కర్నాటక లాక్డౌన్ ఆంక్షలు సడలింపు

కర్నాటక లాక్డౌన్ ఆంక్షలు సడలింపు
  • వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత.. 
  • స్కూళ్లు.. సినిమా థియేటర్ల మూసివేత యధాతధం 

బెంగళూరు: కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో అన్ లాక్ ప్రక్రియను చేపట్టిన కర్ణాటక తాజాగా మరిన్ని ఆంక్షలు సడలించింది. రేపు ఆదివారం వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేసింది. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి రాత్రి 9 వరకు ఆంక్షలు సడలించారు. పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్.. కర్ఫ్యూ ప్రకియను స్థానికంగానే నిర్వహించుకునే స్వేచ్ఛను ఆయా జిల్లాల అధికారులకు అప్పగించారు. 
సెకండ్ వేవ్ లో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో కర్ణాటక కకావికలమైన విషయం తెలిసిందే. తీవ్రమైన ఆంక్షలతో లాక్డౌన్ ప్రకటించారు. దాదాపు రెండున్నర నెలలు లాక్డౌన్ విధించడంతో క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా 4 వేలు అంతకంటే దిగువనే కేసులు నమోదవుతున్నాయి. రాజధాని బెంగళూరు లో కూడా వేలకుపైగా కేసులు నమోదైన పరిస్థితులు పోయి ఇప్పుడు వందల్లో నమోదవుతూ.. రోజు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపధ్యంలో వీకెంట్ కర్ఫ్యూను కూడా ఎత్తేవేస్తున్నట్లు సీఎం యడియూరప్ప శనివారం ప్రకటించారు. అయితే సినిమా ధియేటర్లు, స్కూళ్ల మూసివేత యధావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రాక్టీసు కోసం మాత్రమే స్టేడియంలు, స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు అనుమతిచ్చారు. 
పెళ్లిళ్లకు గతంలో గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి ఉండగా... తాజాగా రేపు ఆదివారం నుంచి జరిగే పెళ్లిళ్లకు వంద మంది వరకు అనుమతిచ్చారు. షాపులు, రెస్టారెంట్లు, మాల్స్, ప్రైవేటు సంస్థల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని.. పాటించకపోతే విపత్తు నిర్వహణ చట్టం2005 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యడియూరప్ప హెచ్చరించారు. రేపటి నుంచి రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 వరకు మాత్రమే కర్ఫ్యూ అమలులో ఉంటుంది.