ఢిల్లీపై పంజాబ్ ఘన విజయం

శిఖర్ ధవన్ దంచి కొట్టినా ఢిల్లీకి తప్పని ఓటమి

ఐపీఎల్ లో వరుసగా రెండో సెంచరీతో దుమ్మురేపిన ధవన్

ఐపీఎల్‌‌–13లో కింగ్స్‌‌ ఎలెవన్‌‌ పంజాబ్‌‌ విజయాలబాట పట్టింది..! తమకంటే మెరుగైన ప్రత్యర్థి ఎదురైనా.. ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొట్టింది..! టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో నికోలస్‌‌ పూరన్‌‌ (28 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 53) మెరుపు ఇన్నింగ్స్‌‌ ఆడటంతో.. ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు చెక్‌‌ పెట్టింది..! మరోవైపు శిఖర్‌‌ ధవన్‌‌ (61 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 నాటౌట్‌‌) వరుసగా రెండో సెంచరీతో దంచికొట్టినా.. మిగతా బ్యాట్స్​మెన్​, బౌలర్లు అంచనాలను అందుకోలేకపోవడంతో క్యాపిటల్స్‌‌కు మూడో ఓటమి తప్పలేదు..!!

దుబాయ్‌‌: లీగ్‌‌ ఆరంభంలో వరుస పరాజయాలతో ఇబ్బందిపడ్డ పంజాబ్‌‌.. ఇప్పుడు హ్యాట్రిక్‌‌ విజయాలతో దూసుకుపోతున్నది. పక్కా ప్లాన్స్‌‌తో అటు బ్యాటింగ్‌‌, ఇటు బౌలింగ్‌‌లో దుమ్మురేపుతున్నది. దీంతో మంగళవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో కింగ్స్‌‌ ఎలెవన్‌‌ 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచి.. నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5  వికెట్లకు 165 రన్స్‌‌ చేసింది. తర్వాత పంజాబ్‌‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 రన్స్‌‌ చేసింది. పూరన్‌‌తో పాటు మ్యాక్స్‌‌వెల్‌‌ (24 బాల్స్‌‌లో 3 సిక్సర్లతో 32) రాణించాడు. ధవన్​కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

ధవన్‌‌ మళ్లీ..

ఫ్లాట్‌‌ వికెట్‌‌పై బ్యాటింగ్‌‌కు వచ్చిన ఢిల్లీ ఓపెనర్లలో ధవన్‌‌ మరోసారి చెలరేగిపోయాడు. గత మ్యాచ్‌‌ ఫామ్‌‌ను కొనసాగిస్తూ పంజాబ్‌‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మ్యాక్స్‌‌వెల్‌‌ (1/31) వేసిన ఫస్ట్‌‌ ఓవర్‌‌లో 4, 6తో మొదలైన విజృంభణ చివరి వరకు కొనసాగిస్తూ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రెండో ఎండ్‌‌లో పృథ్వీ షా (7) మూడో ఓవర్‌‌లోనే వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ 25 రన్స్‌‌ వద్ద ఫస్ట్‌‌ వికెట్‌‌ కోల్పోయింది. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన అయ్యర్‌‌ (14) సిక్సర్‌‌తో ఖాతా తెరవగా, ఐదో ఓవర్‌‌లో ధవన్‌‌ మూడు ఫోర్లతో రెచ్చిపోయాడు. ఓవరాల్‌‌గా పవర్‌‌ప్లేలో 53/1 స్కోరుతో ఢిల్లీ పటిష్ట స్థితిలో నిలిచింది. స్పిన్నర్‌‌  మురుగన్‌‌ అశ్విన్‌‌ (1/33) రాకతో ఇబ్బందులు ఎదుర్కొన్న అయ్యర్‌‌.. 9వ ఓవర్‌‌లో రాహుల్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్‌‌కు 48 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఈ క్రమంలో ధవన్‌‌ 28 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేశాడు.  రిషబ్‌‌ పంత్‌‌ (14) నిరాశ పరిచినా పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు 83/2కు చేరింది. తర్వాతి రెండు ఓవర్లలో 11 రన్స్‌‌ మాత్రమే రాగా, 14వ ఓవర్‌‌లో రిషబ్‌‌ ఔట్‌‌కావడంతో మూడో వికెట్‌‌కు 33 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన స్టోయినిస్‌‌ (9) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా.. షాట్స్‌‌ సరిగా కనెక్ట్‌‌ కాలేదు. ధవన్‌‌ మాత్రం ఓవర్‌‌కు ఓ ఫోర్‌‌ చొప్పున బాదుతూ స్కోరుబోర్డును పరుగుపెట్టించాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 117/3కి చేరింది.  తర్వాతి ఓవర్‌‌లో 9 రన్స్‌‌ రాగా.. 17వ ఓవర్‌‌లో ధవన్‌‌ భారీ సిక్సర్‌‌తో సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. స్లాగ్‌‌ ఓవర్స్‌‌లో షమీ (2/28) స్కోరుకు కళ్లెం వేశాడు. 18వ ఓవర్‌‌లో స్టోయినిస్‌‌ ఔటైనా.. తర్వాతి  ఓవర్‌‌లో అర్షదీప్‌‌ బాల్‌‌ను పాయింట్‌‌లోకి కొట్టి వరుసగా రెండో సెంచరీ (57 బాల్స్‌‌)ని అందుకున్నాడు. హెట్‌‌మయర్‌‌ (10) భారీ సిక్సర్‌‌ సంధించి ఔటయ్యాడు.

పూరన్‌‌ ధనాధన్‌‌..

టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో పంజాబ్‌‌కు సరైన ఆరంభం దక్కలేదు. సిక్స్‌‌తో ఖాతా మొదలుపెట్టిన రాహుల్‌‌ (15).. మూడో ఓవర్‌‌లోనే ఔటయ్యాడు. అయితే గేల్‌‌ (29) వచ్చి రావడంతో చెలరేగాడు. తుషార్‌‌ వేసిన ఐదో ఓవర్‌‌లో వరుసగా 4, 4, 6, 4, 6తో 26 రన్స్‌‌ కొట్టడంతో పంజాబ్‌‌ స్కోరు 50కి చేరింది. కానీ ఆరో ఓవర్‌‌లో అశ్విన్‌‌.. డబుల్‌‌ ఝలక్‌‌ ఇచ్చాడు. సెకండ్‌‌ బాల్‌‌కు గేల్‌‌ను క్లీన్‌‌బౌల్డ్‌‌ చేయగా, ఐదో బాల్‌‌కు మయాంక్‌‌ (5) అనూహ్యంగా రనౌటయ్యాడు.  ఫలితంగా పంజాబ్‌‌ స్కోరు 56/3గా మారింది. పూరన్‌‌ తో కలిసి మ్యాక్స్‌‌వెల్‌‌ ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. 7, 8 ఓవర్లలో 15 రన్స్‌‌ రాగా, 9వ ఓవర్‌‌లో పూరన్‌‌ వరుసగా 6, 4, 4 తో 15 రన్స్‌‌ రాబట్టాడు. స్టోయినిస్‌‌ వేసిన 10వ ఓవర్‌‌లోనూ పూరన్‌‌ 4, 6 కొట్టడంతో స్కోరు 100 దాటింది. 11వ ఓవర్‌‌లో భారీ సిక్సర్‌‌తో 11 రన్స్‌‌ సాధించిన పూరన్‌‌.. టార్గెట్‌‌ (53)ను బాల్స్‌‌ (54) కంటే తక్కువగా తీసుకొచ్చాడు. రబాడ (13వ ఓవర్‌‌) బౌలింగ్‌‌లో ఫోర్‌‌తో 27 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసిన పూరన్‌‌.. తర్వాతి బాల్‌‌కు వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. దీంతో నాలుగో వికెట్‌‌కు 69 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. మ్యాక్స్‌‌తో కలిసిన దీపక్‌‌ హుడా (15 నాటౌట్‌‌) నిలకడగా ఆడాడు. ఈ ఇద్దరు వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడంతో పాటు అప్పుడప్పుడు బౌండరీలు బాదడంతో 15 ఓవర్లలో పంజాబ్‌‌ 141/4 స్కోరు చేసింది. ఇక గెలుపునకు 30 బాల్స్‌‌లో 24 రన్స్‌‌ కావాల్సిన దశలో మ్యాక్స్‌‌ ఓ ఫోర్‌‌ కొట్టి ఔటయ్యాడు. హుడాకు తోడైనా నీషమ్‌‌ (10 నాటౌట్‌‌) సిక్స్‌‌తో విన్నింగ్ షాట్‌‌ కొట్టాడు.

Latest Updates