రాష్ట్రపతికి 10వ తరగతి బాలుడి లెటర్

తమ గ్రామ సమస్యలను తీర్చాలంటూ కేరళకు చెందిన ఓ పదవ తరగతి బాలుడు.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లెటర్ రాశాడు. కొచ్చిలోని తీరప్రాంత గ్రామమైన చెల్లానంకు చెందిన ఎడ్గర్ సెబాస్టియన్ స్థానికంగా 10 వ తరగతి చదువుతున్నాడు. వారి గ్రామం తీరానికి ఆనుకొని ఉండటం వల్ల సముద్రపు కోతకు గురై ఇండ్లన్నీ నీటితో నిండిపోవడంతో పాటు.. కూలిపోతున్నాయి. గ్రామస్తులు గతంలో ఎంతోమంది దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఎటువంటి ఉపయోగంలేకపోయింది. దాంతో తమ గ్రామ ప్రజల బాధను చూడలేక సెబాస్టియన్ చివరి ప్రయత్నంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాయాలని నిర్ణయించుకున్నాడు. తమ గ్రామప్రజల బాధను వివరిస్తూ.. జూలై 25న రాష్ట్రపతికి లేఖ రాశాడు.

‘మా గ్రామం చెల్లానం విపత్తుల బారిన పడింది. అయినా మాకు సహాయం చేయడానికి ఇప్పటివరక ఎవరూ రాలేదు. అందుకే నేను ఈ లెటర్ రాస్తున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం రెండుసార్లు మా గ్రామం సముద్రపు కోతకు గురవుతుంది. అప్పుడు మా తల్లిదండ్రులు నన్ను మరియు నా సోదరున్ని తీసుకొని మా చుట్టాల ఇంటికి వెళ్లేవాళ్లు. సముద్రపు కోత కారణంగా ప్రతి సంవత్సరం వేసవి మరియు వర్షాకాలంలో నీరు మా ఇండ్లలోకి వస్తుంది. ఈ సంవత్సరం కూడా జూలై 16 నుండి సముద్రపు కోత ప్రారంభమైంది. ఎప్పటిలాగే మేం ఈసారి కూడా మా చుట్టాల ఇంటికి వెళ్లాలనుకున్నాం. కానీ, మా ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటం వల్ల వెళ్ళలేకపోయాము. మా గ్రామ ప్రజలకు సాయం చేయడానికి ఎవరూ రాలేదు. గ్రామంలోని దాదాపు అన్ని ఇళ్ళలోకి నీళ్లు వచ్చాయి. దాదాపు 400 ఇళ్ళు దెబ్బతిన్నాయి. మరో ఆరు ఇళ్ళు మాత్రం పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇళ్ళలోని వస్తువులతో పాటు.. నేను మరియు నా స్నేహితులు పాఠ్యపుస్తకాలు కూడా కోల్పోయాం. తీరంలోని కుటుంబాలను రక్షించడానికి సముద్రపు గోడను నిర్మించాలని డిమాండ్ చేస్తూ.. గ్రామస్తులతో కలిసి నా తండ్రి నిరాహార దీక్షలు కూడా చేశారు. అయినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. అందుకే మా ఈ సమస్యలో మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను. సరిహద్దును రక్షించాల్సిన బాధ్యత మీపై ఉందని నేను నమ్ముతున్నాను. మీరే నా చివరి ఆశ. మా గ్రామానికి సముద్రపు గోడను నిర్మించి మమ్మల్ని, మా గ్రామాన్ని రక్షించాలని కోరుతున్నాను’ అని లేఖలో పేర్కొన్నాడు.

For More News..

చైనా బిలియనీర్ కు భారత కోర్టు సమన్లు

Latest Updates