చూసుకో పదిలంగా.. హృదయాన్ని అద్దంలా!

keep-your-heart-healthy

‘వానికి మనసే లేదు.. వట్టి రాతిగుండె’ ‘ఇలాంటి పరిస్థితుల్లోనే.. గుండె రాయి చేసుకోవాలి’  ‘తనది మొండిగుండె కాబట్టి తట్టుకుంది.. లేకుంటేనా’ ఇలాంటి మాటలు అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. ఇంతకీ మీరు మీ గుండెను ప్రేమిస్తున్నారా? దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారా? అద్దంలాంటి గుండెను పదిలంగా కాపాడుకుంటేనే.. మనం పది కాలాల పాటు నవ్వుతూ, ఆరోగ్యంగా ఉంటాం. అందుకే.. హృదయాన్ని  పదిలంగా చూసుకోవాలంటే.. ఈ స్టోరీ ఫాలో అయిపోండి!

వీలైనంత వరకు రాత్రి ఎనిమిదింటిలోపే డిన్నర్​ పూర్తయ్యేలా ప్లాన్​ చేసుకోండి. తిన్న తర్వాత అరగంటకు నీళ్లు తాగండి. ఆరోగ్యకరమైన గుండె కావాలంటే మంచి ఆహార అలవాట్లు కూడా ముఖ్యమే. రెగ్యులర్​గా నిమ్మరసం, కర్జూర తీసుకుంటే అందులోని ఫోనోలిక్​ యాంటీ ఆక్సిడెంట్స్​ గుండె సంబంధ వ్యాధులను నివారించే దిశగా పనిచేస్తాయి.  మొలకెత్తిన గింజలు, ఆకుకూరలు, కొబ్బరి, క్యారెట్​ వంటివి రెగ్యులర్​గా డైట్​లో ఉండేలా చేసుకోండి. వారానికి కనీసం మూడురోజులైనా పండ్లు తీసుకోవాలి. మొక్కజొన్నలో ఉండే పోషకాలు గుండెను సమర్థవంతంగా పనిచేసేలా పటిష్టపరుస్తాయి.  గుండెను రోగాల బారి నుంచి కాపాడతాయి. బాదం గింజల్లోని మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఆహారంలో ఎక్కువ శాతం కూరగాయలు ఉండేలా ప్లాన్​ చేసుకోవాలి.  తినే ఆహారంలో ఫైబర్​ ఎక్కువగా ఉండాలి.

వద్దు సుమా!

నాలుగు పెగ్గులు వేస్తే.. అడుగులే సరిగ్గా వేయడం కుదరదు. సిగరెట్ల దమ్ము ఎక్కువ లాగితే.. ఆ రోజంతా దగ్గి దగ్గి అలసిపోతాం. అలాంటిది రోజూ.. తాగితే చిట్టిగుండె ఎలా తట్టుకుంటుంది. మద్యంలోని ఆల్కహాల్, పొగాకులోని నికొటిన్ గుండె ఆరోగ్యానికి చిల్లు పెడతాయి. మసాలా ఆహారం అస్సలు తీసుకోవద్దు. నూనె, కొవ్వు పదార్థాలు కూడా తక్కువగా తీసుకోవాలి.  ఉప్పు గుండె ఆరోగ్యానికి ముప్పు. అందుకే.. ఉప్పు తగినంత మాత్రమే తినండి. కుదిరితే.. కాస్త తక్కువ తిన్నా ఫర్వాలేదు. కానీ..ఎక్కువ కాకుండా చూసుకోండి. కూల్​డ్రింక్స్​, ప్యాక్డ్​​ డ్రింక్స్​ జోలికి అస్సలు వెళ్లకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురికాకండి. ఒత్తిడి గుండె మీద ప్రభావం చూపి దాని పనితీరును దెబ్బతీస్తుంది.

 కోపం..గుండెకు శత్రువు

‘తనకోపమే తన శత్రువు’ అనే పద్యం చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. కోపం వ్యక్తిగతంగానే కాదు.. ఆరోగ్య పరంగా కూడా అంత మంచిది కాదు. కోపం వస్తే.. దాని ప్రభావం అన్నీ శరీరభాగాల కంటే ముందు పడేది గుండె మీదనే. అందుకే.. కోపం వీలైనంత వరకు తగ్గించుకోవాలి. మనదేశంలో యువతలో కోపం ఎక్కువగా ఉండడం వల్ల 40 ఏండ్లలోపే గుండెజబ్బుల బారిన పడుతున్నారట. ఒత్తిడి కారణంగా మనిషిలో కోపం పెరుగుతుంది. ఒత్తిడి, కోపం రెండూ ఒకేసారి రావడం వల్ల గుండె పనితీరు మందగించి ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఒత్తిడిలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీంతో ఎక్కువ శ్రమించి, బాగా అలసిపోతుంది. ఫలితంగా గుండెజబ్బులకు గురవుతారు. కోపం వచ్చినప్పుడు ముందు పది నిమిషాలు ఓపికగా ఆలోచించుకోండి. అంకెలు లెక్కబెట్టండి. ఒక గ్లాసు చల్లటి నీళ్లు తాగండి.

 సంతోషం.. సగం బలం..

సంతోషంగా ఉన్నప్పుడు హృదయం ప్రశాంతంగా ఉంటుంది. యాక్టివ్​​గా పనిచేస్తుంది కూడా. నవ్వు గుండెను ఉత్తేజపరిచి ఊపిరితిత్తులకు ప్రాణవాయువును సరఫరా చేస్తుంది. మెదడులోని జీవకణాలకు శక్తినిచ్చి పాజిటివ్​ థింకింగ్​ను పెంచుతుంది. నవ్వడం వల్ల గుండె ఉత్తేజితమై జీర్ణశక్తి మెరుగవుతుంది. హాయిగా నవ్వితే మనసులో ఉన్న టెన్షన్​లన్నీ తొలగిపోయి తేలికపడుతుంది. దీంతో గుండె మీద భారం తగ్గుతుంది. బీపీ, ఒత్తిడుల నుంచి నవ్వు గుండెను కాపాడుతుంది.  నవ్వినప్పుడు న్యూరోపెప్లైడ్స్​ అనే రసాయనాలు విడుదలై కార్టిసోల్​ హార్మోన్​తో పోరాడుతాయి. దీంతో గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. రక్తపీడనం తగ్గుతుంది.

కాస్త కష్టపడండి బాస్​!

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని కాస్త కష్టపెట్టాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తప్పకుండా కనీసం ఒక గంటైనా వ్యాయామం చేయాలి. రెండుపూటలా కుదరకపోతే.. ఒక్కపూటైనా ఓ గంటసేపు వ్యాయామం చేస్తే మీ గుండె కొవ్వు దాడి నుంచి రక్షించబడినట్టే. మారుతున్న లైఫ్​స్టైల్​ రోజురోజుకు మనిషిలో బద్ధకాన్ని పెంచుతుంది. ఎక్కడికి వెళ్లాలన్నా బైక్, కార్​ లేనిదే వెళ్లడం లేదు. దూరం అయితే పర్వాలేదు. కూరగాయలు, పాలు, కిరాణాషాపు, పక్క గల్లీలో ఉన్న పార్కుకు వెళ్లాలన్నా బండెక్కితే.. మీ ఆరోగ్యం కొండెక్కుతుంది జాగ్రత్త.
ఎక్కువ వేగంతో తక్కువ దూరం పరుగెత్తే కంటే, నడిచే కంటే.. తక్కువ వేగంతో ఎక్కువ దూరం, ఎక్కువ అడుగులు ఉండేలా వాకింగ్, రన్నింగ్​ చేయండి. నిరంతరాయంగా మనకోసం కష్టపడి పనిచేసే గుండెకోసం.. రోజులో ఒక గంట కష్టపడలేమా? ఆలోచించండి. శరీరాన్ని కాస్త కష్టపెడితే.. గుండె ఆరోగ్యంగా మనకోసం పనిచేస్తుంది.

Latest Updates