స్టార్టప్‌‌లలో నంబర్‌‌ 1 కేరళ

కొచ్చి: స్టార్టప్‌‌ కంపెనీల ఏర్పాటుకు కేరళ రాష్ట్రం అనువైన రాష్ట్రమని, అందుకే ఇది టాప్‌‌ స్టార్టప్‌‌ స్టేట్‌‌గా ఎదిగిందని తాజా స్టడీ ఒకటి తేల్చింది. డిజిటల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌ ‘ఇంక్‌‌ 42’ టై కేరళ సంస్థతో కలిసి చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. 2012 నుంచి ఈ రాష్ట్రం స్టార్టప్‌‌ల స్థాపనలో ఏటా 17 శాతం వృద్ధి (సీఏజీఆర్‌‌) సాధిస్తోంది. ప్రస్తుతం కేరళలో 2,200 స్టార్టప్‌‌లు ఉన్నాయి. ఇవి నిధులను రాబట్టడంలో సత్తా చాటుతున్నాయి. గత ఏడాది కూడా స్టార్టప్‌‌ల సంఖ్య 35 శాతం పెరిగింది. టైకాన్‌‌ కేరళ 2019 పేరుతో కొచ్చిలో శనివారం నిర్వహించిన సదస్సులో ‘కేరళ స్టార్టప్‌‌ ఇకో సిస్టమ్‌‌ 2019’ పేరుతో విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయాలను ఇంక్‌‌ 42 వెల్లడించింది. కేరళ స్టార్టప్‌‌ మిషన్‌‌ (కేసమ్‌‌)సీఈఓ షాజీ గోపీనాథ్‌‌ ఈ రిపోర్టును విడుదల చేశారు.

కేరళ స్టార్టప్‌‌లు ఇప్పటి వరకు 89 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.630 కోట్లు) నిధులను సేకరించగలిగాయి. గత ఏడాది నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు నిధుల సేకరణ 18 శాతం పెరిగింది. ప్రస్తుత సంవత్సరంలో ఇవి 44 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్​మెంట్లుగా స్వీకరించాయి. ఇందుకోసం 13 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 44 స్టార్టప్‌‌లు విదేశాల నుంచి నిధులను రాబట్టగలిగాయి. స్టార్టప్‌‌లను ప్రోత్సహించడానికి కేరళ ప్రభుత్వం స్టార్టప్‌‌ పాలసీని అమలు చేస్తోంది. దీనికింద కేసమ్‌‌ను ఏర్పాటు చేసి స్టార్టప్‌‌ల కోసం పలు పథకాలను అమలుపరుస్తున్నది. వీటికి నిధులను అందించడానికి రూ.వెయ్యి కోట్లతో ఆల్టర్నేటివ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఫండ్స్‌‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటిసాయంతో కొన్ని స్టార్టప్‌‌లు ఎంతో ప్రగతి సాధించాయని కేసమ్‌‌ సీనియర్‌‌ ఆఫీసర్‌‌ ఒకరు చెప్పారు. ఎర్నాకుళం, తిరువనంతపురంలో వీటి స్థాపన ఎక్కువగా ఉందని, మొత్తం కంపెనీల్లో 59 శాతం ఈ రెండు నగరాల్లోనే ఉన్నాయని ఆయన  వివరించారు.

ప్రతి రెండు గంటలకు ఒక స్టార్టప్ రిజిస్టర్…

స్టార్టప్ ఎకోసిస్టమ్‌‌ను అభివృద్ధి చేయడం కోసం కేరళ అవలంబిస్తున్న మోడల్‌‌ను ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవ్వాలని డిపార్ట్‌‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) గతంలో సూచించింది. దేశంలో ప్రతి రెండు గంటలకు ఒక స్టార్టప్ రిజిస్టర్ అవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకున్న రికార్డుల ప్రకారం దేశంలో 22,895 స్టార్టప్‌‌లు ఏర్పాటయ్యాయి. సుమారు 45 శాతం స్టార్టప్‌‌లు టైర్ 2, టైర్ 3 నగరాల్లోనే ఉన్నాయి. 9 శాతం నుంచి 10 శాతం స్టార్టప్‌‌లను మహిళలు నడుపుతున్నారు.