులు తీసుకురాలేరా..? విదేశీ అప్పులు తగ్గిస్తున్నాం. ఆరేండ్లుగా వరుసగా తగ్గించే పాలసీ అమలు చేస్తున్నం. అప్పులు చేయటం గొప్పదనం కాదు. అప్పులు తెచ్చేందుకు ఇష్టమొచ్చినట్లు కార్పొరేషన్లు పెట్టిన ఘనత మీది. జీహెచ్​ఎంసీ ఒక కార్పొరేషన్​. అందులో రోడ్లు వేసేందుకు కార్పొరేషన్, మూసీకో కార్పొరేషన్​ అప్పులు తెచ్చేందుకు  ెట్టుకున్నవి కాదా..?  అప్పులు తీసుకోవద్దని కాదు. ఉన్నంతలో పరిమితి మేరకు అప్పులు తీసుకోవాలి. కేసీఆర్, కేటీఆర్​ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం కేంద్రానికి లేదు.

విభజన చట్టం హామీలు ఎప్పట్లోగా నెరవేరుస్తరు?

బయ్యారంలో స్టీల్​ ఫ్యాక్టరీ పెడితే మనుగడ సాధ్యమైతదా, అక్కడి ముడిసరుకు మార్కెట్​లో ఉంటుందా.. లేదా.. ఆలోచించాలి. ఈరోజు పెట్టి రేపు మూసివేసే పరిస్థితి ఉండకుండా ముందే ఆలోచించాలి. ఆర్టీసీని ఎందుకు మూసేస్తానన్నవ్​? గతంలో ఆల్విన్​, ప్రాగా టూల్స్ ఎందుకు మూతపడ్డాయి? అవన్నీ ముందే ఆలోచించాలి. విభజన చట్టంలో పెండింగ్​లో ఉన్న అంశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.

మున్సిపోల్స్​ రిజల్ట్స్​ సంతృప్తినిచ్చాయా? 

టీఆర్​ఎస్ లా అధికార దుర్వినియోగం చేసే పార్టీ మాది కాదు. వందల వేల కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేసి ఓట్లు కొనుగోలు చేసే పార్టీ కాదు. రానున్న రోజుల్లో బీజేపీ ఒక్కటే టీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్​కు భవిష్యత్తు ఉండదు. ఆ పార్టీకి అధ్యక్షుడెవరంటే చెప్పలేని పరిస్థితి వాళ్లది. మాకింకా నాలుగేండ్ల టైమ్​ ఉంది. ఈలోగా అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటాం. తెలంగాణ ప్రజల విశ్వాసం పొందుతాం.

ఇండ్ల నిర్మాణానికి కేంద్రం దేశమంతటికీ డబ్బులిస్తోంది. ఏపీకి ఇరవై లక్షల ఇండ్లు ఇచ్చినం. తెలంగాణకు ఇచ్చిన 2 లక్షల ఇండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టలేకపోయింది. అది దురదృష్టం. నిధులన్నీ మురిగిపోతున్నయ్. ఆరేండ్ల నుంచి లబ్ధిదారులకు ఒక్క ఇల్లూ ఇవ్వలేదు. కనీసం హౌసింగ్​ మినిస్ట్రీ  రివ్యూ మీటింగ్​కు వచ్చేందుకు కూడా ఇక్కడి నేతలకు ముఖం లేదు.

మీలెక్క గజ్వేల్​కు సెపరేట్​ కార్పొరేషన్​ పెట్టుకోవటం.. ముఖ్యమంత్రి సొంతూరిలో ఇంటింటికి పది లక్షలు ఇవ్వటం ప్రధాని మోడీకి అలవాటు లేదు. ప్రత్యేకంగా నిధులివ్వటం మోడీకి ఇష్టం లేదు. తెలంగాణకు ఇవ్వలేదంటున్నారు.. ఏ రాష్ట్రానికైనా ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చారా? ప్రధాని ఎక్కడన్నా ఒక్క రూపాయి అయినా దుర్వినియోగం చేశారా?  వచ్చే డబ్బును కాళేశ్వరం కమీషన్ల లాగా కొట్టేశారా..? కాంగ్రెసోళ్లలాగా కుంభకోణాల్లో కొట్టేశారా? ఎక్కడైనా పొరపాటు చేసినట్లు చూపించగలరా..?

మరిన్ని వార్తల కోసం

Latest Updates