గోవా స్థానికులకు ఉద్యోగాల్లో 80% రిజర్వేషన్

గోవా స్థానికులకు ఉద్యోగాల్లో 80% రిజర్వేషన్

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వ మోడల్‌ను బీజేపీ కాపీ చేస్తోందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఉచిత నీరు, నేరుగా ఇంటి దగ్గరకే సేవలు వంటి వాగ్దానాలు తమ నుంచి కాపీ చేసినవేనన్నారు. గోవా ప్రజలు ఒరిజనల్‌కు ఓటేవేయాలని, డుప్లికేట్‌కు ఓటు వేయవద్దని కోరారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవాలో కేజ్రీవాల్  ఇవాళ(మంగళవారం) పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోవా ప్రజలకు 7 హామీలు ఇచ్చారు.

AAP ప్రభుత్వం అధికారంలోకి వస్తే గోవా ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కేజ్రీవాల్. కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పిస్తామని, కుటుంబంలో ఎవరో ఒకరికి ఉపాధి లభించేంత వరకూ నెలకు రూ.3,000 ఇస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. కరోనా కారణంగా టూరిజం రంగంలో ఉద్యోగం కోల్పోయిన వారికి నెలకు రూ.5,000 ఇస్తామని, గనులపై నిషేధం కారణంగా బాధితులైన వారికి ప్రతినెలా రూ.5,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.