ప్లాస్టిక్ ఏరివేస్తుంటే పిచ్చోడనుకున్నరు

‘ఇంట్లో నాలుగు రోజులు చెత్త పేరుకుపోతే ఆ వాసన భరించలేం. అలాంటిది దారిన పోయే ప్రతి ఒక్కరూ చెత్త వేస్తే ఎలా ఉంటది?.. ఇళ్లు చెత్తకుప్పలాగా మారి ఊపిరి కూడా ఆడదు. సముద్రంలో బతికే చేపల పరిస్థితి కూడా అలాగే ఆగం అవుతోంది.  సముద్రం నా ఇల్లు. నాకు రోజూ అన్నం పెడ్తంది. దానిని కరాబు చేస్తుంటే చూస్తూ ఎట్లా ఊరుకోవాలె’ అంటున్నాడు కేరళకు చెందిన కేవీ ప్రియేష్‌‌‌‌. అతని కారణంగానే సముద్రపు అడుగున పేరుకుపోయిన వేల కేజీల కొద్దీ  ప్లాస్టిక్‌‌‌‌ వ్యర్థాలు బయటకు వచ్చినయ్‌‌‌‌. ఈ పని చేస్తునందుకుగానూ ఆ ఊరి జనాలు అతనికి పెట్టిన పేరు ‘పిచ్చోడు’..

పదో తరగతిలోనే చదువు ఆపేసిన ప్రియేష్.. చొంబళ తీరంలో(కోజికోడ్‌‌‌‌) తండ్రికి సాయంగా చేపల వేటకు వెళ్లేవాడు.  ఒకరోజు ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో వైరల్‌‌‌‌ అయిన ఒక పోస్టు అతన్ని ఆలోచింపజేసింది. ప్లాస్టిక్‌‌‌‌ వల్ల సముద్రంలోని జంతుజాలానికి జరుగుతున్న నష్టం గురించి వివరించిన పోస్ట్‌‌‌‌ అది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 సంవత్సరం నాటికి సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్‌‌‌‌ ఎక్కువగా పేరుకుపోతుందని ఆ పోస్టులో ఉంది. అది చూశాక ప్లాస్టిక్‌‌‌‌ను బయటకు తీయాలని డిసైడ్‌‌‌‌ అయ్యాడు ప్రియేష్‌‌‌‌.  ఓవైపు చేపల వేట కొనసాగిస్తూనే.. సముద్రపు అడుగున పేరుకుపోయిన చెత్తను సేకరించడం ప్రారంభించాడు. సేకరించిన ప్లాస్టిక్‌‌‌‌ వ్యర్థాల్ని తీరానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న మినీ డంప్‌‌‌‌ యార్డ్‌‌‌‌కి స్వయంగా అతనే చేరవేశాడు. అయితే స్థానికులు మాత్రం అతని ప్రయత్నాన్ని  చూసి అతన్నొక పిచ్చోడుగా అనుకున్నారట. అయినా తన ప్రయత్నాన్ని ఆపలేదు ప్రియేష్‌‌‌‌.

13వేల టన్నుల ప్లాస్టిక్‌‌‌‌!
ఒంటరిగా చేస్తే తన ప్రయత్నం తొందరగా ఫలించదని అర్థం అయ్యింది అతనికి. సొంత గ్రామస్తులు ముందుకు రాకపోవడంతో పక్కనే ఉన్న  అయ్యూర్‌‌‌‌ గ్రామ ప్రజల్ని సాయం కోరాడు.  ప్రియేష్ ప్రయత్నాన్ని అభినందించిన ఆ ఊరి ప్రజలు.. అతనికి తోడు కలిశారు. వాళ్లలో కొందరు టీంగా మారి తీర ప్రాంతంలోని చెత్తను సేకరించడం ప్రారంభించారు. ప్రియేష్‌‌‌‌ మాత్రం సముద్రం అడుగున ఉన్న ప్లాస్టిక్‌‌‌‌ను తీస్తున్నాడు. వలలో యాభై కేజీల చేపలు పడితే.. అందులో 13 కేజీల ప్లాస్టిక్‌‌‌‌ చెత్తనే ఉంటుందట. అందుకే జాలర్లు కూడా ప్రియేష్‌‌‌‌కి సపోర్ట్‌‌‌‌గా నిలుస్తున్నారు. ఇప్పటిదాకా అంతా కలిసి పదమూడు వేల టన్నుల ప్లాస్టిక్‌‌‌‌ వ్యర్థాల్ని తొలగించారు.  ప్రభుత్వాలు, పర్యావరణవేత్తలు చెయ్యలేని పనిని.. ముప్ఫై ఏళ్ల ఒక యువకుడు ఒంటరిగా మొదలుపెట్టి.. ఇప్పుడొక పెద్ద ఉద్యమంలా మార్చాడు. ప్రియేష్‌‌‌‌ ప్రయత్నాన్ని అర్థం చేసుకున్న సొంత ఊరి ప్రజలంతా ఇప్పుడతని ‘పర్యావరణ పిచ్చోడి’గా పిలుస్తున్నారు.  

Latest Updates