పెద్దపల్లిలో కాకా విగ్రహాల ఆవిష్కరణ 

గోదావరిఖని, వెలుగు: కార్మిక పక్షపాతి, దివంగత నేత జి.వెంకటస్వామి (కాకా) విగ్రహాలను పెద్దపల్లి జిల్లాలో సోమవారం కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఆవిష్కరించనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు గోదావరిఖనిలో, మధ్యాహ్నం 3.30 గంటలకు బెల్లంపల్లిలో  కేంద్ర మంత్రి  జి.కిషన్‌‌ రెడ్డి కాకా విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. కాకా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని సింగరేణి, ఇతర పరిశ్రమల ఉద్యోగులు, కార్మికులకు ఎనలేని సేవలందించారు. కార్మికుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1957లో చెన్నూర్ నియోజకవర్గం నుంచి కాకా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత ఏడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1990లో ఆర్థిక పరిస్థితి బాగాలేక సింగరేణి సంస్థ మూతపడే స్థితికి వచ్చింది. ఎంపీగా ఉన్న వెంకటస్వామి చొరవ తీసుకుని ఎన్టీపీసీతో మాట్లాడి రూ.400 కోట్ల రుణాన్ని సింగరేణికి ఇప్పించారు. ఈ పరిణామంతో సింగరేణి సంస్థ నిలదొక్కుకుని 1999 నాటికి లాభాల బాటలోకి వచ్చింది. అలాగే 2009లో గోదావరిఖని ప్రాంతంలో సింగరేణి స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారిలో సుమారు 17 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించడంలో వెంకటస్వామి విశేష కృషి చేశారు. అలా ఆయనకు నియోజకవర్గం, కార్మికులతో విడదీయరాని బంధం ఏర్పడింది. విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో కాకా కుమారుడు, మాజీ ఎంపీ డాక్టర్‌‌ జి.వివేక్‌‌, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు.

Latest Updates