కేటీఆర్ కు నా ఆశీస్సులు

‘‘రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు.. ఈ జిల్లా ఆ జిల్లా అనే తారతమ్యం లేకుండా 360 డిగ్రీల్లో ఒకే రకమైన ఫలితాలను వెల్లడించారు. ఆరుసంవత్సరాలుగా టీఆర్​ఎస్​ పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలు, విధానాలు.. వీటన్నింటిపై చర్చోపచర్చాల తర్వాత అద్భుతంగా బలపరిచారు. ఇతరులు ఏం మాట్లాడిన పట్టించుకోకండని, మీరు నిర్దేశించుకున్న లక్ష్యంవైపు పయనించాలని ఈ ఫలితాలు ఆదేశించినట్లుగా భావిస్తున్నం” అని కేసీఆర్​ అన్నారు. ‘‘మేం అవలంబించే సెక్యూలర్​ విధానం. అందరినీ కలుపుకుపోయే పద్ధతి ప్రజలకు నచ్చిందని ఈ ఎన్నికల సందేశం ద్వారా అర్థమవుతుంది. వెన్నుతట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజానికానికి వ్యక్తిగతంగా శిరస్సు వంచి ప్రత్యేకంగా కృతజ్ఞాతాభినందనలు తెలియజేస్తున్న. ఈ గెలుపుకోసం పాటుపడి కార్యకర్తలకు అభినందనలు. ముఖ్యంగా పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రామారావుకు నా ఆశీస్సులు తెలియజేస్తున్న” అని తెలిపారు. లోకల్​బాడీ ఎలక్షన్లలో ఇంత ఘన విజయం తన 40 ఏండ్ల రాజకీయ అనుభవంలో చూడలేదని చెప్పారు. ‘‘1994లో నేను ఎన్టీఆర్​తో కలిసి పనిచేసిన. మేం అప్పుడు మద్య నిషేధం ప్రకటించినం. అప్పుడు జనం విజయం కట్టబెట్టిండ్రు. మద్య నిషేధం వల్ల మా మీద భారం పడింది. దీంతో సేల్స్​ ట్యాక్స్​ పెంచగానే.. మళ్లీ ఎన్నికల్లో ఓడగొట్టారు. అప్పుడు మున్సిపాలిటీలో కూడా ఓడిపోయినం” అని గుర్తుచేశారు.

అవసరమైతే కాంగ్రెస్​తో  కలిసి పనిచేస్తాం

సీఏఏ ను వ్యతిరేకించే విషయంలో  కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని కేసీఆర్​ తెలిపారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో బొంత పురుగుతో కూడా కలిసి పని జేస్తామని చెప్పినం. అట్లనే కలిసి పనిజేసినం. ఇప్పుడు కూడా ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధం’ అని చెప్పారు. సీఏఏ ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని, ఆ పార్టీతో కలిసి పనిచేస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగినా ప్రశ్నకు కేసీఆర్ పైవిధంగా బదులిచ్చారు.

57 ఏండ్లు దాటితే పింఛను

57 ఏండ్లు దాటిన వారికి వృద్ధాప్య పింఛన్లు అమలు కోసం బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని కేసీఆర్​ అన్నారు. ‘‘ఎలక్షన్ల హామీలను అమలు చేస్తం. 57 ఏండ్ల వయసు దాటిన వారికి వృద్ధాప్య పింఛన్​ ఇస్తం. ఇందుకోసం ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్  సమావేశాల్లో నిధులు పెడ్తం. మార్చి 31 నుంచి అమలు చేస్తం’ అని తెలిపారు. నిరుద్యోగ భృతి హామీని కూడా అమలు చేస్తామని చెప్పారు. అయితే నిరుద్యోగులు ఎవరు, ఎంత మంది ఉన్నారో అనే విషయంపై క్లారిటీ రాలేదని, త్వరలో దానిపై విధివిధానాలు తయారు చేస్తామన్నారు.

రిటైర్మెంట్ వయసు పెంపు..

ఉద్యోగుల రిటైర్మెంట్  వయసును కూడా పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. అలాగే పీఆర్సీ కూడా అమలు చేస్తామని తెలిపారు. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని పీఆర్సీ అమలు చేస్తామన్నారు. ‘‘ఎంతో కొంత ఇవ్వక తప్పదు.తృణమో, ప్రణమో ఇవ్వాలి కదా. వారు కూడా ఆశపడతరు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు భయోత్పాతంలా ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సక్కగ పని చేస్తలేదు. మరి ఎందుకు పని చేస్తలేదో అర్థం కావడం లేదు. అసలు వాళ్ల ఆలోచన సరళి కూడా సరిగ్గా లేదు” అని వ్యాఖ్యానించారు. పీఆర్సీ, జీతాలు పెంచాలంటే కేంద్రం కథ ఇట్ల ఉందని, ఉద్యోగస్తులను పిలిచి తానే స్వయంగా మాట్లాడతానని చెప్పారు.

సోషల్ మీడియాపై కంట్రోల్

మున్సిపోల్స్‌‌ సందర్భంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ప్రతిపక్షాలు వ్యవహరించాయని కేసీఆర్​ మండిపడ్డారు. సోషల్ మీడియాపై కట్టడి ఉండాలని, అది యాంటీ సోషల్ మీడియా గా మారిందని అన్నారు. ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్ లు పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు.

సిలబస్‌‌లో నైతిక విలువలు

పిల్లల్లో చిన్నప్పట్నించే నైతిక విలువలు పెంచేందుకు స్కూళ్లలో మోరల్ వాల్యూయిస్ పెంచేలా సెలబస్ ఉండేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్​ చెప్పారు. ప్రతిపక్షాల పాపం వల్ల రాష్ట్రంలో నిరక్షరాస్యత అలాగే ఉందని, దీన్ని రూపు మాపడం కోసం ‘ఈచ్ వన్ టీచ్ వన్ ’ కార్యక్రమం చేపడుతామని తెలిపారు. ఏడాదిలో నిరక్ష్యరాస్యత నిర్మూలనకు కృషి చేస్తామన్నారు.  కొత్త చైర్‌‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరికీ ప్రభుత్వపరంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని కేసీఆర్‌‌ ప్రకటించారు.  హైదరాబాద్‌‌ నడి బొడ్డున ఖానామెట్‌‌లో ‘అర్బన్‌‌ సెంటర్‌‌ ఆఫ్‌‌ ఎక్సలెన్స్‌‌’కు 20 ఎకరాల స్థలం ఇప్పటికే కేటాయించామని, త్వరలో దానిని ప్రారంభిస్తామని తెలిపారు.

భైంసా ఘటన వెనుక వాళ్లే

మతతత్వ పార్టీ వైఖరి వల్లే భైంసా ఘటన జరిగిందని కేసీఆర్​ విమర్శించారు. ఆ ఘటన జరిగిన వెంటనే స్పందించామన్నారు. అక్కడ ఎన్నికలు సాఫీగా జరిగేలా చూశామని తెలిపారు. ‘‘వీళ్ల వల్లే  భైంసా లొల్లి జరిగింది. ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకోమని గతంలోనే చెప్పినం. ఇలాంటి వారిని ఉక్కు పాదంతో తొక్కేస్తామని, పీడీ యాక్టు పెడుతామని హెచ్చరించినం. ఎటువంటి దుష్టశక్తులను తీసిపారేసినమో మీకు కనబడటం లేదా?’’ అని అన్నారు.

మొరిగే కుక్కలున్నయి

‘‘ప్రతిపక్షాల వాళ్ల నోటికి మొక్కాలె. కొన్ని నిరంతరంగా మొరిగే కుక్కలున్నయి. అవి ఈ ఎన్నికల్లో కూడా బహుళంగనే మొరిగినయ్” అని సీఎం విమర్శించారు. వాళ్లు ఏం మాట్లాడుతరో, ఏందో తెలియదని దుయ్యబట్టారు. ఇలాంటివాళ్లను చూస్తే రాజకీయాల మీద ప్రజలకు అసహ్యం కలుగుతోందన్నారు. ‘‘ఇప్పటికే మన బతుకులు పేపర్​ కార్టూన్లయినయి.  తిట్టదానికి ఎంతైనా తిట్టొచ్చు.. దానికంటూ ఒక హద్దు ఉంటుంది. ఇష్టమొచ్చినట్లు మొరుగుతం అంటే కుదరదు. ఇష్టమొచ్చిన భాషలో మాట్లాడుతం అంటే అది పద్ధతి కాదు”అని అన్నారు. ‘‘వేల కోట్లు మేం ఖర్చు చేసినం అంటున్నరు. ఏదో చూపెడుతరా? మా పార్టీ పెట్టిన ఖర్చు  80 లక్షలే. అది మెటీరియల్​ కోసమే’’ అని తెలిపారు.

ఐదేండ్లు ఎంజాయ్.. ఇప్పుడు..

ఐదేండ్లు రాష్ట్రం చాలా ఎంజాయ్‌‌ చేసిందని, ఇండియాలో నంబర్‌‌ వన్‌‌గా నిలిచిందని కేసీఆర్‌‌  అన్నారు. ఇదేదో రాజకీయ ప్రకటన కాదని, కాగ్‌‌ చెప్పిన లెక్క అని తెలిపారు. ఏటా వృద్ధి అంతకంతకు పెరుగుతూ 21 శాతం పెరుగుదల ఉండేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం వృద్ధి 9.5 శాతానికి పడిపోయిందని తెలిపారు. మంత్రులు, కార్యదర్శులను అలర్ట్‌‌ చేసి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని చెప్పామన్నారు. గతంలో ఎవరొచ్చి నిధులు అడిగినా ఇచ్చే వాళ్లమని, కాని ఇప్పుడు పది రూపాయలు ఇవ్వాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

నిధుల కోసం ప్రధానికి లేఖ రాస్త

రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన ఎస్ జీఎస్టీ, ఐజీఎస్టీ నిధులు ఇవ్వడం లేదని కేసీఆర్ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు ఆందోళన చేస్తే రూ. వెయ్యి కోట్లు ఇచ్చారని అన్నారు. ఇంకా రూ. 1,130 కోట్లు పెండింగ్ లోఉన్నాయని,  ఐజీఎస్టీ కింద మరో రూ. 2,811 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. ఈ విషయంలో త్వరలో ప్రధానికి లేఖ రాస్తామని చెప్పారు. ‘‘బీజేపీ నాయకుల వ్యవహారం మాటలు కోటలు దాటుతయి.. కాళ్లు తంగేడు దాటవన్నట్లుగా ఉంది’’ అని సీఎం ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిస్థితి గమ్మత్తుగా ఉందని, వాళ్లు చెప్పకున్నా పార్లమెంటుకు లెక్కలు ఇవ్వాల్సి ఉంటుందని, జీడీపీ ఎంత శాతం ఉందో కాగ్ రిపోర్టులో తేలుతుందని చెప్పారు. ‘‘ఆర్థిక పరిస్థితి మొత్తం మునిగిపోయేలా ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. వచ్చే సంవత్సరం జీరో పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు’’
అని తెలిపారు.

పకడ్బందీగా హెల్త్‌‌ ప్రొఫైల్‌‌

త్వరలోనే తెలంగాణ హెల్త్‌‌ ప్రొఫైల్‌‌ రూపకల్పనకు శ్రీకారం చుడుతామని సీఎం కేసీఆర్‌‌ ప్రకటించారు. ఇది నెమ్మదిగా జరిగే కార్యక్రమమని, హెల్త్‌‌ ప్రొఫైల్‌‌ ఒకరిది మరొకరికి రాస్తే ప్రమాదమైనందున నెమ్మదిగా, పకడ్బందీగా చేయాల్సి ఉంటుందని చెప్పారు.

త్వరలో ఎన్నారై పాలసీ

కొన్ని రాష్ట్రాల్లో ఎన్నారై పాలసీ ఉందని, తెలంగాణ ఎన్నారై పాలసీ కావాలని ముఖ్యంగా గల్ఫ్​లో ఉండే వాళ్లు కోరుతున్నారని కేసీఆర్‌‌  తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో ఎన్నారై పాలసీ తీసుకోస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముందో, వెనకో  తను స్వయంగా గల్ఫ్ కు వెళ్లి, అక్కడున్న తెలంగాణ వాసులతో మాట్లాడుతానని అన్నారు.

పాపం పెరిగినట్టు హైదరాబాద్ పెరిగిపోతోంది

పాపం పెరిగినట్టు హైదరాబాద్ నగరం విస్తరిస్తోందని కేసీఆర్  వ్యాఖ్యానించారు. శివారు ప్రాంతాలు శర వేగంగా విస్తరిస్తున్నాయని చెప్పారు. ఎల్బీనగర్‌‌, కూకట్‌‌పల్లి, కుత్బుల్లాపూర్‌‌, రాజేంద్రనగర్‌‌ వంటి నియోజకవర్గాల్లో జనాభా పాపం పెరిగినట్లు పెరుగుతున్నాయని, డీలిమిటేషన్‌‌ సమయంలో మూడు లక్షల ఓటర్లకు కుదించితే మళ్లీ ఇప్పుడు 7-, 8 లక్షలకు పెరిగిపోయాయన్నారు. విస్తరిస్తున్న నగరాలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు కోసం ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు  ‘అర్బన్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ’ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌‌ చుట్టూ 1.50 లక్షల ఎకరాల అటవీభూమి ఉందని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కేసీఆర్​ అన్నారు.

Latest Updates