పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ప్రాజెక్టులే కొత్తవి

హైదరాబాద్‌‌, వెలుగు:  ‘‘ఏపీ తలపెట్టిన పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు, సంగమేశ్వరం లిఫ్టు ప్రాజెక్టులే కొత్తవి. తెలంగాణలో కడుతున్నవన్నీ పాత ప్రాజెక్టులే.  ఇదే విషయాన్ని కేఆర్‌‌ఎంబీ మీటింగ్‌‌లో గట్టిగా చెప్పాలి” అని రాష్ట్ర ఇరిగేషన్​ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్​ ఆదేశించారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఏపీలోనే మొదలుపెట్టినవని, ఒక్కటి కూడా కొత్తది కాదనే విషయాన్ని వివరించాలని సూచించారు. ‘‘మన ప్రాజెక్టుల విషయంలో కృష్ణా, గోదావరి బోర్డులకు, ఏపీ ప్రభుత్వానికి ఉన్న అపోహలను దూరం చేయాలి. గోదావరి నదిలో తెలంగాణకు 954 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని, ఆ నీటిని వాడుకునేందుకే ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని గట్టిగా చెప్పాలి” అని ఆయన పేర్కొన్నారు. కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్‌‌ఎంబీ), గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (జీఆర్‌‌ఎంబీ) మీటింగ్స్​లో అనుసరించాల్సి వ్యూహంపై మంగళవారం రెండో రోజు ప్రగతిభవన్​లో ఇంజనీర్లతో సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు. ఈఎన్సీలు మురళీధర్‌‌, నాగేందర్‌‌రావు, హరిరామ్‌‌, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌‌దేశ్‌‌పాండే, ఇంటర్‌‌స్టేట్‌‌సీఈ నర్సింహారావు  పాల్గొన్నారు.

గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ అక్రమమేననంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆయా రివర్‌‌బోర్డులకు కంప్లైంట్‌‌చేసింది. అపెక్స్‌‌కౌన్సిల్‌‌, సీడబ్ల్యూసీ, సంబంధిత రివర్‌‌బోర్డు అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టుల పనులు ఆపాలంటూ కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. ఈ క్రమంలో రెండు నదుల మేనేజ్​మెంట్​ బోర్డుల మీటింగ్‌‌లు నిర్వహిస్తున్నందున ఆ సమావేశాల్లో ఎలాంటి వాదనలు వినిపించాలో రాష్ట్ర ఇరిగేషన్​ ఇంజనీర్లకు సీఎం వివరించారు. సోమవారం మధ్యాహ్నం ఇంజనీర్లతో సమావేశమైన ఆయన.. ఉమ్మడి ఏపీలో ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి జారీ చేసిన జీవో కాపీలు బయటికి తీయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాత్రి పొద్దుపోయేదాకా ఇంజనీర్లు ఫైళ్లన్నీ తిరగేసి.. ఆయా ప్రాజెక్టుల సర్వే కోసం జారీ చేసిన జీవోలు మొదలు వాటికి అడ్మినిస్ట్రేటివ్‌‌శాంక్షన్‌‌ఇచ్చిన జీవోలు, అనుబంధంగా జారీ చేసిన అన్ని ఉత్తర్వుల కాపీలను రెడీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌‌లో ఆ జీవోల కాపీలను సీఎం కేసీఆర్‌‌కు అందజేశారు. వాటిని పరిశీలించిన సీఎం కేసీఆర్​.. ఒక్కో ప్రాజెక్టును సర్వే చేసేందుకు జారీ చేసిన జీవో దగ్గరి నుంచి అడ్మినిస్ట్రేటివ్‌‌శాంక్షన్‌‌, ఎగ్జిక్యూషన్‌‌వరకు జరిగిన పరిణామాలను బోర్డుల ముందు ఉంచాలన్నారు. రెండు నదుల బోర్డులతోపాటు ఏపీ ప్రభుత్వం మన ప్రాజెక్టులపై పెట్టుకున్న అపోహలను తొలగించాలని సీఎం సూచించారు. పాత ప్రాజెక్టులను ఎందుకు రీ డిజైన్‌‌చేయాల్సి వచ్చిందో కూడా వివరించాలన్నారు.

ఏపీ ప్రాజెక్టులపై ఎండగట్టండి

ఏపీ తలపెట్టిన సంగమేశ్వరం లిఫ్ట్‌‌, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు ప్రాజెక్టులు పూర్తిగా కొత్తవని, వీటి కోసం ఉమ్మడి ఏపీలో సర్వే చేసిన దాఖలాలు కూడా లేవని సీఎం అన్నారు. అదే విషయాన్ని కేఆర్‌‌ఎంబీ మీటింగ్‌‌లో చెప్పాలని ఇంజనీర్లకు సూచించారు. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు చేపడుతూ తెలంగాణ ప్రాజెక్టులపై కంప్లైంట్‌‌చేయడాన్ని తిప్పికొట్టాలని అన్నారు. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్న గోదావరి నీటికి బదులుగా కృష్ణాలో 45 టీఎంసీల నికర జలాలు తెలంగాణకు దక్కేలా బోర్డుపై ఒత్తిడి పెంచాలని సూచించారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ వాదనను కొట్టిపారేయాలని సూచించారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ఉమ్మడి ఏపీలో జారీ చేసిన జీవో కాపీలను బోర్డుకు, ఏపీ జలవనరుల శాఖకు అందజేయాలన్నారు.

గోదావరిలో వాటానే వాడుకుంటాం

గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకున్న 954 టీఎంసీల కేటాయింపులనే వాడుకుంటామనే విషయాన్ని జీఆర్​ఎంబీ మీటింగ్​లో గట్టిగా చెప్పాలని రాష్ట్ర ఇరిగేషన్​ ఇంజనీర్లకు  సీఎం కేసీఆర్​ ఆదేశించారు. కృష్ణా నీళ్లలో తమ వాటాను వాడుకునేందుకు కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తామని ఏపీ చెప్తోందని, ఇప్పటికే కేటాయింపులకు మించి నీటిని వాడుకుంటూ వరద నీళ్ల పేరుతో దబాయిస్తోందని ఆయన అన్నారు. ఏపీనే కేటాయింపుల మేరకు నీటిని వాడుకుంటామని అడ్డంగా వాదిస్తున్నప్పుడు కేటాయింపులకు లోబడే గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులు చేపడుతున్నామని మీటింగ్​లో చెప్పాలని సూచించారు. 954 టీఎంసీలకు మించి ఒక్క చుక్క కూడా తీసుకోబోమనే విషయాన్ని గట్టిగా వాదించాలన్నారు. ఎగువ గోదావరిలో వరద రావడం లేదని, ప్రాణహిత కలిసిన తర్వాతే గోదావరిలో ప్రవాహాలు ఉంటున్నాయనే విషయాన్ని ఫ్లడ్‌‌డేటా ఆధారంగా వివరించాలని, అందుకే కింది నుంచి నీటిని ఎత్తిపోసుకుంటున్నామనే విషయాన్ని తెలపాలని సూచించారు.

ఖైరతాబాద్ లో 20 రోజుల్లోనే 180 పాజిటివ్ కేసులు

Latest Updates