పండుగలకు ఆంక్షల సడలింపు.. కేరళ కొంప ముంచింది: కేంద్రమంత్రి హర్షవర్ధన్

  • ఫెస్టివల్ సీజన్‌లో అలర్ట్‌గా ఉండాలి
  • రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరిక

ఫెస్టివల్ సీజన్‌లో రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, లేదంటే కరోనా మహమ్మారి విజృంభించే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ హెచ్చరించారు. ఓనం పండుగ సమయంలో కేరళ ప్రభుత్వం భారీగా ఆంక్షలు సడలించిందని, దానికి ఇప్పుడు ఆ రాష్ట్రం మూల్యం చెల్లించుకుంటోందని అన్నారు. భారీగా ప్రయాణాలు చేసేందుకు ప్రజలకు వీలు కల్పించడం, ఓనం సందర్భంగా జనాలు గుంపులుగా చేరి సెలబ్రేట్ చేసుకోవడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి అదుపుతప్పిందని చెప్పారాయన. కేరళ ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యం వల్ల అక్టోబర్ 1 నుంచి 17 మధ్య ఏకంగా లక్షా 35 వేల కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు.

ఆదివారం కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ‘సండే సంవాద్’ పేరుతో సోషల్ మీడియా లైవ్‌లో మాట్లాడారు. ఓనం పండుగ ఘనంగా చేసుకోవాలన్న ఆలోచనతో కరోనా నిబంధనలను లైట్ తీసుకోవడం వల్ల కేరళలో రోజువారీగా కరోనా కేసుల నమోదు గతంలో కన్నా డబుల్ అయిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం భారీగా ప్రయాణాలు జరగడం, రాష్ట్రంలో పండుగ వేడుకల కోసం షాపింగ్స్, బంధువుల రాకతో అంతా గ్రూప్‌గా చేరి సెలబ్రేషన్స్ చేసుకోవడం, టూరిజం కూడా ఓపెన్ చేయడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువైందన్నారు.

పండుగల కోసం ప్రాణాలు రిస్క్‌లో పెట్టొద్దు

కేరళ ఎదుర్కొంటున్న పరిస్థితులు మిగతా రాష్ట్రాలకు మంచి పాఠంలా తీసుకోవాలన్నారు కేంద్ర మంత్రి హర్షవర్ధన్. పండుగ సీజన్‌లో కరోనా నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుపుకొనే దసరా, దీపావళి పండుగల సీజన్ సందర్భంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హర్షవర్ధన్ సూచించారు. ఈ పండుగలను గ్రాండ్‌గా చేసుకోవాలన్న ఆలోచన వద్దని, వీలైనంత చారిటీ చేయాలని కోరారు. ఈ ఏడాది కరోనా సృష్టించిన విలయం తన హృదయాన్ని ఎంతగానో కలచివేస్తోందని, తాను కూడా పండుగ సెలబ్రేషన్ పరిమితంగా చేసుకుంటున్నానని చెప్పారు. పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం కోసం ప్రాణాలను రిస్క్‌లో పెట్టాలని ఏ ఒక్క ఆధ్యాత్మిక గురువూ చెప్పరని, భారీగా మండపాలు వేసి వైభవంగా పూజలు చేయాలని ఏ దేవుడూ కోరడని హర్షవర్ధన్ అన్నారు.

Latest Updates