కేసీఆర్ గ్రాఫ్ పడిపోయింది.. మోడీ గ్రాఫ్ పెరిగింది

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు
ఆర్టీసీ కేంద్రం పరిధిలోకి రాదు
సమ్మె విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆ పార్టీ కార్యాలయంలో చిట్ చాట్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆయన మట్లాడుతూ.. ‘దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేయాలన్న అంశంపై పార్టీలో చర్చ జరగలేదు. ఆ విషయంపై ప్రజల మధ్య చర్చ జరగాలి. అయినా పార్టీలో చర్చ జరిగితే తప్పేంటి? మహారాష్ట్ర రాజకీయంపై విద్యాసాగర్ రావు కొత్తగా ఏం చెప్పలేదు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ఆలోచన బీజేపీకి లేదు. రాష్ట్రంలో సుస్థిర పాలన సాగాలంటే బీజేపీ సీట్ల సంఖ్య మరింత పెరగాలి. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధంగానే ఉన్నాం. అన్ని వార్డుల్లోనూ పోటీ చేస్తాం. రాష్ర్ట ప్రభుత్వ పథకాలైన… రైతు బంధు, కల్యాణ లక్ష్మీ, ఆసరా పెన్షన్లు ప్రజలకు సరిగా అందడం లేదు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక, నంద్యాల ఉప ఎన్నిక తరహాలో జరిగింది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో… ఇక్కడ కూడా అదే జరుగుతుంది.

ఆర్టీసీ కేంద్రం పరిధిలోకి రాదు, సమ్మె విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు. ఆర్టీసీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. సమస్యను కేంద్రం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువెళ్తున్నాం. తెలంగాణలో కేసీఆర్ మొదటి టర్మ్‌లో ఉన్నప్పుడు పథకాలు జోరుగా సాగాయి. రెండో టర్మ్‌లో మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్రంలో పాలన సజావుగా సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై మా పోరాటం ఆగదు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అడ్డదారిలో వెళ్లకుండా రాజ్యాంగ బద్దంగా ముందుకు వెళతాం. ప్రజలలో తిరుగుబాటు వస్తే.. ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా తిరగబడతారు. రాష్ట్రంలో కేసీఆర్ గ్రాఫ్ పడిపోయి, మోడీ గ్రాఫ్ పెరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను మేం ఎల్లవేళలా ఎత్తి చూపెడుతూనే ఉంటాం’ అని ఆయన అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కారణ జన్ముడంటూ.. లక్ష్మణ్ ఆయనను పొగిడారు.

Latest Updates