కూతురు భారమని చంపేసిండు

ఎక్కిళ్లతో చనిపోయిందంటూ అంత్యక్రియలు పూర్తి
గ్రామస్తుల అనుమానంతో విషయం వెలుగులోకి..

సదాశివపేట, వెలుగు: ఆడపిల్లగా పుట్టడమే ఆమెకు శాపంగా మారింది. పోషించే శక్తి లేక తండ్రే కన్నకూతురు గొంతు నులిపి చంపేసి సాధారణ  మరణంగా చిత్రీకరించాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూర్​గ్రామంలో జరిగింది. సీఐ శ్రీధర్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… వికారాబాద్​ జిల్లా జాంబాపూర్​తండాకు చెందిన  కత్రావత్​ రవినాయక్, భార్య లక్ష్మీబాయి సదాశివపేట మండలంలోని ఆత్మకూర్​ గ్రామానికి రెండు నెలల క్రితం పని నిమిత్తం వచ్చారు. వీరి కూతురు రేణుక(13) వికారాబాద్​జిల్లాలోని నవాబ్​పేట కేజీవీబీ స్కూల్​లో 8వ తరగతి చదువుతోంది. ఈ నెల 12న రేణుకకు జ్వరం రావడంతో ఆత్మకూర్​ గ్రామానికి తీసుకొచ్చారు.  రాత్రి 7 గంటల సమయంలో ఫీవర్​ ఎక్కువ కావడంతో చుట్టుపక్కలవారి సలహా మేరకు తండ్రి రవినాయక్​ సదాశివపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లాడు.

ఫీవర్​ఎక్కువగా ఉందని, సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు.  కూతురుకు ఇప్పటికే  రూ. 20 వేలు ఖర్చయిందని, ఆమె వివాహానికి ఇంకా ఎంత ఖర్చవుతుందోనని ఆందోళనకు గురయ్యాడు. ఇంటికి తీసుకొస్తుండగా ఎన్కేపల్లి శివారులో ఎవరూ లేనిచోట రేణుక గొంతు నులిమి చంపేశాడు. దారిలో ఎక్కిళ్లు వచ్చి చనిపోయిందని ఇంట్లోవారిని నమ్మించాడు. 13న మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి  దహన సంస్కారాలు చేశారు. రేణుక మృతిపట్ల గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేయడంతో వికారాబాద్​ వీఆర్వో   ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో తండ్రే గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. నిందితుడిని శనివారం రిమాండ్​కు తరలించారు.

మరిన్ని వార్తల కోసం

Latest Updates