కేసీఆర్​పై దేశద్రోహం కేసు పెట్టాలి

ఆయన ఓ అజ్ఞాని.. సీఏఏపై అసెంబ్లీ తీర్మానం
చిత్తు కాగితం: బండి సంజయ్​
బర్త్​ సర్టిఫికెట్​కోసం కేసీఆర్​ విజయనగరంలో
అప్లయ్​ చేసుకోవాలి: ధర్మపురి అర్వింద్​
ప్రజల దృష్టి మళ్లిస్తున్న కేసీఆర్​: బాపూరావు

న్యూఢిల్లీ, వెలుగుప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని రజాకార్ల అజెండా అమలు చేసేందుకు కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని, ఇది సిగ్గుచేటని బీజేపీ స్టేట్‌ ప్రెసిడెంట్,   కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. సీఏఏపై అసెంబ్లీలో తీర్మానం చేసిన రోజును బ్లాక్ డేగా భావిస్తున్నామని, ఇలాంటి తీర్మానం చేసిన కేసీఆర్ దేశ ద్రోహిగా మిగిలిపోతారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ అసెంబ్లీలో చేసిన తీర్మానం ముమ్మాటికీ దేశ ద్రోహమేనని, ఇందుకు కేసీఆర్​పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం పార్లమెంట్ ఆవరణలోని విజయ్ చౌక్ లో ఎంపీలు  అర్వింద్, బాపూరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వేల పుస్తకాలు చదివినట్లు చెప్పుకునే కేసీఆర్ ఓ అజ్ఞాని అని తెలంగాణ సమాజానికి అర్థమైందన్నారు.

కరోనాకు పారాసెటమాల్​ వేసుకోవాలన్న కేసీఆర్​ వ్యాఖ్యలకు దేశం మొత్తం నవ్వుకుందని ఎద్దేవా చేశారు. సీఏఏపై అసెంబ్లీ లో చేసిన తీర్మానం చిత్తు కాగితంతో సమానమన్నారు. పార్లమెంట్ చట్టాలను గౌరవించాలన్న కనీస అవగాహన లేని కేసీఆర్.. అసలు ఏం చదివారో అర్థకావడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ దేశ ప్రజలకు పౌరసత్వం ఇచ్చేదే కానీ, ముమ్మాటికీ తీసేసేది కాదన్నారు. సిటిజన్​షిప్​ అనేది కేంద్ర పరిధిలోని అంశమని, రాష్ట్రానికి సంబంధం ఉండదనే కనీస పరిజ్ఞానం సీఎంకు లేకపోవడం బాధాకరమన్నారు. బర్త్​ సర్టిఫికెట్​ లేదని చెప్పుకుంటున్న కేసీఆర్..  ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల పోటీల్లో ఏ సర్టిఫికెట్ ను పొందుపరిచారని ప్రశ్నించారు. ఢిల్లీ అల్లర్ల పై మాట్లాడుతున్న సీఎం కేసీఆర్.. భైంసా అల్లర్లపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమగ్ర సర్వే పేరుతో కేసీఆర్ రాష్ట్ర ప్రజల వ్యక్తి గత సమాచారాన్ని సేకరిస్తే తప్పు లేదు కానీ, దేశ అభివృద్ధి, రక్షణ కోసం బీజేపీ సర్కార్ ఎన్పీఆర్ ను ప్రవేశ పెడితే తప్పా అని నిలదీశారు. అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఏం సాధించలేని, ఇప్పుడు ఎన్పీఆర్ ఉపయోగాన్ని తెలుసుకోలేని ఓ అజ్ఞాని కేసీఆర్ అని విమర్శించారు.

విజయనగరంలో అప్లయ్​ చేసుకో: అర్వింద్​

బర్త్ సర్టిఫికేట్ దిక్కులేదంటున్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. ‘‘కేసీఆర్ తప్పుడు జాగల అప్లయ్​ చేసుకున్నరు. విజయనగరం ఆర్డీవోకు అప్లయ్​ చేసుకుంటే ఆయన బర్త్ సర్టిఫికెట్ దొరుకుతది” అని ఎద్దేవా చేశారు.  ‘‘మా తాతలకు వందల ఎకరాలు ఉన్నయ్​.. నేను గడిలో పుట్టిన అని చెప్పుకొనే సీఎంకు అవి ఉంటే చాలు. ఆయనను ఎన్పీఆర్ లిస్టులోకి ఎక్కిస్తరు. ఎన్పీఆర్ పై ఆయనేమీ పరేషాన్ కావల్సిన అవసరం లేదు” అని వ్యాఖ్యానించారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్ల పేరుతో అసెంబ్లీ చేసిన తీర్మానం తీరుగానే, సీఏఏని వ్యతిరేకిస్తూ సోమవారం అసెంబ్లీ లో చేసిన తీర్మానం దేనికీ పనికిరాదన్నారు.

ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆ తీర్మానం: బాపూరావు

ఏదైనా ఆపద వస్తే ఓ సమస్యను సృష్టించి దానిపై జీవపోసుకోవాలని ఆలోచించే వ్యక్తి కేసీఆర్​ అని, మిగులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత ఆయనదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు మండిపడ్డారు. మేధావులతో చర్చించకుండా ఫాంహౌస్​లో  పడుకొని బడ్జెట్​పై లెక్కలు కట్టారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర సర్కార్ ఉందని, ప్రజల దృష్టిని  మళ్లించేందుకు సీఏఏ తీర్మానం చేశారని దుయ్యబట్టారు.

సీఎంది తప్పుడు ప్రచారం: కిషన్రెడ్డి

సీఏఏతో దేశంలోని ఏ ఒక్కరికీ నష్టం లేదని, దానితో ఏ ఒక్కరికీ  సంబంధం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి లాంటి వాళ్లు సీఏఏపై తప్పుడు ప్రచారం చేయడం తగదని  హితవుపలికారు. మూడు దేశాల మైనారిటీలకు సిటిజన్​షిప్​ కోసమే ఈ చట్టాన్ని పార్లమెంట్​ తీసుకువచ్చిందని, దేశ ప్రజలందరికీ పార్లమెంట్​ ప్రాతినిధ్యం వహిస్తుందని ఆయన సోమవారం ట్వీట్​ చేశారు.

Latest Updates