జస్ట్ ఆరేళ్లలోనే బంగారు తెలంగాణ చేశాం

  • ఏ లక్ష్యం కోసం పోరాడినమో అది సాకారమైంది
  • ఏడాదికి రూ. లక్ష కోట్ల పంట పండిస్తున్నం
  • పల్లేర్లు మొలిచే చోట ఇప్పుడు పసిడి ధాన్యాలు
  • మిషన్​ భగీరథ పథకంతో రోడ్లమీద బిందెల ప్రదర్శన బందైంది
  • రైతు బీమా, రైతు బంధు ప్రపంచంలో ఎక్కడా లేవు
  • ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం కట్టినం
  • వారంలో రైతులకు తీపి కబురు: కేసీఆర్​
  • చినజీయర్​స్వామితో కలిసి కొండపోచమ్మ
    సాగర్​ నీటి పంపింగ్​ను ప్రారంభించిన సీఎం

సిద్దిపేట, వెలుగుసిద్దిపేట, వెలుగు: ఆరేండ్ల కింద అనాథగా ఆగమైన తెలంగాణ తక్కువ కాలంలోనే బంగారు తెలంగాణగా, పసిడి పంటల తెలంగాణగా మారిందని సీఎం కేసీఆర్​ అన్నారు. ఏ లక్ష్యం, ఏ గమ్యంతో తెలంగాణ సాధన కోసం పోరాడామో ఆ కల సంపూర్ణంగా సాకారమైందని చెప్పారు. ఏడాదికి లక్ష కోట్ల రూపాయల పంటలు పండించే రాష్ట్రంగా అవతరించిందని పేర్కొన్నారు. రైతు బీమా, రైతు బంధు వంటి స్కీంలు ప్రపంచంలో ఎక్కడా లేవని, ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని చెప్పారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మర్కుక్‌ ‌వద్ద కొండపొచమ్మ సాగర్​ రిజర్వాయర్‌‌  నీటి పంపింగ్‌‌ను ఆయన ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..

భూములిచ్చినోళ్లకు  అండగా ఉంటం

‘‘కొండపోచమ్మ సాగర్​ ప్రారంభోత్సవం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వలమైన ఘట్టం. ఏ లక్ష్యాన్ని, ఏ గమ్యాన్ని ఆశించి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిండ్రో.. ఆ కల సంపూర్ణంగా సాకారమైన ఘట్టమిది. కొండపోచమ్మ రిజర్వాయర్​.. కాళేశ్వరం ప్రాజెక్టులో పదో లిఫ్టు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు కొని.. కొండపోచమ్మ వరకు భూములు కోల్పోయినవాళ్ల త్యాగాలు వెలకట్టలేనివి. వాళ్లందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్న. కొండపోచమ్మ కోసం భూములిచ్చిన వాళ్ల పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తమన్నం. దానిలో భాగంగా ఫుడ్​ ప్రాసెసింగ్​ ఇండస్ట్రీని పెట్టిస్తున్నం. నిర్వాసితుల కోసం గజ్వేల్​లో 6వేల పైచిలుకుల ఇండ్లు వివిధ దశల్లో 600 ఎకరాల్లో కొనసాగుతున్నయి. భూములు ఇచ్చినవాళ్లకు మేం మంచి నష్టపరిహారం ఇచ్చినం. వాళ్లకు అన్ని విధాలా ప్రభుత్వ అండదండ ఉంటది.

మూడేండ్లలోనే అదనంగా 165 టీఎంసీలు

ఆరేండ్ల కింద అనాథలాంటి తెలంగాణ, ఆగమైన తెలంగాణ. పల్లెపల్లేలో పల్లెర్లు మొలిసె తెలంగాణలోనా.. అని కవులు పాటలు పాడుకున్నరు. ఇప్పుడు ఒకనాటి ఏడుపు పాటల తెలంగాణ లేదు. ఇయ్యాళ పసిడి ధాన్యపు రాశుల, పసిడి పంటల తెలంగాణగా మారింది. ఎస్సారెస్పీ తర్వాత మెగా రిజర్వాయర్​ మల్లన్నసాగర్.  రాష్ట్రంలో రిజర్వాయర్​లలో 125 టీఎంసీలు, బ్యారేజీల్లో 40 టీఎంసీలు.. మొత్తంగా 165 టీఎంసీలను కొత్త రిజర్వాయర్లు చేపట్టినం. ఇది ఏ రాష్ట్రం కూడా చరిత్రలో మూడు నాలుగేండ్లలో సాధించలేదు. తెలంగాణ ప్రభుత్వం సాధించింది. 35 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మ సాగర్​, అదేవిధంగా 7.5 టీఎంసీలతో సమ్మక్క సాగర్​ నిర్మాణం జరుగుతున్నయి. మొత్తం మీద ఒక లక్ష కోట్ల రూపాయల పంట సంవత్సరానికి పండించే  బంగారు తెలంగాణ, భాగ్యరాశుల తెలంగాణ ఆరేండ్ల తక్కువ కాలంలో తయారైంది. తెలంగాణ రావడమే డ్రై. వచ్చిన తెలంగాణ ఆశించిన స్పీడ్​తో పదింతలుగా బాగుపడటం మనకు కావాలి. ఆ ఫలితం కండ్ల ముందుకు కనబడ్తా ఉంది. 100 పర్సెంట్​ కనబడ్తా ఉంది. బ్యారేజీలు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, పంప్​హౌస్​లు నిత్యం నీళ్లు దుంకుతూ కనబడ్తా ఉన్నయి. 530 టీఎంసీల నీళ్లు వాడుకునే సామర్థ్యాన్ని తెలంగాణ సంతరించుకున్నది.

చావు నోట్లో తలకాయపెట్టిన

జీవితంలో చాలా తక్కువ మంది ఉద్యమం ప్రారంభించి ఫలితాలు పొందుతరని మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ నాతో అన్నరు. ‘యు ఆర్​ ఏ  లక్కీ ఫెలో తెలంగాణ నువ్వే స్టార్ట్​ చేసినవు.. నువ్వు బతికుండగానే తెలంగాణ రాష్ట్రం సంపాదించినవ్​.. నువ్వు అదృష్టమంతుడివి’ అని ఆయన నాతో చెప్పిన్రు. తెలంగాణ కోసం నేను చావు నోట్లో తలకాయపెట్టిన. డెత్​ బెడ్​మీదికి పోయి రిటర్న్​ వచ్చిన. నాతోపాటు ఉద్యమం స్టార్ట్​ చేసిన చాలా మంది తమ ప్రాణాలు బలిచేసినరు. ఆ అమర వీరులను అడుగడుగునా స్మరించుకుంటం. వాళ్లది వెల లేని త్యాగం.

గొప్ప కంపెనీలు ఇన్వాల్వ్‌​ అయినయి

ఇయ్యాళ కూడా అనేక శాపాలు, దీవెనలు, కేసులు, కాసులు, రాకాసులు, గోకాసులు ఎందరో అడ్డంపడి.. ఎన్నో కుట్రలు చేసినా  ప్రపంచమే అబ్బురపడే  కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నం. కొండపోచమ్మ సాగర్​లో చాలా అద్భుతంగా దేశ చరిత్రలో ఎక్కడా కట్టని రీతిలో 400 కేవీ సబ్​స్టేషన్లు 6, 220 కేవీ సబ్​స్టేషన్లు 7, 132 కేవీ సబ్​స్టేషన్లు 2 నిర్మాణం జరిగినయి. 521 కి.మీ. కొత్త లైన్లు కూడా వేసిన్రు. కాంట్రాక్టర్స్​ చాలా గొప్పగా పనిచేసిన్రు. ఇండియాలో ఉన్న గొప్ప గొప్ప కంపెనీలు ఇందులో ఇన్వాల్వ్​ అయినయి.

వలస కార్మికులకు దారి ఖర్చులూ ఇచ్చినం

అందరికీ మించి ఇప్పటికే రూ. 12 కోట్లు ఖర్చుపెట్టి వలస కార్మికులను ప్రత్యేక రైళ్లలో సొంతూళ్లకు పంపినం. పంపుతున్నం. ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఇట్ల చేయలే. వాళ్లకు భోజనాలు, పండ్లు ఇచ్చినం. దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపిస్తున్నం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లందరు కూడా 45 డిగ్రీల ఎండలో లక్ష్మీబ్యారేజీ వద్ద పనిచేసినరు.

ఇరిగేషన్​కు రూ. లక్ష కోట్ల పైచిలుకు ఖర్చు

అన్ని రంగాల కంటే ఇరిగేషన్​ రంగానికి ప్రాధాన్యం ఇచ్చినం. రూ. లక్ష కోట్ల పైచీలుకు డబ్బులు దీని మీద ఖర్చు పెడుతున్నం. ఫలితాలు వచ్చినయి. పంటలు పండుతాయి. నియంత్రిత సాగుతో తెలంగాణ అద్భుతాలు చేయబోతున్నది. నియంత్రిత సాగు అంటే నియంతృత్వ సాగు కాదు. దేశానికి మనం ఆదర్శం కావాలి. 100 శాతం అయి తీరుతం. కేసీఆర్​ ఒకసారి పట్టుబడితే మొండిపట్టుబడుతడు.

తూచా తప్పకుండా రుణమాఫీ అమలు చేస్తున్నం

చెప్పిన ప్రకారం.. రైతు రుణమాఫీని అమలు చేస్తన్న ఒకే ఒక్క రాష్ట్ర తెలంగాణ. గత టర్మ్​లో చేసినం. ఈ టర్మ్​లో రూ. 25 వేలలోపు రుణాలున్నోళ్లకు  దాదాపు 5 లక్షల 60వేల మంది రైతుల కోసం  వన్​ స్ట్రోక్​లో  13 వందల కోట్లు విడుదల చేసినం.  ఎండిపోయిన మంజీరా, హల్దీ వాగు ఐదారు నెలల తర్వాత జీవనదులైతయి.  4 వేల కోట్ల రూపాయలతో 1250 చెక్​డ్యామ్స్​ రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్నం. ఇవన్నీ జరిగితే తెలంగాణలో గొప్ప బయో డైవర్సిటీ ఏర్పడుతది.

ఖాళీ బిందెల ప్రదర్శన బందైంది

‘‘ఒకప్పటి దుర్మార్గమైన, భరించరాని కరెంటు కోతలు, కరెంటు గండాల నుంచి తెలంగాణ శాశ్వతంగా గట్టెక్కింది.  ఇప్పుడు ఎక్కడ కూడా ఖాళీ బిందెల ప్రదర్శన లేదు. అది బందైంది. మిషన్​ భగీరథ ద్వారా అద్భుతంగా  మంచి నీటి సమస్య పరిష్కారమైంది. దేశంలోనే ఎక్కడా లేనటువంటి అద్భుతమైన సంక్షేమ పంథ తెలంగాణ రాష్ట్రానిది. వికలాంగులకు రూ. 3116 ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలో ఎక్కడ ఇట్ల ఇవ్వరు. సోషల్​ వెల్ఫేర్​ స్కీంలు కూడా అద్భుతంగా అమలు చేస్తున్నం. తెలంగాణలో ఉన్న రైతు బీమా కానీ, రైతు బంధు కానీ.. దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక్క తెలంగాణలోనే ఉంది. నయా పైసా చార్జీ లేకుండా రైతులకు నాణ్యమైన కరెంట్​ను 24 గంటలు అందిస్తున్నం. ఇండియాలో ఎక్కడ కూడా ఇట్ల లేదు’’

Latest Updates