క‌రోనా టెస్టుల్లో కేసీఆర్ స‌ర్కార్ నిర్ల‌క్ష్యం.. రాష్ట్రానిది 22 వ స్థానం

క‌రోనా టెస్టులు చేయడంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్షం వ‌హిస్తోంద‌ని అన్నారు బీజేపీ నేత డీకే అరుణ‌. టెస్టుల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం , హైకోర్టు చెప్పినా ప్ర‌భుత్వం విన‌డం లేదు. దేశంలోనే తెలంగాణ నెంబ‌ర్ వ‌న్ రాష్ట్రం అ‌ని చెప్పుకునే కేసీఆర్.. క‌రోనా టెస్టుల్లో మాత్రం 22వ స్థానంలో ఉందన్నారు. ప‌క్క రాష్ట్రంలో 5 ల‌క్ష‌ల టెస్టులు చేస్తే, తెలంగాణ‌లో 38వేల టెస్టులు మాత్ర‌మే చేసిందంటే ప్ర‌భుత్వం ఎంత నిర్ల‌క్షంగా ఉందో అర్థ‌మ‌వుతోందన్నారు

క‌రోనా టెస్టుల నిర్వ‌హ‌ణ‌కు ఐసీఎంఆర్ అమోదించిన 16 ప్రైవేట్ ల్యాబ్ ల్లో టెస్టులు చేసి ఉంటే రోజుకు 15వేలకు పైగా క‌రోనా ప‌రిక్ష‌లు చేసే అవ‌కాశం ఉండేదన్నారు డీకే అరుణ‌. తెలంగాణలో రోజు కేవలం 500 ల టెస్టులు మాత్ర‌మే చేసి కేసీఆర్ సర్కార్ త‌క్కువ కేసులు చూపించే ప్ర‌య‌త్నం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో డాక్ట‌ర్ల‌కు, పోలీసుల‌కు ఈ ప్ర‌భుత్వం కరోనా నుంచి భ‌ద్ర‌త క‌ల్పించ‌లేకపోతుందని, క‌రోనా విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు న‌మ్మ‌కం కోల్పోతున్నారని ఆమె అన్నారు.

పోతిరెడ్డిపాడు విష‌యంపై ఆమె మాట్లాడుతూ… 203 జీఓ వ‌ల‌న తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుందని అన్నారు. తెలంగాణ‌కు జ‌రిగే అన్యాయంపై కేసీఆర్ కంటే ముందే బీజేపీ అధ్య‌క్షుడు కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. పోతిరెడ్డి పాడుకు నీటిని త‌ర‌లిస్తే కల్వ‌కుర్తి, పాల‌మూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ ల ప‌రిస్థితి ఏంటీ ? అని అరుణ ప్ర‌శ్నించారు. కేసీఆర్ పాల‌మూరు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తే, చూస్తూ ఉరుకోమ‌ని , 203 జీఓ ర‌ద్దు చేసే బాధ్య‌త కేసీఆర్ దే న‌ని ఆమె అన్నారు.

Latest Updates