కేసీఆర్ నిజాం జమానా పాలనను తలపిస్తున్నాడు

బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి

నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిజాం జామానా పాలనను తలపిస్తున్నాడని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కోవిడ్ టైంలో కేసీఆర్ ప్రజలకు ధైర్యం కల్పించాల్సింది పోయి ఫాం హౌస్ లో కూర్చున్నాడని ఆయన విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలో బీజేపీ శిక్షణ శిబిరానికి బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.  బీజేపీ ఇంఛార్జ్ దిలీపాచారి, జిల్లా కార్యకర్తలు పాల్గొన్న్ ఈ కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. 35 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుల వ్యయాన్ని సీఎం కేసీఆర్ కమీషన్ల కోసం లక్ష కోట్లకు పెంచి రాష్ట్రాన్ని అప్పులమయం చేశాడని దుయ్యబట్టారు. కాళేశ్వరం పేరుతో మళ్లీ 85 వేల కోట్లు కొట్టెయ్యాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు, మీడియా గొంతు నొక్కాలని కేసీఆర్ భావించాడని, టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసినా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్యకర్తల కృషితో బీజేపీ విజయం సాధించిందన్నారు. తెలంగాణలో ఏ పార్టీలో లేనంత బలమైన క్యాడర్ బీజేపీలో ఉందని, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఖచ్చితంగా గద్దె దించుతామన్నారు.

మారుమూల ప్రాంతాల్లో కూడా బీజేపీకి మంచి స్పందన లభిస్తోందని, యువకులు ధైర్యంగా ముందుకొచ్చి బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్ లో ఏపీ వల్ల తెలంగాణ కు నీటి వాటాలో అన్యాయం జరుగుతున్నా.. కేసీఆర్ నోరెత్తటం లేదన్నారు. కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం పూర్తయితే ఎక్కువగా నష్టపోయేది పాలమూరు జిల్లానేనని, క్రిష్ణా బేసిన్ లో తెలంగాణ వాటాకు వ్యతిరేకంగా ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులపై ఉద్యమాన్ని చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు లాభమే తప్ప నష్టం లేదన్నారు. బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కీ రోల్ పోషించాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. 2023 లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ అంటేనే కేసీఆర్ బుగులు పడుతున్నాడని పేర్కొన్నారు.

Latest Updates