60 వేల మందికి కరోనా వచ్చినా ఎదుర్కొంటాం

హైదరాబాద్,వెలుగు:  కరోనా విజృంభిస్తే ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా రెడీగా ఉన్నామని సీఎం కేసీఆర్​ భరోసా ఇచ్చారు.  భయంకరమైన కరోనా రాక్షసితో యుద్ధం చేస్తున్న ఈ టైంలో రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. ఇల్లు విడిచి ఎవరూ బయటకు రావొద్దని, సోషల్​ డిస్టెన్స్​ అనే ఆయుధంతో మనల్ని మనం రక్షించుకుందామని పిలుపునిచ్చారు. అండగా ఉంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఈ నెల 31 వరకే లాక్​డౌన్​ అనుకున్నామని, కేంద్రం చెప్పినట్లుగా వచ్చే నెల 15 వరకు లాక్​డౌన్​ కొనసాగుతుందని అన్నారు. రైతులెవరూ ధాన్యాన్ని అమ్మేందుకు మార్కెట్​ యార్డులకు రావొద్దని, మార్కెట్లను మూసేశామని ఆయన చెప్పారు. ఊళ్లల్లో ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని, ఎక్కడి వారు అక్కడే ఊళ్లల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో అమ్మేయాలని సూచించారు. కరోనా పరిస్థితిపై, తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్​ శుక్రవారం ప్రగతిభవన్​లో మీడియాకు వివరించారు.

‘‘వైరస్​ విజృంభించినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నం. మనకు నిర్లక్ష్యం, అలసత్వం పనికిరాదు. మనం భయంకరమైన విపత్తులో, భయంకరమైన రాక్షసితో యుద్ధం చేస్తున్న సమయం ఇది. ఈ యుద్ధ సమయంలో కొన్ని బాధలైనా భరించాలె. ఇది మనకోసమే. ప్రభుత్వ సిబ్బందికి, పోలీస్​ సిబ్బందికి, వైద్య సిబ్బందికి పూర్తిస్థాయిలో ప్రజలు సహకరించాలి. వాళ్లకు పాపం నిద్రలు లేవు. రెస్ట్​లెస్​గా పనిచేస్తున్నరు. మరొకసారి మీ బిడ్డగా.. తెలంగాణ యావత్​ సమాజానికి దండం పెట్టి చెప్తున్న. ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావద్దు” అని ఆయన కోరారు. ఒకవేళ 60వేల మందికి పాజిటివ్​ అని తేలినా.. వారందరికీ ట్రీట్​మెంట్​ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.  రెండు రోజులుగా వైద్య వసతులపై సమీక్ష జరిపామని చెప్పారు. ఇతరుల మీద ఆధారపడకుండా ఏ మేరకు చర్యలు తీసుకోవచ్చో స్డడీ చేశామన్నారు. వంద మంది డాక్టర్లు అక్కర ఉంటే.. 130 మందిని రెడీ పెట్టుకుంటున్నామని వివరించారు.

గచ్చిబౌలి స్టేడియంలో ఐసోలేషన్​ వార్డు

ఒకేసారి 12 వేల 400 మందికి ట్రీట్​మెంట్​ ఇచ్చే స్థాయిలో ఏర్పాట్లు చేశామని సీఎం చెప్పారు. ఇందులో  11 వేల ఐసోలేషన్​ బెడ్స్​,1400 ఐసీయూ బెడ్లు రెడీ చేసుకున్నామని వివరించారు. గచ్చిబౌలి స్టేడియాన్ని కూడా ఐసోలేషన్​ వార్డుగా ఉపయోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 500 వెంటిలేటర్లకు ఆర్డర్​ ఇచ్చామని చెప్పారు. రిటైర్డ్ డాక్టర్ల సేవలను కూడా ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. ‘‘అంతర్జాతీయ పరిశోధన సంస్థల అంచనా ప్రకారం కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారిలో 80.09 శాతం మందికి ఏమీ  కాదు. 13.8 శాతం మంది పరిస్థితి సీవియర్ గా ఉంటది. మిగతా 4.7 శాతం మందికి క్రిటికల్​గా ఉంటది. ఈ మూడు విభాగాల్లోని మొదటి వారిని తప్ప మిగతా రెండు విభాగాల వారిని హాస్పిటల్స్​లోనే ఉంచి ట్రీట్​మెంట్​ చేయాల్సి ఉంటుంది. మూడో విభాగం వారికి ఐసీయూ, వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుంది” అని సీఎం వివరించారు.

రాష్ట్రంలో 59 మందికి పాజిటివ్

రాష్ట్రంలో ఒక్క రోజు 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘‘రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 మందికి పాజిటివ్ వస్తే.. ఒకరు కోలుకుని ఇంటికి వెళ్లిపోయిండు. ప్రస్తుతానికి 58 మందికి హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నరు. ప్రభుత్వం పర్యవేక్షణలో 20 వేల మంది క్వారంటైన్​లో ఉన్నరు. వారికి మెరుగైన ట్రీట్​మెంట్​ అందిస్తున్నం” అని తెలిపారు. ‘‘అంతర్జాతీయంగా వ్యాధి వచ్చే పీడ పోయింది. వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే ప్రమాదం కూడా లేదు. ఇక్కడ ఉన్నోళ్లతోనే వైరస్ స్ప్రెడ్ అవుతది.. కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించడంతోనే  స్ప్రెడ్‌ అయింది’ అని ఆయన పేర్కొన్నారు.

లక్ష కేసులకు చేరువలో అమెరికా..అయినా మారని ట్రంప్

Latest Updates