దుబ్బాకలో గెలిస్తే చాలు..ఫెయిల్యూర్స్ అన్నీ మాఫ్

  • కరోనా, వరదలు, ఎల్ఆర్ఎస్​ లొల్లి..
  • అన్నీ కొట్టుకపోతయని టీఆర్ఎస్​ పెద్దల వ్యూహం
  • జనం సపోర్ట్​ తమకే ఉందని ప్రచారం చేసుకునే ప్లాన్

హైదరాబాద్, వెలుగు: ఉద్యమం నాటి నుంచీ టీఆర్ఎస్​ ఎన్నికలనే స్ట్రాటజీగా మలుచుకుంది. అవకాశం దొరికినప్పుడల్లా.. తమను ఇతర పార్టీలు వేలెత్తి చూపినప్పడల్లా.. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లడం ద్వారా పరిస్థితిని తమకు అనుకూలంగా మల్చుకోవటంలో సక్సెసయింది. ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్​తో అన్నివర్గాల ప్రజలు ముందుకొచ్చి ఆ ఎలక్షన్లలో టీఆర్ఎస్​ క్యాండిడేట్లను గెలిపించారు. అయితే.. రాష్ట్రం ఏర్పాటై అధికారంలోకి వచ్చాక కూడా టీఆర్ఎస్​ పెద్దలు ఇదే ప్లాన్​ను అమలు చేస్తున్న తీరు కనిపిస్తోంది. టీఆర్ఎస్​ రెండోసారి అధికారంలోకి వచ్చాక అమలు చేసిన చాలా నిర్ణయాలపై జనం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణిచివేయటంతోపాటు ఆర్టీసీని ప్రైవేటుకు కట్టబెట్టేందుకూ సర్కారు రెడీ అయింది. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఇక కొత్త పంచాయతీరాజ్​చట్టం, మున్సిపల్​ చట్టాలతో ప్రజాప్రతినిధులను సస్పెండ్​ చేసే అధికారాన్ని ప్రభుత్వం చేజిక్కించుకుంది. మొక్కలు పెరగకున్నా పదవిలోంచి తీసేసే వివాదస్పద నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలపై జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

కానీ అదే టైంలో వచ్చిన హుజూర్​నగర్​ బైఎలక్షన్​లో టీఆర్ఎస్​ అన్నిరకాల వ్యూహాలు పన్ని గెలిచింది. ఆ వెంటనే తమ సర్కారు తీరు బాగుందని, ప్రజామోదం తమకే ఉందని టీఆర్ఎస్​ పెద్దలు గట్టిగా చెప్పుకొన్నారు. ఇప్పుడైతే చాలా అంశాల్లో జనం తీవ్ర నిరాశతో, ఆవేదనతో ఉన్నారు. దాంతో టీఆర్ఎస్​ సర్కారు.. దుబ్బాకపై ఫోకస్​ పెట్టింది. ఎలాగైనా గెలిచి జనం తమను సపోర్ట్​ చేస్తున్నారని చెప్పుకునేందుకు రెడీ అయింది.

వరుస ఫెయిల్యూర్లకు ఇదే చిట్కా

టీఆర్ఎస్​ సర్కారు ఇటీవల ఏపీతో దోస్తీ కట్టి కృష్ణా ప్రాజెక్టులను పట్టించుకోని తీరు వివాదస్పదమైంది. పోతిరెడ్డిపాడు గండిని డబుల్​ చేస్తున్నా.. శ్రీశైలానికి గండి పెట్టి సంగమేశ్వరం నుంచి నీళ్లు లిఫ్ట్ చేసే ప్రాజెక్టులు కడుతున్నా మన సర్కారు సైలెంట్​గా ఉండటం దక్షిణ తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇక సెక్రటేరియట్​ను పోలీసు పహారా నడుమ అర్ధరాత్రి కూల్చివేయడం, శ్రీశైలం పవర్​ హౌస్​ లో అగ్ని ప్రమాదం, 9 మంది ఇంజనీర్లు చనిపోవడం వంటి ఘటనలు సర్కారు తీరును వేలెత్తి చూపాయి. తాజాగా కల్వకుర్తి లిఫ్ట్ పంపుహౌజ్​ నీట మునిగి మోటార్లు పేలిపోవటం కృష్ఱా ప్రాజెక్టులపై సర్కారు పట్టింపులేని తనాన్ని బయటపెట్టింది. ఎల్ఆర్ఎస్​తో ప్రజలపై దాదాపు రూ.12 వేల కోట్ల భారం మోపడం, ధరణి పోర్టల్ అందుబాటులోకి రాకముందే.. తహసీల్దార్ల గుత్తాధిపత్యం ఉండేలా రెవెన్యూ వ్యవస్థను మార్చటం, వీఆర్వోలపై వేటేయడంపై ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఇక కరోనా వైరస్​పై తొలి నుంచీ సర్కారు నిర్లక్ష్యం.. వేల మంది పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఎఫెక్ట్​ చూపింది. సరైన ట్రీట్​మెంట్​అందించడంలో సర్కారు ఫెయిలైంది. ఇప్పుడు వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రమంతటా పంటలు దెబ్బతిన్నాయి. నాలుగు లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. గ్రేటర్​ హైదరాబాద్​ సిటీని ముంచెత్తిన వరదలతో జనజీవనం అతలాకుతలమైంది. 35 వేల కుటుంబాలు ముంపులో ఉంటే సహాయక చర్యలు చేపట్టడంలో సర్కారు ఫెయిలైంది. ఈ ఫెయిల్యూర్లన్నింటినీ కొట్టిపారేసేందుకు, జనం తమ వెనకే ఉన్నారని చెప్పుకొనేందుకు.. దుబ్బాక బైఎలక్షన్​ గెలుపును టీఆర్ఎస్​ టార్గెట్​ చేసిందనే వాదన వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి దుబ్బాక ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తున్నారని.. మంత్రులతోపాటు మండలానికో ఎమ్మెల్యేకు బాధ్యత అప్పగించి నడిపిస్తున్నారని పార్టీ వర్గాలే చెప్తున్నాయి.

అసెంబ్లీకి కూడా రాకుండా..

ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాలకు మంత్రి హరీశ్ రావు హాజరుకాలేదు. ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న ఆయన అసెంబ్లీ, మండలికి రాకుండా దుబ్బాకలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా దుబ్బాకలోనే మకాం వేసి.. ఎలక్షన్ మేనేజ్​మెంట్ పై ఫోకస్ పెట్టారు. ప్రతిపక్షాలకు చెందిన గ్రామస్థాయి లీడర్లను కూడా ప్రలోభాలతో టీఆర్ఎస్​లో చేర్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాట విని వచ్చేవారికి తాయిలాలు ఇస్తూ, లేకుంటే భయపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నట్టు స్థానికులు చెప్పుకొంటున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కులాలు, వార్డుల వారీగా టీఆర్ఎస్​ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలకు నమ్మకస్తులైన లోకల్ లీడర్లను ఇన్​చార్జులుగా నియమించారు. కాంగ్రెస్, బీజేపీలకు కాస్త పట్టున్న గ్రామాలపై కమిటీలతో స్పెషల్ ఫోకస్ పెడ్తున్నారు. ఆ గ్రామాల్లోని ఓటర్లను కాస్త స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ప్రగతిభవన్ నుంచే గైడెన్స్!

వానలతో హైదరాబాద్ అతలాకుతలమైనా ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ బయటికి రాలేదు. ప్రగతిభవన్ పక్కనే ఉన్న ఏరియాలు నీట మునిగినా కన్నెత్తి చూడలేదు. కానీ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలనే దానిపై మంత్రి హరీశ్ కు సీఎం ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తున్నట్టు పార్టీ లీడర్లు చెప్తున్నారు . ప్రతిపక్షాలకు చెం దిన కొం దరు లోకల్  లీడర్లతో ఆయన మాట్లాడి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. దసరా తర్వాత దుబ్బాకలో ప్రచారం చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు చెప్తున్నారు . అయితే హైదరాబాద్ లో ముంపు బాధితులను పరామర్శించకుండా.. ఎలక్షన్ ప్రచారానికి వెళ్తే విమర్శలు వస్తాయనే కోణంలో ఆలోచిస్తున్నారని ఓ సీనియర్ నేత తెలిపారు. బై ఎలక్షన్లో గెలిస్తే ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టొచ్చని, తమకు ప్రజాబలం ఉంది కాబట్టే గెలిచామని చెప్పుకోవచ్చని పేర్కొన్నారు

Latest Updates