కాంగ్రెస్ లోకి బీజేపీ ఎంపీ కీర్తిఆజాద్

ఢిల్లీ : సస్పెండెడ్ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ఆఫీస్ లో ఎంపీ కీర్తి ఆజాద్ కు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం కృషి చేస్తా అన్నారు.

క్రికెట్ లో సూపర్ అల్ రౌండర్

కీర్తివర్ధన్ భగవత్ ఝా ఆజాద్ బిహార్ కు చెందిన పొలిటీషియన్. క్రికెటర్ గా మెరిసి గుర్తింపు తెచ్చుకున్నారు. 1983లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీర్తి ఆజాద్ సభ్యుడు. ప్రఖ్యాత ఆల్ రౌండర్ గా.. 1980 నుంచి 86 మధ్య 7 టెస్టులు, 25 వన్డేలు ఆడారు. ఢిల్లీ జట్టు తరఫున రంజీల్లో తిరుగులేని రికార్డ్ ఆయనకుంది.

సీఎం అయిన తండ్రి స్ఫూర్తిగా రాజకీయాల్లోకి

బిహార్ సీఎంగా పనిచేసిన తన తండ్రి భగవత్ ఝా ఆజాద్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ టికెట్ పై బిహార్ లోని దర్భంగ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన మూడోసారి ఆ స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీలో గోల్ మార్కెట్ ఎమ్మెల్యేగా కూడా గతంలో గెలిచారు. 2014లో దర్భంగ సెగ్మెంట్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు. 2015 డిసెంబర్ 23న కీర్తి ఆజాద్ బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ లలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని బహిరంగ విమర్శలు చేసి సంచలనం రేపారు. ఈ వివాదంతోనే ఆయన బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. కొద్దిరోజుల సైలెన్స్ తర్వాత… పార్లమెంట్ ఎన్నికలకు దగ్గరకొస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో చేరారు కీర్తి ఆజాద్.

Latest Updates