పరిపాలన సంస్కరణలతో ప్రగతిలో దూసుకుపోతున్నాం

పరిపాలన సంస్కరణలు

అసెంబ్లీలో పరిపాలన సంస్కరణల గురించి మాట్లాడిన సీఎం “ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయడం కోసం మన రాష్ట్రంలో విప్లవాత్మకమైన పరిపాలన సంస్కరణలను విజయవంతంగా అమలు చేసుకున్నాం. దేశ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ పాలనా సంస్కరణలు మరెక్కడా జరగలేదు. మొదట 10 జిల్లాలను 31 జిల్లాలు చేసుకున్నాం. ఇటీవలే కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. 43 రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 69 కి పెంచుకున్నాం. 459 మండలాలను 584 మండలాలు చేసుకున్నాం. గతంలో 68 మున్సిపాలిటీలుంటే కొత్తగా మరో 68 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలో ఇప్పుడు మొత్తం 136 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉన్నాయి. కొత్తగా 4,383 గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పంచాయితీల సంఖ్య 12,751 కు పెరిగింది.

శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం కొత్త పోలీసు కమీషనరేట్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం రెండు పోలీసు కమీషనరేట్లు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం కొత్తగా ఏడు పోలీస్ కమీషనరేట్లు ఏర్పాటు చేసింది. కొత్త పోలీస్ సబ్ డివిజన్లను, కొత్త సర్కిళ్లను, కొత్త పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలీస్ సబ్ డివిజన్ల సంఖ్యను 139 నుంచి 163కు, సర్కిళ్ల సంఖ్యను 688 నుంచి 717కు, పోలీస్ స్టేషన్ల సంఖ్యను 712 నుంచి 814కు ప్రభుత్వం పెంచింది.

గ్రామ పంచాయితీలుగా తండాలు :

మా తండాల్లో మా రాజ్యం, మా గూడాల్లో మా రాజ్యం అనే నినాదంతో తండాలు, గూడాలను ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పాటు చేయాలని ఎస్టీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల మానిఫెస్టోలో హామీలు ఇచ్చారు తప్ప, వారి డిమాండ్ నెరవేర్చలేదు. ఎస్టీ ప్రజల స్వపరిపాలన కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసింది. 1,177 తండాలు, గూడాలను కొత్తగా గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేసింది. 1,281 ఆవాస ప్రాంతాలు షెడ్యూల్డు ఏరియాలో ఉండడంతో వాటిని ఎస్టీలకే రిజర్వు చేసింది. గ్రామాల్లో ఎస్టీల జనాభాను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో 688 గ్రామాలను ఎస్టీలకు రిజర్వు చేసింది. దీంతో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3,146 మంది ఎస్టీలు సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో ఎస్టీలకు ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేసి, గ్రామ పరిపాలనా బాధ్యతలను ఎస్టీలకే అప్పగించే అభ్యుదయకర నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం దేశ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

నూతన పంచాయతీ రాజ్ చట్టం

భారతీయ ఆత్మ గ్రామాలలోనే ప్రతిఫలిస్తుందని గాంధీ మహాశయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదించిన ఆశయాలేవీ తదనంతర కాలంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గ్రామ స్వరాజ్య భావన నినాదంగానే మిగిలిపోయింది. తెలంగాణ ప్రభుత్వం గాంధీ కోరిన గ్రామాభ్యుదయం కోసం నిర్మాణాత్మక చర్యలు ప్రారంభించింది. నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని రూపకల్పన చేసింది. ఈ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు కావాల్సిన అధికారాలను, విధులను అందిస్తున్నది. గ్రామంలో పచ్చదనం పెంచడం, పారిశుధ్యం నిర్వహించడం తదితర అంశాలలో బాధ్యతాయుత ప్రవర్తనను చట్టం కోరుతున్నది. బాధ్యతను విస్మరించిన వ్యక్తులను శిక్షించే అవకాశం ఈ చట్టం కల్పిస్తున్నది. ఆదర్శవంతమైన గ్రామాల రూపకల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది.

గ్రామ పంచాయతీలకు నిధులు :

గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత రానీయకుండా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అటు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులు, ఇటు నరేగా ద్వారా వచ్చే నిధులు, గ్రామ పంచాయతీలకున్న సొంత ఆదాయ వనరులు.. ఇలా  అన్ని రకాల నిధులను కలిపి రాబోయే ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

14 వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ వ్యక్తికి ఏడాదికి 806 రూపాయల చొప్పున కేంద్రం నుంచి నిధులు అందుతాయి. అంటే తెలంగాణలోని 2 కోట్ల 2 లక్షల గ్రామీణ జనాభాకు ఏడాదికి 1,628 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయి. దీనికి తెలంగాణ మొదటి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కూడా జమ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల విషయంలో రాష్ట్ర ఆర్థిక సంఘం ఇటీవలే మధ్యంతర నివేదిక ఇచ్చింది.

గ్రామీణ స్థానిక సంస్థలకు 1629 కోట్ల రూపాయలు, పట్టణ స్థానిక సంస్థలకు 1037 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని సిఫార్సు చేసింది. అయితే, గ్రామాల అభివృద్ధికి ఎక్కువ నిధులు అవసరమని భావించిన ప్రభుత్వం, రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన సిఫారసులకన్నా ఎక్కువ మొత్తంలోనే నిధులివ్వాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రానికి 1,628 కోట్ల రూపాయలు ఇస్తున్నందున, రాష్ట్రం తరుపున కూడా అంతే మొత్తంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు ఫైనాన్స్ కమీషన్ల ద్వారా గ్రామాలకు మొత్తం 3,256 కోట్ల రూపాయలు అందనున్నాయి. అంటే ఒక్కో మనిషికి 1606 రూపాయల చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు అందుతాయి. 500 జనాభా కలిగిన గ్రామానికి కూడా 8 లక్షల రూపాయల నిధులు వస్తాయి. ఇవికాక, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరో 4,000 కోట్ల రూపాయలు అందుతాయి. పన్నుల ద్వారా గ్రామ పంచాయితీలకు మరో 700 కోట్ల రూపాయలు సమకూరుతాయి. ఈ మూడు మార్గాల ద్వారా గ్రామాలకు ప్రతీ ఏటా దాదాపు 8 వేల కోట్ల రూపాయల మేర నిధులు అందుబాటులో ఉంటాయి. ఐదేళ్ల కాలంలో మొత్తం 40 వేల కోట్లు గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో గ్రామాల అభివృద్ధికి గతంలో నిధులు అందలేదు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని, చిత్తశుద్ధితో, అంకితభావంతో పని చేస్తారని  ఆశిస్తున్నాను. ఆదర్శ గ్రామాలను నిర్మించే కృషిలో ప్రజలు కూడా తమ భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను.

నగరాల అభివృద్ధి :

రోజురోజుకు పట్టణాలు, నగరాల్లో జనాభా తీవ్రంగా పెరుగుతున్నది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ఆయా వట్టణాల్లో, నగరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నది. హైదరామాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని నగరాల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తున్నది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చే కృషి కొనసాగుతున్నది” అని చెప్పారు కేసీఆర్.

Latest Updates