కాంగ్రెస్ లేదు..బీజేపీ లేదు..గెలిచేది మనమే

  • ప్రతిపక్షాలను పట్టించుకోవద్దు
  • జీహెచ్ఎంసీలో 103 సీట్లు గెలుస్తాం
  • దుబ్బాకలో లక్ష మెజార్టీ వస్తది
  • టైమొచ్చినప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా
  • ఎమ్మెల్యేకు చెప్పాకే మంత్రులు నియోజకవర్గాలకు వెళ్లాలె..
  • సరిగా పనిచేయని వాళ్లకు టికెట్లు కట్ చేస్తం

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో బీజేపీ ప్రభావం అసలే లేదని, కాంగ్రెస్​ రోజురోజుకూ బలహీనపడుతోందని సీఎం కేసీఆర్​ అన్నారు. ఆ పార్టీలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని.. జీహెచ్ఎంసీ ఎలక్షన్లు, దుబ్బాక బైఎలక్షన్​లో టీఆర్ఎస్​ గెలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీల నేతలు ఏదేదో వాగుతుంటారని, వారి మాటలను పట్టించుకోవద్దని కామెంట్​ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురు లేదన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్  లేజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరిగింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్​ మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు.

కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీ తప్పులను ఎత్తిచూపడంలో కాంగ్రెస్ పూర్తిగా ఫెయిలైందని విమర్శించారు. రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ చేసే ప్రయత్నాలు సఫలం కావని కామెంట్​ చేశారు. తమ సర్కారు గత పాలకుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పార్టీ వర్గాలు చెప్పిన సమాచారం మేరకు మీటింగ్ వివరాలివీ..

జీహెచ్ఎంసీలో మనకే అనుకూలం

జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే చేయించిన నాలుగైదు సర్వేల్లో 103 సీట్లు టీఆర్ఎస్​ గెలుస్తుందని రిపోర్టు వచ్చిందన్నారు. గ్రేటర్ ఎలక్షన్స్ లో బీజేపీ ఎఫెక్ట్​ పెద్దగా ఉండదని, కాంగ్రెస్ పూర్తిగా బలహీన పడిందని పేర్కొన్నారు. పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయని, అయినా అలర్ట్​గా ఉండాలని సూచించారు. దుబ్బాక బై ఎలక్షన్స్ లో కూడా టీఆర్ఎస్ లక్ష మెజార్టీతో గెలుస్తుందన్నారు. అక్కడ ప్రతిపక్షాలు పోటీ చేయడం కూడా వృథాయేనని కామెంట్​ చేశారు.

టైమొచ్చినప్పుడు చెప్పే వెళ్తా..

కేంద్ర రాజకీయాల్లో శూన్యత ఉందని సీఎం కేసీఆర్  పేర్కొన్నారు. దేశంలో కొత్త స్కీంలను ప్రవేశపెట్టే చాన్స్ ఉందని, కానీ కేంద్ర పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏటా వేల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని.. వాటిని సరిగా వాడుకోవడంలో సెంటర్​ఫెయిలవుతోందని ఆరోపించారు. టైమొచ్చినప్పుడు తప్పకుండా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని.. అందరికీ చెప్పి, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, ముందు అవి పూర్తి చేయడం తన బాధ్యత అని చెప్పారు.

కేంద్రం ఇబ్బందిపెడ్తోంది

కేంద్రం కావాలనే రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతోందని, సపోర్టు చేసినా వివక్ష చూపుతోందని ఆరోపించారు. లాక్ డౌన్  టైంలో కేంద్రానికి సూచనలు చేసినా పట్టించుకోలేదన్నారు. లాక్ డౌన్‌తో అనేక ఇబ్బందులు వచ్చాయని, ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని వివరించారు. కరోనా కట్టడి విషయంలో కేంద్రానికి సరైన ఎజెండా లేకుండా పోయిందని, అందుకే స్వాతంత్రోద్యమం తర్వాత మళ్లీ ప్రజలు వేలాది కిలోమీటర్లు నడిచి సొంత ఊళ్లకు పోయారన్నారు.

తెలంగాణ మరో కోనసీమ

ఇరిగేషన్ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాక తెలంగాణ మరో కోనసీమగా మారిందని ఈ మధ్య తనను కలిసిన కవి గోరేటి వెంకన్న అభిప్రాయపడ్డారని కేసీఆర్  చెప్పారు. గతంలో మడులన్నీ బీళ్లుగా ఉండేవని, ఇప్పుడు సాగు విస్తీర్ణం పెరిగిందని అన్నారు. ప్రస్తుత వానాకాలంలో రాష్ట్రంలో కోటీ 20 లక్షల ఎకరాలు సాగైందని వివరించారు.

Latest Updates