పులిని వండుకుతిన్న వేటగాళ్లు..

మానవుడు తినడానికి ఏదీ అనర్హం కాదన్నట్లుగా మారింది ప్రస్తుత ప్రపంచం. మాంసాహారానికి రుచిమరిగిన మానవుడు దేన్నీ వదలడం లేదు. చివరికి మనుషుల్ని చంపుకుతినే పులిని కూడా వదల్లేదు. కేరళకు చెందిన అయిదుగురు వ్యక్తులు పులిని చంపి.. వండుకుతిన్నారు. ఈ ఘటన ఇడుక్కిలోని మంకుళం అటవీ ప్రాంతంలో జరిగింది. పులిని వండుకుతిన్న ఘటన కేరళలో మొదటిదిగా నిలిచింది.

మంకుళం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పిజె సుహైబ్ ప్రకారం.. ‘ఇడుక్కికి చెందిన వినోద్‌కు అడవి పందులను వేటాడి తినే అలవాటుంది. అదే అలవాటుతో వినోద్.. తన స్నేహితులైన కురియాకోస్, బిను, కుంజప్పన్, విన్సెంట్‌లతో కలిసి మంకుళం అడవి సమీపంలోని మునిపారా వద్ద ఒక ఉచ్చును ఏర్పాటు చేశాడు. మరుసటి రోజు ఉదయం వెళ్లి చూడగా.. ఆ ఉచ్చులో ఒక చిరుతపులి పడింది. దాంతో వారు ఆ చిరుతను వినోద్ ఇంటికి తీసుకొచ్చి చంపేశారు. ఆ తర్వాత పులి చర్మం, పళ్ళు, గోర్లు వలిచి దాచిపెట్టారు. మాంసాన్ని ఏంచక్కా వండుకొని.. మద్యం తాగుతూ తిన్నారు.

అయితే వినోద్ ఉచ్చులో పులి పడిందన్న విషయం ఆ నోటా ఈ నోటా.. ఫారెస్ట్ అధికారుల చెవిలో పడింది. దాంతో మంకుళం రేంజ్ ఆఫీసర్ ఉదయ సూర్యన్ తన బృందంతో కలిసి వినోద్ ఇంటిపై రైడ్ చేశారు. రైడ్‌లో భాగంగా వినోద్ ఇంటి నుంచి పులి చర్మాన్ని, 10 కిలోల పులి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు’ అని ఆయన తెలిపారు.

చిరుతపులి వేటకు వినోద్ నాయకత్వం వహించగా.. మిగతావారు సహకరించారని పోలీసులు తెలిపారు. అయితే వీరు జంతువుల వ్యాపారం చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిరుతపులిని చంపిన ఈ అయిదుగురిపై ఇండియన్ వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని.. నేరం రుజువైతే నిందితులకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడొచ్చని అధికారులు తెలిపారు.

For More News..

బుద్దిమారని పాక్.. బార్డర్‌లో బయటపడ్డ భారీ సొరంగం

హైదరాబాద్​లో 90కి దగ్గర్లో పెట్రోల్ రేటు

పొలంలో రైతు సత్యాగ్రహ దీక్ష

ఆ ఆరుగురు ప్లేయర్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్​

Latest Updates