కేజీఎఫ్‌ చాప్టర్‌‌–2 అప్‌డేట్‌.. అధీరాగా ఆకట్టుకుంటున్న సంజయ్ దత్

బెంగళూరు: బాలీవుడ్ ఖల్ నాయక్‌ సంజయ్ దత్ ఇవ్వాళ 61వ పడిలోకి ప్రవేశించాడు. తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన ఈ సీనియర్ హీరో ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. ఇండియా వైడ్ రిలీజ్ అయి పాపులర్ హిట్‌ అయిన కేజీఎఫ్ సినిమా సీక్వెల్‌ చాప్టర్‌‌–2లో కీలక రోల్‌లో సంజూ బాబా నటిస్తున్నాడు. ప్యాన్‌ ఇండియా మూవీతో బాలీవుడ్‌తోపాటు సౌత్‌లోనూ తన సత్తా మరోమారు చూపించాలని సంజూ భావిస్తున్నాడు.

సంజూకు కేజీఎఫ్​ డైరెక్టర్‌‌ ప్రశాంత్ నీల్ ఓ గిఫ్ట్‌ ఇచ్చాడు. సంజూ పోషిస్తున్న అధీరా పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘క్రూరమైన వికింగ్స్‌ స్ఫూర్తితో అధీరా పాత్రను రూపొందించాం. సంజూ బాబాకు జన్మదిన శుభాశీస్సులు. కేజీఎఫ్ చాప్టర్2లో భాగమైనందుకు ఆయనకు మప్పిదాలు. త్వరలో క్రేజీ షెడ్యూల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం’ అని నీల్ ట్వీట్ చేశారు.

కేజీఎఫ్–​2లో తన పాత్ర గురించి సంజయ్ దత్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ‘అధీరా పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. మీరు అవెంజర్స్ సినిమా గనుక చూసుంటే.. మీకు థానోస్ గురించి తెలుస్తుంది. అధీరా కూడా థానోస్‌లాగే ఉంటాడు. డెంజరస్ గెటప్‌తో ఉండే ప్రమాదకర క్యారెక్టర్‌‌ అది. నేను కూడా అలాంటి పాత్రలు, జోన్‌ కోసమే ఎదురు చూస్తున్నా’ అని సంజూ బాబా పేర్కొన్నాడు. బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ రవీనా టండన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న కేజీఎఫ్‌–2 షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. మరో 10 నుంచి 20 రోజుల షూటింగ్ మిగిలి ఉందని సమాచారం.

Latest Updates