అడవిలో జంతువుల దాహం తీరుస్తాడు

దూరం నుంచి ట్రక్కు సౌండ్ వినగానే.. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ పరుగెత్తుకుంటూ వస్తాయి. అది వాటర్‌‌‌‌ ట్యాంకర్ ట్రక్కు. అందులో నుంచి ఒక డ్రైవర్ దిగి పక్కనే ఉన్న మడుగులోకి నీళ్లు విప్పుతాడు. వెంటనే ఆ జంతువులు ఎగబడి దాహం తీర్చుకుంటాయి. ఇందులో ఏనుగులు, జీబ్రాలు, జింకలు, గేదెలు ఉంటాయి. ఒక దాని తర్వాత ఒకటి వచ్చి తాగి తిరిగి మేతకు పోతాయి. ఆ డ్రైవర్‌‌‌‌ది కెన్యా. పేరు ప్యాట్రిక్ కిలోంజో మ్యాలువా. కరువు కోరల్లో చిక్కిన సావో అడవి జంతువుల దాహం తీరుస్తూ.. మూగ జీవుల ప్రాణాలు కాపాడుతున్నాడు. అందుకే ఆయన్ను ప్రేమతో ‘వాటర్ మ్యాన్’ అని పిలుచుకుంటున్నారు.

నలభై ఐదేళ్ల ప్యాట్రిక్‌‌ది కెన్యాలోని వోయిడ్ అనే చిన్న టౌన్. బటానీ పండించే రైతు. అతనికి రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకోవడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవు. అయితే, 2016లో ఒక రోజు వాళ్ల ఊరికి కొంత దూరంలో ఉన్న సావో నేషనల్‌‌ పార్క్‌‌కి వెళ్లాడు. అప్పుడు అక్కడ కరువు తాండవిస్తోంది. ఎక్కడా నీళ్ల జాడ లేదు. చాలా మడుగులు, కొలనులు ఎండిపోయాయి. ఉన్న కొన్ని మడుగుల్లో నీళ్లు ఇంకి బురద గుంటలుగా మారాయి. చాలాచోట్ల దాహం తట్టుకోలేక చనిపోయిన జంతువులు అతనికి కనపడ్డాయి. ‘పార్క్‌‌లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. నేను వాటికి క్లీన్‌‌ వాటర్‌‌‌‌ తీసుకెళ్లకపోతే.. డీ హైడ్రేషన్‌‌తో చనిపోతాయి’ ఆ క్షణంలో అనుకున్న మాటల్ని గుర్తు చేసుకున్నాడు ప్యాట్రిక్. వాటికి ఎలాగైనా సాయం చేయాలనుకున్నాడు. కానీ, అతని దగ్గర డబ్బు లేదు.

ట్యాంకర్ కిరాయి తీసుకొని..

వెంటనే వాళ్ల ఊరికి వెళ్లి తన పని మొదలు పెట్టాడు. అతని దగ్గర ఉన్న డబ్బుతో పాటు విషయం చెప్పి ఫ్రెండ్స్‌‌ దగ్గర కొంత డబ్బు తీసుకున్నాడు. కొంతమంది దాతలు కూడా అతనికి సాయం చేశారు. ఆ డబ్బుతో ఒక వాటర్ ట్రక్కుని కిరాయికి తీసుకున్నాడు. ఆ వాటర్ ట్యాంకర్ కెపాసిటీ పదివేల లీటర్లు. వోయిడ్‌‌కి ఇరవై కిలోమీటర్ల దూరంలో నీళ్లు దొరుకుతాయి. అక్కడికెళ్లి నీళ్లు కొన్నాడు. అక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవికి ట్రక్కుని తోలుకుంటూ వెళ్లాడు. ఎండిపోయిన మడుగులో ట్యాంకర్ నల్లా విప్పాడు. అది చూసిన జంతువులన్నీ పరిగెత్తుకుంటూ వచ్చాయి. ‘అందులో ఒక గేదె నా వైపే వచ్చింది. దాన్ని చూసి పొడుస్తుందేమో అని చాలా భయపడ్డాను. కానీ, అది నా చేతిని ముద్దాడింది. వాటి భాషలో అది నాకు ‘థ్యాంక్స్’ చెప్పిందేమో అనుకున్నాను’ అని చెప్పాడు ప్యాట్రిక్‌‌. ఇక తర్వాత పగలు పొలంలో పని చేయడం.. సాయంత్రాలు ట్యాంకర్‌‌‌‌లో నీళ్లు నింపుకొని అడవికి రావడం అతని దినచర్యలో భాగమైంది. వారంలో నాలుగు రోజులు ప్రతి సాయంత్రం కొన్ని గంటల సేపు ట్రక్కు తోలుకుంటూ వెళ్లి… దాహంతో ఉన్న గేదెలు, ఏనుగులు, జీబ్రాలు, జింకల దాహం తీరుస్తున్నాడు.

గవర్నమెంట్‌‌ సపోర్ట్‌‌

ప్యాట్రిక్‌‌ చేస్తున్న సేవని గుర్తించిన కెన్యా ప్రభుత్వం అతనికి సపోర్ట్‌‌గా నిలిచింది. అతను ట్యాంకర్ నుంచి వాటర్‌‌‌‌ పోయగానే ఇంకిపోవడం, ముందు తాగిన జంతువులు ఆ నీళ్లను మురికిగా మారుస్తుండటం వంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. దీనికి స్పందించిన ప్రభుత్వం అడవిలో పది కాంక్రీట్ మడుగులను కట్టించింది. ఇప్పుడు ఆ పది కాంక్రీట్‌‌ మడుగులను నింపడమే అతని పని. ఒక్కో కాంక్రీట్‌‌ మడుగు దగ్గర జంతువులు అతనికోసం ఎదురు చూస్తుంటాయి. ‘ఒకప్పుడు కురిసినట్టు ఇప్పుడు వర్షాలు కురవడం లేదు. గతేడాది జూన్‌‌లో అసలు వానలే లేవు. వానలు బాగా పడితే ఏ సమస్యా ఉండదు. కానీ, నవంబర్‌‌‌‌ వరకు వర్షాలు కురవడం లేదు. 2009లో కరువు దెబ్బకు ఇదే అడవిలో నలభైశాతం జంతువులు చనిపోయాయి. అందుకే, జంతువులకు నీటిని అందించడం మొదలుపెట్టాను. ఒక వేళ నేను ఈ పని చేయకపోతే.. అవి చచ్చిపోతాయనుకున్నా’ అంటాడు ప్యాట్రిక్. అతని సేవలకు 2018లో కెన్యా గవర్నమెంట్ ‘డెస్టిట్యూట్‌‌ రికమెండేషన్’ అవార్డ్ ఇచ్చింది.  కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ప్యాట్రిక్ మాట్లాడుతూ.. ‘నేను డయాలిసిస్‌‌ చేసుకున్న వెంటనే అడవికి వెళ్లిపోతాను. డయాలిసిస్ చేసుకున్న తర్వాత పని చేయలేం అనిపిస్తుంది. వీక్‌‌గా ఉంటాం. కానీ, నాలో ఉన్న మోటివేషన్, ప్యాషన్‌‌ ఈ పని చేసేందుకు శక్తినిస్తుంది’ అంటాడాయన.

వాటికి టైం తెలుసు

ఆ జంతువులకు సాయంత్రం ఏ టైంకి ట్యాంకర్ ట్రక్కు వస్తుందో బాగా తెలుసు. ఇదొక రొటీన్‌‌గా మారడం వల్ల అతని వెహికిల్ సౌండ్ వినగానే.. జంతువులన్నీ.. కాంక్రీట్ మడుగుల దగ్గరికి వచ్చి చుట్టూ నిలబడతాయి. నీళ్లు‌‌ పోసి.. కొన్ని మీటర్ల దూరంలో ప్యాట్రిక్‌‌, అతని టీం నిలబడతారు. ‘అవి మమ్మల్ని ఏం చేయవు. ఎప్పుడూ మమ్మల్ని ఎటాక్ చేయడానికి ట్రై చేయలేదు. అవి దాహం తీర్చుకుని దూరం వెళ్లగానే.. వేరే జంతువులు వచ్చి తాగుతాయి’ అంటాడు ప్యాట్రిక్‌‌. జంతువుల మీద ప్రేమతో ప్యాట్రిక్‌‌ వేసిన చిన్న అడుగులే వేలాది మూగజీవులకు ప్రాణం పోశాయి.

ఒక టీమ్ ఉంది..

‘అడవి జంతువుల పరిస్థితిని వివరిస్తూ వాటి దాహం తీర్చేందుకు సాయం చేయాలని సోషల్‌‌ మీడియాలో షేర్‌‌‌‌ చేశాను. క్రౌడ్‌‌ఫండింగ్‌‌ కోసం ‘గో ఫండ్ మీ’ అనే పేజి క్రియేట్ చేశాను. నా ఫ్రెండ్స్‌‌తో పాటు ప్రపంచం నలుమూలల నుంచి డొనేషన్స్ వచ్చాయి’ అని చెప్పాడు ప్యాట్రిక్. అతని హార్డ్‌‌ వర్క్, డెడికేషన్ చూసిన అమెరికన్ ఉమెన్ గ్రూప్‌‌ లక్షా ముప్పైవేల డాలర్లు విరాళంగా ఇచ్చింది. పెట్రోల్‌‌, ట్రక్కు రెంట్‌‌ ఖర్చులకు వాడుకోవాలని చెప్పింది. అడవికి నీళ్లు తీసుకెళ్లడానికి ప్యాట్రిక్‌‌కి అవుతున్న ఖర్చు వింటే షాకవుతారు. ఒక్క లోడ్‌‌కి 240 యూరోలు ఖర్చవుతుంది. మన కరెన్సీలో చెప్తే అది పందొమ్మిది వేల రూపాయలన్నమాట. అయితే, డొనేషన్స్ ద్వారా వచ్చిన డబ్బులతో ఇప్పుడు ఒక వాటర్‌‌‌‌ ట్యాంకర్ ట్రక్కుని కొన్నాడు. అంతేకాదు ఇప్పుడు అతనికి ఒక టీమ్‌‌ కూడా ఉంది. కరువు సమయంలో వాళ్లు అతనికి సాయం చేస్తుంటారు.

Latest Updates