ఢిల్లీ కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ రేసులో కీర్తి ఆజాద్‌‌ ముందంజ

ఢిల్లీ యూనిట్‌‌ చీఫ్‌‌ పేరును కాంగ్రెస్‌‌ శుక్రవారం ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.  ఈ ఏడాది జులై 20న షీలా దీక్షిత్‌‌ చనిపోవడంతో ఢిల్లీ కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ పదవి ఖాళీగా ఉంది.   ప్రోబబుల్స్‌‌ జాబితాలో కీర్తి ఆజాద్‌‌ ముందువరసలో ఉన్నారు.  షీలా దీక్షిత్‌‌ కొడుకు సందీప్‌‌ దీక్షిత్‌‌,  మరో సీనియర్‌‌ నాయకుడు జేపీ అగర్వాల్‌‌ పేర్లు  కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  ఇప్పటికే  కొత్త చీఫ్‌‌ ఎన్నిక కోసం కాంగ్రెస్‌‌ హైకమాండ్‌‌ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఢిల్లీ కాంగ్రెస్‌‌ లీడర్ల బృందంతోపాటు పార్టీ ఇన్‌‌చార్జ్‌‌ పీసీ ఛాకోతో కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ సోనియాగాంధీ   ఇప్పటికే చర్చలు జరిపారు. ఢిల్లీ పార్టీ యూనిట్ లో  గ్రూపు తగాదాలు తీవ్రం కావడంతో  స్టేట్‌‌ ప్రెసిడెంట్‌‌ పేరును ప్రకటించడంలో బాగా ఆలస్యమైందని వార్తలొచ్చాయి.  ఫ్యాక్షన్‌‌ రాజకీయాలే కీర్తి ఆజాద్‌‌కు కలిసొస్తాయని అంటున్నారు.

ఎంతో రాజకీయ అనుభవం

కీర్తి ఆజాద్‌‌ పూర్వాంచల్‌‌తో ఉన్న సంబంధాలు ఆయనకు ప్లస్‌‌ పాయింట్‌‌ అంటున్నారు. బీహార్‌‌లోని  దర్భాంగ నుంచి ఆయన మూడుసార్లు బీజేపీ టికెట్‌‌పై లోక్‌‌సభకు ఎన్నికయ్యారు. ఆయన తండ్రి భగవత్‌‌ ఝా ఆజాద్‌‌ కాంగ్రెస్‌‌ తరపున బీహార్‌‌ ముఖ్యమంత్రిగా  పనిచేశారు. లోక్‌‌సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది  ఫిబ్రవరిలో కీర్తి ఆజాద్‌‌ కాంగ్రెస్‌‌లో చేరారు.  మాజీ కేంద్రమంత్రి అరుణ్‌‌జైట్లీపై 2015లో బహిరంగంగా అవినీతి ఆరోపణలు చేయడంతో బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌‌ చేసింది.

బీహార్‌‌కు చెందిన మనోజ్‌‌ తివారీని ఢిల్లీ బీజేపీ చీఫ్‌‌గా నియమించడం కూడా కీర్తి ఆజాద్‌‌కు కలిసొస్తుందంటున్నారు. మనోజ్‌‌ తివారీ రెండు సార్లు నార్త్‌‌ఈస్ట్‌‌ ఢిల్లీ ఎంపీగా ఉన్నారు. 2019 లోక్‌‌సభ ఎన్నికల్లో ఆయన షీలా దీక్షిత్‌‌ను  ఓడించారు. కీర్తి ఆజాద్‌‌కు కూడా షీలా దీక్షిత్‌‌తో  రాజకీయపరమైన సంబంధాలున్నాయి. 1993లో ఢిల్లీ గోలే మార్కెట్‌‌  ఎమ్మెల్యేగా కీర్తి ఆజాద్‌‌ గెలిచారు. అయితే1998లో  షీలా దీక్షిత్ ఆయనను ఓడించారు. 2003లో  కీర్తి ఆజాద్‌‌ భార్య పూనమ్‌‌ ఆజాద్‌‌ను గోలే మార్కెట్‌‌  నుంచే షీలా దీక్షిత్‌‌ ఓడించారు.

సందీప్‌‌కు షీలా మద్దతుదార్ల సపోర్ట్‌‌

సందీప్‌‌ దీక్షిత్‌‌ విషయానికి వస్తే ఆయనకు షీలా దీక్షిత్‌‌ మద్దతుదార్ల సపోర్ట్‌‌ ఉంది.  జేపీ అగర్వాల్‌‌ కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ సోనియా గాంధీకి  దగ్గర అని చెబుతారు. పార్టీ సీనియర్‌‌ నాయకులు  కూడా ఆయన పట్ల సానుకూలంగానే ఉంటారు.  వీళ్లు ముగ్గురూ కాకుండా ,  కొత్త చీఫ్‌‌ బాధ్యతల్ని  యూత్‌‌కి ఇవ్వాలని హైకమాండ్‌‌ అనుకుంటే మాత్రం.. హరూన్‌‌ యూసుఫ్‌‌, దేవేంద్ర యాదవ్‌‌, రాజేశ్‌‌ లిలోథియాలో ఒకరికి చాన్స్‌‌  ఉండే అవకాశముంటుందని  వార్తలు
వినిపిస్తున్నాయి.

ఆజాద్‌‌ ప్లస్‌‌ పాయింట్స్‌‌

  •                 కాంగ్రెస్‌‌లో కుమ్ములాటలు
  •                 పూర్వాంచల్‌‌తో సంబంధాలు
  •                 ఢిల్లీ గోలే మార్కెట్‌‌ ఎమ్మెల్యేగా పనిచేసే అనుభవం
  •                 ఢిల్లీ బీజేపీ చీఫ్‌‌ మనోజ్‌‌ తివారీ కూడా బీహారీ కావడం

Latest Updates