గ్రేటర్​ ఎన్నికలు ఆపే కుట్ర

  • సిటీలో ఘర్షణలకు కొందరు ప్లాన్​ చేస్తున్నరు
  • అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచేయండి
  • గొడవలు సృష్టించేవారిని వదలొద్దు
  • పోలీసులకు ఫుల్‌ పవర్స్‌ ఇస్తున్నం: సీఎం కేసీఆర్

హైదరాబాద్‌, వెలుగు: హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ఎన్నికలు ఆపడానికి అరాచక శక్తులు కుట్ర చేస్తున్నాయని సీఎం కేసీఆర్​ ఆరోపించారు. అటువంటి శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని, ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని ప్రకటించారు. బుధవారం సీఎం కేసీఆర్​ ప్రగతి భవన్‌లో శాంతిభద్రతలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారనే కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద ఉందని ఈ మీటింగ్​లో పేర్కొన్నారు. హైదరాబాద్​తోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తులు, శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఉక్కుపాదంతో అణచివేయాలని అధికారులకు సూచించారు.

గొడవలు చేయాలని..

జీహెచ్‌ఎంసీ ఎలక్షన్లలో లబ్ధి పొందడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని, సోషల్‌ మీడియాలో మార్ఫింగ్‌ ఫొటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారని కేసీఆర్​ అన్నారు. కవ్వింపు చర్యలతో ప్రజలను రెచ్చగొట్టాలని చూసినా హైదరాబాద్‌ ప్రజలు పట్టించుకోలేదన్నారు. దీంతో రాష్ట్రంలోని కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మంలోనో, మరోచోటనో గొడవలు రాజేసి.. వాటిని హైదరాబాద్‌లో ప్రచారం చేయాలని చూస్తున్నారన్నారు. హైదరాబాద్​లో కూడా ఏదో ఒకచోట గొడవ పెట్టుకొని దానికి మతం రంగు పూయాలని, ప్రార్థనా మందిరాల దగ్గర వికృత చేష్టలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

గొడవలు, ఘర్షణ వాతావరణం సృష్టించి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వాయిదా వేయించడానికి ప్రణాళిక రచించారని.. దీనికి సంబంధించి ప్రభుత్వం వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని మూడు కమిషనరేట్ల పరిధిలో కోటీ 60 లక్షల మంది ప్రజలు ఉన్నారని.. వారందరినీ కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని కేసీఆర్​ చెప్పారు. హైదరాబాద్‌లో మత ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూసే వారిని క్షమించాల్సిన అవసరం లేదన్నారు.  వారు ఎంత వారైనా, అధికార పార్టీ సభ్యులైనా సరే వదలొద్దన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అరాచక, విద్రోహ శక్తుల కుట్రలు భగ్నం చేసి తీరుతామని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఎక్కడా చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా చూస్తామన్నారు. ఈ సమీక్షలో సీఎస్‌ సోమేశ్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, సీపీలు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌, అడిషనల్‌ డీజీ జితేందర్‌, ఐజీలు స్టీఫెన్‌ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Latest Updates