కొకోమో.. భూతల స్వర్గం

‘పుణ్యకార్యాలు చేసి చనిపోయిన వారు స్వర్గానికి వెళ్తారు’ అని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. అక్కడ కష్టాలు, బాధలు ఏవీ ఉండవట. అన్నీ సంతోషాలు, సుఖాలే. రంభ, మేనక, ఊర్వశి వంటి అందగత్తెలు ఉంటారట. సర్వ సౌకర్యాలు అందుతాయట. మరి ఇన్ని ఉన్న చోటుకు వెళ్లాలని ఎవరు అనుకోరు చెప్పండి? కానీ సమస్యల్లా చావు. అవును మరి. స్వర్గాన్ని చూడాలని అందరూ అనుకుంటారు కానీ చావాలని ఎవరూ అనుకోరు కదా? ‘‘అయ్యో! ఇంతదానికి చావులు, చంపడాలు ఎందుకండీ. స్వర్గం మా దేశంలోనే ఉంది. రండి” అంటున్నారు ఫిజీ దేశస్థులు. అన్వేషకులకు స్వర్గం వచ్చేయమంటున్నారు.

ఏంటది?

కొకోమో ప్రైవేటు ఐల్యాండ్. ఫిజీ దేశంలో ఉంటుంది. నడి ఎయిర్​పోర్టు నుంచి కేవలం 45 నిమిషాల్లో అక్కడికి చేరుకోవచ్చు. ప్రైవేటు హెలికాప్టర్ ద్వారా కూడా వెళ్లొచ్చు. సీ ప్లేన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఫిజీలోనే మోస్ట్ ఎక్స్​క్లూజివ్ ప్రైవేటు ఐల్యాండ్.

ఏంటీ స్పెషల్?

లగ్జరీకి కేరాఫ్ అడ్రస్​లా ఉంటాయి ఇక్కడి విల్లాలు. బీచ్​ల ముందు మొత్తం 21 విల్లాలు, ఐదు లగ్జరీ రెసిడెన్స్​లు ఉన్నాయి. బీచ్ ముందు ఉన్న విల్లాల్లోని విశాలమైన బెడ్రూమ్​లు, నీటి అడుగున మెరిసే లైట్లతో కూడిన స్విమ్మింగ్ పూల్.. ఆహా అనిపిస్తాయి. నీలం రంగులో మిలమిల మెరిసే సముద్రపు నీళ్లు, ఎవరో పరిచినట్లుగా తీరంలో ఎక్కడ చూసిన తెల్లటి ఇసుక.. చూపు తిప్పుకోనివ్వవు. తీరం చుట్టూ సహజంగా ఏర్పడిన మట్టి దిబ్బలు.. పగలు సూర్యకాంతితో, రాత్రి విద్యుత్ వెలుగుల్లో స్వర్గపు అనుభూతిని నిజంగానే కలిగిస్తాయి. ఇక ట్రోపికల్ గార్డెన్స్​ ప్రత్యేక ఆకర్షణ. ప్రైవసీ భయం ఉండదు. ఫుల్ సెక్యూరిటీ.

ఎవరు డెవలప్ చేశారు?

ఈ ఐల్యాండ్​ను స్వర్గంలా మలచడంలో ఓ ఆస్ట్రేలియన్ కృషి ఉంది. ప్రాపర్టీ డెవలపర్ అయిన లాంగ్ వాకర్.. కొకోమోను అభివృద్ధి చేశారు. తన ఫ్యామిలీతో కలిసి ఓ రూపు తీసుకొచ్చారు. ఇక కుక్ కోరీ క్యాంప్​బెల్ నాయకత్వంలో కొకోమోను ఓ వరల్డ్ క్లాస్ డైనింగ్ డెస్టినేషన్​గా మార్చారు. ఒక్క సారి తిన్నారంటే.. మళ్లీమళ్లీ తినేలా ఉంటాయట వంటలు.

బోర్ కొట్టకుండా..

ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, కల్చరల్ అడ్వెంచర్లు నిరంతరం జరుగుతూనే ఉంటాయట. భూమిపైనే అత్యుత్తమ డైవింగ్, స్నోర్ కెల్లింగ్ స్పాట్స్ ఉన్నాయట. అలాగే డీప్ సీ ఫిషింగ్, దగ్గర్లోని ఐల్యాండ్లకు వెళ్లేందుకు కయాక్ పడవలు అందుబాటులో ఉంటాయి. యవుకువే స్పా సాంచురీ, యోగా క్లాసులు కూడా ఫేమస్ అంట. తొలిసారి హనీమూన్ వెళ్లే వారికి కరెక్ట్ డెస్టినేషన్ అంటోంది కొకోమో ప్రైవేట్ ఐల్యాండ్. ఇంతకీ ఇక్కడ ఒక రాత్రి ఉండేందుకు ఒక బెడ్డుకు ధర ఎంతో తెలుసా? జస్ట్ 2 వేల పౌండ్లు. మన రూపాయల్లో అయితే 1,71,796 అంతే!! బాబోయ్ ఇంత ఖరీదా అనుకోకండి. స్వర్గాన్ని చూడాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి మరి.

Latest Updates