10 తర్వాత KCR ఫెడరల్ టూర్

హైదరాబాద్‌‌, వెలుగు: ఫెడరల్‌‌ ఫ్రంట్‌‌ ఏర్పాటులో భాగంగా టీఆర్‌‌ఎస్‌‌ చీఫ్​, సీఎం కేసీఆర్‌‌ ఈ నెల పదో తేదీ తర్వాత నాలుగు రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్‌‌ రాష్ట్రాల్లో ఆయన పర్యటిస్తారని, అక్కడి ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమవుతారని టీఆర్​ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. అంతకుముందే వైఎస్సార్​సీపీ చీఫ్​ వైఎస్​ జగన్​తో  కేసీఆర్‌‌ హైదరాబాద్​లోని లోటస్​పాండ్​లో సమావేశమయ్యే అవకాశం ఉంది. కేంద్రంలో కాంగ్రెస్‌‌, బీజేపీకి  ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్‌‌ ఫ్రంట్‌‌ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌‌ చెప్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఒడిశా, బెంగాల్‌‌ రాష్ట్రాల్లో రెండుసార్లు, కర్నాటక, తమిళనాడులో ఒకసారి పర్యటించారు. కేంద్రంలో కాంగ్రెస్‌‌కు గానీ, బీజేపీకి గానీ 100, 150కి మించి సీట్లు వచ్చే అవకాశం లేదని టీఆర్‌‌ఎస్‌‌ అంచనా వేస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు విడతల పోలింగ్‌‌ ద్వారా ఇదే విషయం స్పష్టమవుతోందని ఆ పార్టీ ముఖ్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో జట్టుకట్టకుండా ప్రత్యేక కూటమిగా ఏర్పడాలని కేసీఆర్‌‌ ప్రతిపాదిస్తున్నారు. తాజా పర్యటనలోనూ ఇదే విషయాన్ని వివిధ ప్రాంతీయ పార్టీల నేతల ముందు ప్రతిపాదించే అవకాశముంది.

 

Latest Updates