57 ఏళ్లకే పెన్షన్… ఆసరా డబుల్.. ఎకరానికి రూ.5వేలు : కేసీఆర్

హైదరాబాద్ : టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని కీలక అంశాలను గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇది పాక్షిక ఎన్నికల ప్రణాళిక మాత్రమే అని.. పూర్తిస్థాయి ఎలక్షన్ మేనిఫెస్టోను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైతే ఇప్పుడు చేసినట్టుగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. గతంలో లాగా కాకుండా ఒకటి, రెండు విడతల్లోనే రుణాలను మాఫీ చేస్తామన్నారు.

రైతును రాజు చేసే ఉద్దేశంతో రైతు బంధు పథకం అమలు చేస్తున్నామన్న కేసీఆర్.. ఈసారి రైతు బంధు స్కీమ్ కింద.. ఎకరానికి రూ.ఐదు వేలు ఇస్తామన్నారు. ఏడాదికి రెండుసార్లు రైతు బంధు స్కీమ్ రైతులకు రూ.పది వేల పంట సాయం అందిస్తామన్నారు.

రైతు సమన్వయ సమితులు యాక్టివ్ చేస్తామన్న ముఖ్యమంత్రి.. వారికి గౌరవ భృతి ఇస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఐకేపీ మహిళలను భాగస్వామ్యం చేస్తామన్నారు.

ఆసరా పెన్షన్ల వయో పరిమితిని తగ్గించిన కేసీఆర్.. ఈసారి 57 ఏండ్లు దాటిన వారందరికీ ఆసరా పెన్షన్లను అమలు చేస్తామని చెప్పారు కేసీఆర్. ఆసరా పెన్షన్లను వెయ్యి నుంచి రూ.2,016 కు పెంచుతున్నామన్నారు. వికలాంగులకు రూ.3,016 ఇస్తామన్నారు. ఇప్పటివరకు దాదాపు 40లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం…. కొత్తగా 8లక్షల మంది పెన్షనర్లు పెరుగుతారని అన్నారు.

నిరుద్యోగులందరికీ… రూ.3వేల పదహార్లు భృతి ఇస్తామన్నారు కేసీఆర్. ఇది చాలా గొట్టు సమస్య అనీ… ఎలా ఇవ్వాలి అనేదానిపై ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెకానిజం రూపొందించి ఇస్తామన్నారు.

అనుకున్న ప్రకారం 2లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తాం… సొంత జాగాలో కట్టుకుంటాం అంటే కూడా కట్టిస్తాం…. డబ్బులు ఇస్తే కట్టుకుంటాం అనేవాళ్లకు డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తాం అని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఎస్సీ, ఎస్టీలతోపాటు… రెడ్డి, వైశ్య అగ్ర కులాల్లోని పేదలకు కార్పొరేషన్లు ఏర్పాటుచేసి కార్పస్ ఫండ్ ఇస్తామని హామీ ఇచ్చారు గులాబీబాస్.

Posted in Uncategorized

Latest Updates