విమాన ప్ర‌యాణంలో సోష‌ల్ డిస్టెన్స్.. మిడిల్ సీటుకు ష‌ర‌తులు

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన విమాన ప్ర‌యాణాలు రెండు నెల‌ల త‌ర్వాత మే 25న రీస్టార్ట్ అయ్యాయి. అయితే ఈ ప్ర‌యాణ స‌మ‌యంలో వైర‌స్ వ్యాప్తికి చాన్స్ ఇవ్వ‌కూడ‌ద‌ని పౌర విమాన‌యాన శాఖ‌.. ఎయిర్ పోర్టుల‌కు, ఎయిర్ లైన్స్ సంస్థ‌ల‌కు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. ప్ర‌స్తుతం దేశీయ విమాన స‌ర్వీసులు మాత్ర‌మే న‌డ‌స్తుండ‌గా.. అన్ని విమానాశ్ర‌యాల్లోనూ ప్ర‌యాణికుల‌ను స్క్రీనింగ్ చేసి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని తేలాకే లోప‌లికి అనుమ‌తించాల‌ని ఆదేశించింది. అయితే అసింప్ట‌మేటిక్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో మ‌రిన్ని జాగ్రత్త‌లు తీసుకోవాల‌ని ఎయిర్ లైన్స్ సంస్థ‌ల‌ను డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. విమాన ప్ర‌యాణంలో సోష‌ల్ డిస్టెన్స్ పాటించేలా చర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది.

సోష‌ల్ డిస్టెన్స్ కోసం మిడిల్ సీటుకు కండిష‌న్స్

విమాన ప్ర‌యాణంలో ఒక‌రి నుంచి మ‌రొక‌రికి క‌రోనా వైర‌స్ సోకే ప్ర‌మాదం లేకుండా చర్య‌లు తీసుకోవాల‌ని డీజీసీఏ ఎయిర్ లైన్స్ సంస్థ‌ల‌ను ఆదేశించింది. వీలైనంత వ‌ర‌కు మిడిల్ సీటును ఖాళీగా ఉంచాల‌ని చెప్పింది. ర‌ద్దీని బ‌ట్టి ప్యాసింజ‌ర్లు త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు మ‌ధ్య సీటును ఖాళీగా వ‌దిలేయాల‌ని ఆదేశించింది. ఒక‌వేళ మ‌ధ్య సీటును కూడా ఫిల్ చేయాల్సి వ‌స్తే ఒకే కుటుంబం వారైతే ప‌క్క‌న కూర్చునే అవ‌కాశం ఇవ్వొచ్చ‌ని తెలిపింది డీజీసీఏ. ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండి.. ఇత‌రుల‌కు మిడిల్ సీటు కేటాయించాల్సి వ‌స్తే.. ఆ ప్ర‌యాణికుడికి పీపీఈ కిట్ ను ఇవ్వాల‌ని డీజీసీఏ ఆదేశించింది. ఇత‌ర ప్యాసింజ‌ర్ల‌కు కూడా మాస్క్ త‌ప్ప‌నిస‌రి అని ఇప్ప‌టికే పౌర విమాన‌యాన శాఖ సూచించింది.

జూన్ 3 నుంచి అమలు

విమానంలోని ప్ర‌తి ప్యాసింజ‌ర్ కు త్రీ లేయ‌ర్ స‌ర్జిక‌ల్ మాస్క్, ఫేస్ షీల్డ్, శానిటైజ‌ర్ అందించాల‌ని విమాన‌యాన సంస్థ‌ల‌ను డీజీసీఏ ఆదేశించింది. గ‌మ్యం చేరిన ప్ర‌తిసారి ఫ్లైట్ ను శానిటైజ్ చేయాల‌ని సూచించింది. సీట్లు, సీటు బెల్టులు, ఇత‌ర కాంటాక్ట్ పాయింట్ల‌ను శుభ్రం చేయాల‌ని చెప్పింది. విమానంలోని టాయిలెట్స్ ని ప్ర‌యాణ స‌మ‌యంలోనూ త‌ర‌చూ శానిటైజ్ చేయాలని ఆదేశించింది. పైలెట్ల‌తో పాటు ఫ్లైట్ లోని సిబ్బంది అంద‌రికీ టెస్టులు చేయ‌డంతో పాటు పూర్తిగా ప్రొటెక్టివ్ ఎక్యూప్మెంట్ ధ‌రించేలా చూడాల‌ని చెప్పింది. ఎయిర్ పోర్టులు, ఎయిర్ లైన్స్ సంస్థ‌లు అవ‌స‌రాన్ని, వీలును బ‌ట్టి ప్ర‌యాణికుల కోసం డిసిన్ఫెక్ట్ ట‌న్నెల్స్ ‌ను ఏర్పాటు చేయాల‌ని డీజీసీఏ సూచించింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జూన్ 3 నుంచి త‌ప్ప‌నిస‌రిగా అమల‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది.

Latest Updates