మేయర్లు, చైర్ పర్సన్ లు ఫొటోలకు పోజులివ్వద్దు

‘‘మేయర్లు, చైర్‌‌పర్సన్లు ఫొటోలకు పోజులివ్వద్దు. డంబాచారాలు పలకొద్దు. అవి మానుకుని ముందు పనిచేయాలె. అన్ని పనులనూ ఓవర్‌‌నైట్‌‌లో చేసేస్తం అన్నట్లుగా మాట్లాడొద్దు’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఏం చేయాల్నో పక్కాగా ప్లాన్ చేసుకోవాలని, అవగాహన ఏర్పరుచుకుని, సమగ్ర కార్యాచరణతో రంగంలోకి దిగాలని సూచించారు. అందరినీ కలుపుకొని పట్టణాలను తీర్చిదిద్దాలన్నారు. సరిగ్గా ఆర్నెల్లు కష్టపడితే పట్టణాలు మంచి దారి పడుతాయని అన్నారు. ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధంకంగానే ఉంటాయని, వాటిని అధిగమించి ముందుకు సాగాలని ఆయన సూచించారు. ‘‘ఎప్పుడూ ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు.. మనమూ గెలవాలె.

మన పట్టణాలను మనమే మార్చుకోవాలె’’ అని పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతిపై మంగళవారం ప్రగతి భవన్‌లో కలెక్టర్లు, అడిషనల్‌కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్‌చైర్‌పర్సన్లు, కమిషనర్లతో ఆయన సమావేశమయ్యారు. పల్లె ప్రగతి పునాదిగా పట్టణ ప్రగతి నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

దళితవాడల నుంచే షురూ చెయ్యాలె

ఆయా పట్టణాలు, నగరాల్లో ఏ పని అయినా సరే ముందు దళితవాడల నుంచే ప్రారంభించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఫోకస్‌చేయాలన్నారు. పాదయాత్రలు కూడా ఆయా ప్రాంతాల్లోనే మొదలుపెట్టాలని ఆదేశించారు. మూడు నెలల్లో పట్టణాలు, నగరాల్లో పబ్లిక్‌టాయిలెట్లు కట్టాలని, ఎనిమిది నెలల్లో కరెంట్‌కు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్నారు. ఆ పనులు చేయకుంటే ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిధులు ఖర్చు చేయడంలో డిసిప్లేన్‌అవసరమని, ప్లాన్‌ప్రకారమే నిధులు ఖర్చు చేయాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సమీక్షించేందుకు మండల అధికారులు గ్రామాల్లో పర్యటించాల్సి ఉన్నా, ఆ పని చేయకుండా నిర్లక్ష్యం చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు గ్రామాల్లో రాత్రిపూట బస చేసి పల్లెప్రగతి టార్గెట్లు కంప్లీట్‌చేయాలన్నారు.

ప్రతి వార్డుకు స్పెషల్‌ ఆఫీసర్‌

ఈనెల 24 నుంచి వచ్చే నెల 4 వరకు నిర్వహించే పట్టణ ప్రగతికి వార్డుల వారీగా ప్లాన్ తయారు చేసుకోవాలని, అన్ని పట్టణాలకు వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. ఈ బాధ్యత కలెక్టర్లు, అడిషనల్‌కలెక్టర్లదని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుని ప్లాన్లు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి వార్డుకు పర్మినెంట్‌గా స్పెషల్‌ఆఫీసర్‌ను నియమించాలని, ఆ వార్డులో ఏం ఉన్నయి? ఇంకా ఏం కావాలి? ఏం చేయాలి? అనేది కచ్చితంగా నిర్ధారించుకోవాలని చెప్పారు.

అన్ని సౌలత్​లు ఉండాలె

స్ట్రీట్‌లైట్లు బాగా వెలగాలని, రోడ్లపై గుంతలు, బొంద లు, గోతులు ఉండొద్దని సీఎం సూచించారు. అన్ని పట్టణాలు పచ్చదనంతో కళకళలాడాలని, డంప్‌యార్డులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. దహన/ఖనన వాటికలు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణ జనాభా అవసరాలకు తగ్గట్టుగా వెజ్‌, నాన్‌వెజ్‌, ఫ్రూట్‌, ఫ్లవర్‌మార్కెట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. స్పోర్ట్స్‌గ్రౌండ్లు, ఓపెన్‌జిమ్‌లు తప్పకుండా ఉండాలని, ఇవన్నీ ఉంటేనే మంచి పట్టణమన్నారు. గవర్నమెంట్‌ప్లేసుల్లో పబ్లిక్‌టాయిలెట్లు కట్టాలని, ఆ స్థలం ఏ డిపార్ట్‌మెంట్‌దైనా దాన్ని టాయిలెట్లకోసం వాడే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నామన్నారు.

రిపేర్లన్నీ పూర్తి కావాలె

రోడ్లపై వ్యాపారాలు చేసుకునే వారి కోసం స్ట్రీట్‌వెండిం గ్‌జోన్స్‌ఏర్పాటు చేయాలని, వాటిలో అన్ని సదుపాయాలు కల్పించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆటోలు, ట్యాక్సీలు, ఇతర వాహనాల కోసం పార్కింగ్‌సౌకర్యం కల్పించాలన్నారు. తుప్పుపట్టిన, వంగిన, రోడ్ల మధ్యలో ఉన్న పోల్స్, ఫుట్‌పాత్‌లపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను మార్చాలని, ఇండ్లపై వేలాడుతున్న వైర్లను సరిచేయాలని, పొట్టి కరెంట్‌పోల్స్​ను తొలగించి పెద్దవి వేయాలని ఆదేశించారు. ఈ పనుల కోసం ఈ బడ్జెట్‌లోనే నిధులిస్తామన్నారు.

85 శాతం మొక్కలు బతకాలె

పట్టణాల్లో పచ్చదనం పెంచే బాధ్యత కౌన్సిలర్లు, కార్పొరేటర్లదేనని, నాటిన మొక్కల్లో 85 శాతం బతికించే బాధ్యత వారే తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పట్టణాలు, నగరాలకు అవసరమైన్ని నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పట్టణాల్లో స్థలం లేకుంటే దగ్గర్లోని గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఫైనాన్స్‌ప్లాన్‌రూపొందించేప్పుడే పది శాతం గ్రీన్‌బడ్జెట్‌కేటాయించాలన్నారు. ఇండ్ల నుంచి తడి, పొడి చెత్త వేరేగా సేకరించేందుకు బుట్టలు పంపిణీ చేయాలని సూచించారు. డ్రైనేజీలు క్లీన్‌చేయడానికి మిషన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పట్టణాలకు ప్రతినెల రూ.148 కోట్ల చొప్పున ఫైనాన్స్‌కమిషన్‌నిధులు ఇస్తామని, ఇతర ఖర్చులు తగ్గించుకొనైనా పట్టణాల అభివృద్ధికి ఈ ఫండ్స్ ఇస్తామని తెలిపారు.   తెచ్చిన అప్పుల కిస్తీలు, ఉద్యోగుల జీతాలు, కరెంట్‌, మంచినీటి బిల్లులు ప్రతినెలా కట్టాల్సిన బాధ్యత కమిషనర్లేదనని స్పష్టం చేశారు.

‘బల్దియా.. ఖాయా.. పీయా.. చల్దియా’… పోవాలె

మున్సిపాలిటీ అంటే మురికి, చెత్త, అవినీతి అనే చెడ్డ పేరును తొలగించుకోవాలని సీఎం అన్నారు. బల్దియా.. ఖాయా.. పీయా.. చల్దియా అనే సామెతలు పోవాలంటే అందరూ మంచిగా పనిచేయాలన్నారు.  మేయర్లు, చైర్‌పర్సన్లతో మాట్లాడి వారి సందేహాలను తీర్చారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్‌, డీజీపీ, ముఖ్య అధికారులు, కలెక్టర్లు, అడిషనల్‌కలెక్టర్లు, మేయర్లు, చైర్‌పర్సన్లు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం మధ్యాహ్న భోజనం చేశారు. పట్టణ ప్రగతిపై సీఎం మీటింగ్ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, , అధికారులు ప్రగతి భవన్‌నుంచి గజ్వేల్‌స్టడీ టూర్‌కు వెళ్లారు.

Latest Updates