10 వేల ఒంటెలను చంపేస్తరట

ఐదు రోజుల్లో కాల్చి చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం

ఇప్పటికే ఆస్ట్రేలియాలో బుష్​ఫైర్స్​ ధాటికి కొవాలలు, కంగారూ వంటి జంతువులు అల్లాడిపోతున్నాయి. కోట్లాది వన్యప్రాణులు మంటలకు బుగ్గయ్యాయి. దానికితోడు ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఐదు రోజుల్లో పది వేల ఒంటెలను చంపాలని నిర్ణయించింది. దానికి ఆ దేశ ప్రభుత్వం చెబుతున్న కారణం ‘నీళ్లు’. అవును, కరువు కోరల్లో చిక్కుకుని నీటి కోసం అల్లాడిపోతున్న దేశంలో, ఒంటెలు నీటి కోసం జనావాసాల్లోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్నాయట. స్థానికులకు తలనొప్పిగా మారాయట. అందుకే బుధవారం నుంచి ఒంటెలను పట్టుకొచ్చి చంపేయాలని అధికారులు ఆర్డర్స్​ కూడా వేశారు. ‘‘నీటి కోసం వెతుక్కుంటూ వస్తున్న ఒంటెలు, ఇతర జంతువులు దక్షిణ ఆస్ట్రేలియా ప్రాంతంలోని జనాలను కష్టపెడుతున్నాయి. అందుకే వాటిని చంపేయాలని నిర్ణయించాం’’ అని అనంగు పిజాంజజర యాంకున్యిజజర (ఏపీవై) అనే స్థానిక ప్రభుత్వం ఓ నోట్​ను విడుదల చేసింది.

జనాలకే కాకుండా ఆస్తులను ఒంటెలు ధ్వంసం చేస్తున్నాయని, వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వాటిని చంపేందుకు ప్రొఫెషనల్​ షూటర్స్​నూ ఏర్పాటు చేసుకుంది ప్రభుత్వం. దేశంలోని కరువు పరిస్థితుల వల్ల జంతు సంరక్షణలో సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఫుడ్డు, నీళ్లు దొరక్క కొన్ని ఒంటెలు చచ్చిపోయాయని, మరికొన్ని ఒంటెలు వాటిలో అవే పోట్లాడుకుంటున్నాయని అంటున్నారు. అంతేగాకుండా జనాలకు నీళ్లిచ్చే నీటి వనరులను ఒంటెలు కలుషితం చేస్తున్నాయన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా అంతటా పది లక్షల ఒంటెలున్నట్టు అంచనా. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. రక్షించాల్సిందిపోయి ఉన్న వాటిని చంపడమేంటని ప్రశ్నిస్తున్నారు.

Latest Updates