ముద్దు ఒక మూగభాష!

ప్రేమను వెయ్యి రకాలుగా వ్యక్తీకరించవచ్చు. కానీ, అందులో ‘ది బెస్ట్ వే’అంటే ముద్దు ఒక్కటే! ప్రేమని తెలియజేసే తియ్యని సంతకం ముద్దు. రొమాంటిక్ వీక్ లో ఆరో రోజు కిస్ డే! అప్పటి వరకు మర్చిపోలేని జ్ఞాపకంగా ఉన్న ముద్దుని మర్చిపోయేలా తమ పార్ట్ నర్ కి మరో మధురమైన ముద్దు ఇస్తారు ఈ రోజు!!

ముద్దు ఉన్న చోట ప్రేమ ఉండకపోయినా.. ప్రేమ ఉన్న చోట మాత్రం కచ్చితంగా ముద్దు ఉంటుంది. ముద్దు అంటే లైంగిక చర్యకు అనుమతినిచ్చే స్విచ్ కాదు. అది ప్రేమికుల హృదయాలని తెరిచే తాళం చెవి. ప్రేమను తెలిపే పూల తావి. ప్రేయసీ ప్రియుల ప్రేమ తీరం పెదాల సంగమం. తొలిసారిగా తన ప్రియమైన వాళ్లని ముద్దాడడం ఓ సాహసం లాంటిది. ఎందుకంటే ముద్దు పెట్టేటప్పుడు తన స్పందన ఎలా ఉంటుందనేది కొంచెం అనుమానమే. తెలియకుండానే ప్రేమ ముద్దుకు దారి తీస్తుంది. తొలిసారిగా ముద్దాడుతుంటే మీ గుండె వేగం పెరిగిపోతుంది. ఆ తర్వాత రాత్రి పగలు మీ ప్రియమైన వారి గురించే ఆలోచిస్తుంటారు. భార్యా భర్తల అనురాగ చిహ్నం ముద్దు. వారి మధ్య ముద్దు ముచ్చట లేకపోతే ప్రేమ అనేదే ఉండదు.

ముద్దు భాష..
ముద్దుది మూగ భాష! మాటలతో చెప్పలేని ప్రతి భావాన్ని ముద్దు చెప్పగలదు. గుసగుసగా ముద్దు చాలా చెప్తుంది. ఆ గుసగుసలు వాలెంటైన్ కు మాత్రమే వినబడతాయి. ఆ మూగ భాష వాలెంటైన్ గుండెకు మాత్రమే తెలుస్తుంది. ‘నువ్వు నాతోనే ఉండిపో.. నన్ను విడిచి వెళ్లకు’అని ముద్దు వెచ్చటి కన్నీటి బొట్టుని రాలుస్తుంది. వాలెంటైన్ కళ్లలో మెరుపుని, పెదాలపై చిరునవ్వుని దోచుకోవడం ఒక ముద్దుకే సాధ్యం ! ముద్దు ఇచ్చిపుచ్చుకోవడాన్ని నేర్పిస్తుంది. ఊపిరికి ప్రేమ పరిమళాలని అద్దుతుంది. ముద్దు ప్రకృతి ప్రసాదించిన ఓ నేచురల్ ఎక్స్‌‌ప్రెషన్. జంతువులు కూడా వాటి ప్రేమని ముద్దులతో ప్రకటిస్తాయి. ఎన్నో రకాలు ముద్దులున్నాయి.. అన్నీ మధురానుభూతులు సృష్టించేవే. ప్రేయసీ ప్రియులు,  భార్యాభర్తల జీవితంలో ఎన్నో ముద్దులు మైలురాళ్లుగా నిలిచిపోతాయి. వాళ్లు ముసలోళ్లయినాక ఒక్కసారి ఆ ముద్దు జ్ఞాపకాలు తలుచుకుంటేచాలు.. వాళ్ల హృదయాల్లో మళ్లీ యవ్వనం తిరిగి వస్తుంది.. పెదాలపై చిరునవ్వుగా!

Latest Updates