లాక్​డౌన్​, కంటైన్​మెంట్​ జోన్లపై నిర్ణయం రాష్ట్రాలదే

హైదరాబాద్, వెలుగు:  కరోనా కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు, లాక్ డౌన్ పై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని, ఈ విషయాలపై కేంద్రం రాష్ట్రాలకు స్వేచ్ఛను ఇచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. కేసుల ఆధారంగా రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఆదివారం వెబ్ నార్ ద్వారా మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ ను స్పీడప్ చేయాలి. కరోనా విషయంలో సర్కారు దవాఖాన్లపై ప్రజలకు నమ్మకం తగ్గినందున అక్కడకు వెళ్ళేందుకు జంకుతున్నారు. ప్రైవేటు దవాఖాన్లకు పోతే లక్షలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందాయి. ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులపై అజమాయిషీ చేయాలి. 200కు పైగా వెంటిలేటర్ లు ఉన్నా గాంధీలో చేరేందుకు ప్రజలు ఎందుకు భయపడుతున్నారో ప్రభుత్వం ఆలోచించాలి. ఎంతమంది వారించినా, ప్రజలకు భరోసా కల్పించేందుకే గాంధీ దవాఖానలో పర్యటించా. విపత్తు కాలంలో కష్టపడుతున్న సిబ్బందికి అదనపు ఇన్సెంటీవ్ ఇవ్వాలి’’ అని కిషన్ రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రానికి 1,220 వెంటిలేటర్లు..

‘‘రాష్ట్రానికి 7,44,000 మాస్కులు, 2,41,000 పీపీఈ కిట్లు, 2,25,0000 హెచ్సీక్యూ ట్యాబ్లెట్లు, 1,23,000 టెస్టు కిట్లు, 1,02,407 ఆర్టీపీసీఆర్ కిట్లు, 52 వేల వీటీఏ కిట్లు పంపాం. 1,220 వెంటిలేటర్లు ఇవ్వాలని నిర్ణయించాం. ఇప్పటివరకు 888 వెంటిలేటర్లు పంపాం. కేంద్రం నుంచి రాష్ట్రంలో కరోనా నివారణకు రూ. 215 కోట్లు మంజూరు చేశాం’’ అని కిషన్ రెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా 1239 కోవిడ్ ఆసుపత్రులు ఉన్నాయని, 5లక్షల బెడ్స్ ఉండగా, 34, 479 ఐసీయూ బెడ్స్, 1194 ల్యాబ్ లు అందుబాటులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు.   రాష్ట్రంలో కరోనా మరణాలను పూర్తిగా తగ్గించేందుకు టెస్టులు వేగవంతం చేయాలని చెప్పారు.   ‘‘కంటైన్మెంట్ జోన్ లో ప్రతిఒక్కరికి టెస్ట్ చేయాలి. బీబీనగర్ ఏయిమ్స్ ను కరోనా ఆసుపత్రి గా మార్చే ఆలోచన లేదు. రాష్ట్రం కోరితే ఏయిమ్స్ ను కొవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటికే రైల్వేకి చెందిన లాలాగూడ ఆసుపత్రి, ఈఎస్ఐ ఆసుపత్రిని కొవిడ్ కోసం వాడుతున్నాం’’ అని కిషన్ రెడ్డి తెలిపారు.

దేశంలో మరణాలు తక్కువే..

దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవాళ్లు ఎక్కువగా ఉన్నారని,  5.50 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారని కిషన్ రెడ్డి తెలిపారు. కరోనాను బాగా కట్టడి చేస్తున్నందునే మనదేశంలో  మరణాల రేటు తక్కువగా ఉందన్నారు. అమెరికాలో 616 ఉంటే మన దేశంలో 2.66 శాతం మాత్రమే మరణాలు ఉన్నాయన్నారు. పేదవారికి ఉచితంగా రేషన్, పప్పులు, గ్యాస్ ఇస్తున్నామని, లాక్డౌన్ తో ఉపాధి కోల్పోయిన పేదవారికి ఆత్మనిర్భర భారత్ కింద సాయం చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ స్కీమ్ కు లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

సెక్యూరిటీ లేకుండానే..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఉదయం గాంధీ దవాఖానను ఆకస్మికంగా సందర్శించారు. మంత్రి కాన్వాయ్ హాస్పిటల్ ఓపీ బ్లాక్ వద్దకు చేరుకోగానే.. సెక్యూరిటీ సిబ్బంది కిందికి దిగబోయారు. దీంతో వారిని వద్దని మంత్రి ఆపారు. ‘హాస్పిటల్ లోకి మీరు రావద్దు. కారులోనే సేఫ్ గా ఉండండి..’ అని చెప్తూ కిషన్రెడ్డి ఒక్కరే గాంధీ సీనియర్ డాక్టర్లతో కలిసి లోపలికి వెళ్ళారు. కొందరు లోకల్ పోలీసులు మాత్రమే మంత్రి వెంట ఉన్నారు. ఇటీవల ప్రజాప్రతినిధుల సెక్యూరిటీ సిబ్బంది వరసగా కరోనా బారిన పడుతుండటంతో మంత్రి తన సెక్యూరిటీని ఆపినట్లుగా తెలిసింది.

జూరాల వైపు కృష్ణమ్మ వాటర్

Latest Updates