ప్రైవేట్ ఆస్పత్రులు తెరవరేంది.?జబ్బు వస్తే ఎక్కడికెళ్లాలి?

హైదరాబాద్, వెలుగు:‘‘ఎవరికైనా ఏదైనా జబ్బు వస్తే ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితిని చూస్తున్నాం. కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమల్లో ఉండటంతో హాస్పిటల్స్ లో ఓపీ కేసులను చూడడం లేదు” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలను ఆరోగ్య పరంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే ఆరోగ్యసేతు యాప్ ను తీసుకువచ్చామని తెలిపారు. యాప్​లో ఆరోగ్య వివరాలు పొందుపరిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుస్తుందన్నారు. అందరూ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, చుట్టూ ఉన్న వారిలో ఎవరికైనా కరోనా ఉంటే అలర్ట్ చేస్తుందని చెప్పారు. మనకు బాడీగార్డ్ లా పని చేస్తుందన్నారు. ఎమర్జెన్సీ కేసులు తగ్గిపోయాయని, ఇది విచిత్రమైన పరిస్థితి అని కామెంట్ చేశారు. శనివారం ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని బీజేపీ సిటీ ఆఫీస్ లో పార్టీ డాక్టర్స్ సెల్ ఏర్పాటు చేసిన మెడికల్ పోర్టల్ ను ఆన్ లైన్​లో ప్రారంభించి మాట్లాడారు.

సికింద్రాబాద్ లో మెడికల్ పోర్టల్

కరోనాను దృష్టిలో ఉంచుకొని వృద్ధులు, దివ్యాంగులు, మహిళల కోసం మెడికల్ పోర్టల్ ను ప్రారంభించినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు సేవలందించనున్నట్లు చెప్పారు. ఎంత ఒత్తిడిలో ఉన్నా డాక్టర్లు ప్రజా సేవకు ముందుకు వస్తున్నారని, వారి సర్వీసులను ప్రజలు వినియోగించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే సంబంధిత డాక్టర్ కు ఫోన్ చేసి మెడికల్ సాయం తీసుకోవచ్చన్నారు. అన్ని డిపార్ట్ మెంట్లకు సంబంధించిన డాక్టర్లు ఇందులో ఉన్నారని చెప్పారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటికే మెడిసిన్ తీసుకువస్తారన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న వారు హెల్ప్ లైన్ నెంబర్ 9959261273 కి ఫోన్ చేయాలని లేదా తన పేరుతో ఉన్న వెబ్​సైట్, ఫేస్ బుక్ , ట్విట్టర్ అకౌంట్లలో పెట్టిన లిస్ట్ చూసి సంప్రదించాలని కోరారు. మొత్తం 180 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారని అన్నారు.

సహకరిస్తలేరు

పేదలు, వృద్ధులు, మహిళలు ఏదైనా అడిగితే విసుక్కోకుండా సాయం చేయాలని కిషన్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలు, సేవ చేసేందుకు వచ్చిన వారు సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని సూచించారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు లాక్ డౌన్ కు పూర్తిగా సహకరించడం లేదని, దీంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కొనేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నాయన్నారు.

Latest Updates