లాక్ డౌన్ పై కేంద్రం సడలింపులు..కేసీఆర్ కు నచ్చలేదా?

  • ఈ నెల 20 నుంచి ఏం చేద్దామని మంతనాలు
  • మే 3 వరకు లాక్​డౌన్​ కొనసాగింపుపై చర్చలు
  • పనులకు పర్మిషన్​ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని భావన
  • అడిగిన నిధులివ్వలేదని కేంద్రంపై అసంతృప్తి
  • 19న  రాష్ట్ర కేబినేట్​ భేటీ.. అందులో చర్చించి తుది నిర్ణయం

హైదరాబాద్, వెలుగు:లాక్​ డౌన్​కు సడలింపులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం నారాజ్​గా ఉంది. గత నెల 24 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్​డౌన్​తో జనం పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా కేంద్రం ఈ నెల 20 నుంచి కొన్ని సడలింపులుండేలా గైడ్​లైన్స్​ జారీ చేసింది. ఇందులో రోజువారీ కూలీలు, కార్మికులకు పని దొరికేలా.. అత్యవసర విభాగాలు, ఉత్పత్తి రంగాలు మళ్లీ పట్టాలెక్కేలా వెసులుబాటు కల్పించింది. కానీ.. ఇవేవీ తెలంగాణ ఆర్థిక ఇబ్బందులను దూరం చేసేలా లేవని, తమ విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కేంద్రం ఇచ్చిన సడలింపులను ఈ నెల 20 నుంచి రాష్ట్రంలో అమలు చేయాలా..? లేక ఇవేవీ లేకుండా  మే 3 వరకు​ లాక్​డౌన్​ను ఇప్పటిలాగానే కొనసాగించాలా..? అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ నెల 19న మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్​ డౌన్ అమలు అంశాలనే కేబినెట్​ భేటీకి ఎజెండాగా నిర్ణయించారు. కేబినెట్​ భేటీలో జరిగే చర్చల ఆధారంగానే రాష్ట్రంలో సడలింపుల అమలు అంశంపై తదుపరి నిర్ణయం తీసుకోవచ్చని అధికార వర్గాలు అంటున్నాయి.

ఇటీవల ప్రధాని మోడీతో సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం కేసీఆర్​.. అదే రోజున ప్రధానికి లెటర్​ రాశారు. రాష్ట్రాలకు హెలిక్యాప్టర్​ మనీ పంపిణీ చేయాలని, రాష్ట్రాలకున్న అప్పుల కిస్తీల చెల్లింపులను ఆరు నెలలు వాయిదా వేయాలని, మరిన్ని అప్పులు తెచ్చుకునేందుకు వీలుగా ఎఫ్ఆర్​బీఎం పరిమితిని 5 శాతానికి పెంచాలని ఆ లేఖలో కేసీఆర్​ కోరారు. వీటిపై  కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రాలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా లాక్​ డౌన్​లో సడలింపులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంతో  నిధుల కోసం రాష్ట్రాలు ఒత్తిడి పెంచకుండా కేంద్రం కట్టడి చేసిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆశలకు గండి పడినట్లయింది. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్న టైంలో కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయనే అంచనాలన్నీ తలకిందులయ్యాయని ఓ ఉన్నతాధికారి అన్నారు. కరోనా ఎఫెక్ట్​తో  రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. రోజూ రూ. 400 కోట్ల వరకు రావాల్సిన ఆదాయం  రూ. 6 కోట్లకు పడిపోయిందని సీఎం ఇటీవల ప్రెస్​మీట్​లో వెల్లడించారు. కానీ.. అప్పటికే చేపట్టిన ప్రాజెక్టులు, అమలు చేసిన స్కీంల కోసం భారీగా చేసిన అప్పులు, ఖర్చులతోనే రాష్ట్ర ఖజానా డొల్ల అయింది. కరోనా సంక్షోభ సమయంలో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయం కొంత కలిసొస్తుందని రాష్ట్ర సర్కారు భావించింది. కానీ.. కేంద్రం నుంచి అటువంటి సంకేతాలు అందకపోవటంతో రాష్ట్ర సర్కారు అసంతృప్తికి లోనైంది. ఈ క్రమంలో ఈ నెల 19న కేబినెట్​ భేటీ జరుగనుంది. ఈ భేటీలో చర్చించి మరోసారి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసే చాన్స్​ ఉందని అధికారులు అంటున్నారు.

లాక్​డౌన్​ పొడిగింపుపై తొందర

లాక్​డౌన్  కొనసాగించటం.. పొడిగించటంలో రాష్ట్ర ప్రభుత్వం తొందరపడింది. ఈ నెలాఖరు వరకు లాక్​డౌన్​ను పొడిగిస్తున్నట్లు ఏప్రిల్​ 11వ తేదీనే సీఎం కేసీఆర్​ ప్రకటించారు. అప్పటికే లాక్​ డౌన్​ కొనసాగుతుండటంతో ఈ నెల 14 తర్వాత సడలింపులుంటాయని నిరీక్షించిన రోజువారీ కూలీలు, పనోళ్లు, చిన్నా చితక వ్యాపారాలు, వృత్తులపై ఆధారపడ్డ కుటుంబాలన్నీ ఆందోళనకు గురయ్యాయి. కొందరు వలస కూలీలు అసహనానికి గురై కిలోమీటర్ల కొద్దీ కాలినడకన సొంత ప్రాంతాలకు బయల్దేరారు. ఈ క్రమంలో ఈ నెల 14న  ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ.. లాక్​డౌన్  పొడిగిస్తూనే కూలీలు, కార్మికులు, ఉత్పత్తి రంగానికి ఊరటనిస్తూ సడలింపులు ఇచ్చారు. దీనిపై బుధవారం గైడ్​లైన్స్​ విడుదలయ్యాయి.

 

Latest Updates