ఢిల్లీ పోయొచ్చినంక కేసీఆర్ మారిండు!

అగ్రిచట్టాలు మారలే.. 

అగ్రిచట్టా లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలె

బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేట్ బిల్లు పెడ్తం : భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు.  ప్రభుత్వం ముందుకు రాకుంటే తామే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో  ప్రైవేటు బిల్లును ప్రవేశపెడతామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం పీసీసీ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాభవన్ లో రైతు వ్యతిరేక చట్టాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భట్టి మాట్లాడారు. ఢిల్లీలో దీక్షలు చేస్తూ అమరులైన రైతులకు సంతాపంగా నేతలు 2 నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత భట్టి మాట్లాడుతూ.. ఫెడరల్ ఫ్రెంట్ కడతానన్న కేసీఆర్.. ఢిల్లీకి పోయొచ్చినంక అగ్రి చట్టాలకు మద్దతు పలికారన్నారు. చట్టాలు మారలేదు కానీ కేసీఆరే మారిపోయాడన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తే సహించబోమని సర్కార్ ను హెచ్చరించారు. బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకే కొత్త చట్టాలు తెచ్చారన్నారు.

రైతులకు వ్యతిరేకంగా అగ్రి చట్టాలు

రైతు వ్యతిరేక చట్టాలు, విధానాలను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కిసాన్ కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కోదండ రెడ్డి అన్నారు. ఈ చట్టాల వల్ల రైతులతో పాటు వినియోగదారులు కూడా నష్టపోతారన్నారు. కొత్త అగ్రి చట్టాల వెనక అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నాయని వ్యవసాయ నిపుణుడు దొంతి నర్సింహారెడ్డి అన్నారు. రైతు ఉద్యమం పంజాబ్, హర్యానా రాష్ట్రాలకే పరిమితం కాదని రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కన్నెగంటి రవి అన్నారు. వ్యవసాయ చట్టాలు చేసే హక్కు కేంద్రానికి లేదన్నారు. మీటింగ్ లో కాంగ్రెస్ నేతలు వీహెచ్, బోసురాజు, చిన్నారెడ్డి, శ్రీధర్ బాబు, మర్రి శశిధర్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.

For More News..

ప్రతిపక్ష నేతలకు మంత్రి ఈటల సవాల్‌‌

తమ్మీ..! పార్టీ మారకుండ్రి.. అనుచరులకు ఫోన్లు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

మగాళ్లకూ ‘ఫెర్టిలిటీ సెంటర్లు’.. మారిన లైఫ్‌స్టైలే కారణం

Latest Updates