టైటిల్ పైనే కోల్ కతా గురి

నైట్ రైడర్స్ భారీ ప్లాన్‌‌

వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌:  కింగ్‌‌ ఖాన్‌‌ షారూక్‌‌ ముఖ చిత్రంతో ముందుకొచ్చిన కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌.. ఐపీఎల్‌‌ ప్రారంభం నుంచే బలమైన జట్లలో ఒకటి. ప్రతి సీజన్‌‌లో ప్లే ఆఫ్స్‌‌కు వెళ్లే వాటిల్లో కచ్చితంగా ఉండే టీమ్‌‌. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ 2012, 14 సీజన్లలో చాంపియన్‌‌గా నిలిచింది. కానీ గత సీజన్‌‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నా.. ఈసారి భారీ ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నది. అరబ్‌‌ కంట్రీలో ముచ్చటగా మూడో టైటిల్‌‌ను ముద్దాడాలని టార్గెట్‌‌ పెట్టుకుంది. 2008లో ఒకే ఒక్క ఇన్నింగ్స్‌‌తో ఐపీఎల్‌‌ను ఎక్కడికో తీసుకెళ్లిన బ్రెండన్‌‌ మెకల్లమ్‌‌ హెడ్‌‌ కోచ్‌‌గా తన పనితనాన్ని చూపెట్టబోతున్నాడు. వేలంలో కొత్త ప్లేయర్లను తీసుకొని దాదాపుగా ప్రాబ్లమ్స్‌‌ను సాల్వ్‌‌ చేసుకున్న కేకేఆర్‌‌.. ఇయాన్‌‌ మోర్గాన్‌‌, కమిన్స్‌‌ (రూ. 15.5 కోట్లు) కోసం పెద్ద మొత్తంలో వెచ్చించింది. 23న ముంబైతో తొలి పోరు మొదలుపెట్టనుంది.

బలం..

ఈసారి కేకేఆర్‌‌ బ్యాటింగ్‌‌ లైనప్‌‌ యంగ్‌‌ అండ్‌‌ ఎక్స్‌‌పీరియెన్స్‌‌తో బలంగా కనిపిస్తున్నది. యంగ్‌‌స్టర్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, సునీల్‌‌ నరైన్‌‌, ఆండ్రీ రసెల్‌‌, ఇయాన్‌‌ మోర్గాన్‌‌, దినేశ్‌‌ కార్తీక్‌‌, టామ్‌‌ బాంటన్‌‌, నితీశ్‌‌ రాణా, రాహుల్‌‌ త్రిపాఠి.. ఇలా ఎనిమిదో స్థానం వరకు డెప్త్‌‌ ఉంది. రసెల్‌‌ ఈసారి కూడా ట్రంప్‌‌ కార్డు. అలాగని భారం మొత్తం అతనిపైనే వేస్తే మొదటికే మోసం వస్తుంది. రసెల్‌‌ను ఎలా ఉపయోగించుకుంటుందనే దానిపైనే కోల్‌‌కతా విజయవకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్‌‌లో నరైన్‌‌, కుల్దీప్‌‌ స్పిన్ మ్యాజిక్‌‌ చేయగల దిట్టలు. కమిన్స్‌‌, లూకీ ఫెర్గుసన్‌‌, శివమ్‌‌ మావి, ప్రసిద్‌‌ కృష్ణతో పేస్‌‌ విభాగం బలంగానే ఉంది. చివరి నిమిషంలో టీమ్‌‌లోకి వచ్చిన అమెరికన్‌‌ పేసర్‌‌ అలీ ఖాన్‌‌ సంచలనాలు సృష్టిస్తాడా? చూడాలి.

బలహీనత..

కొంత మంది ప్లేయర్లను రిలీజ్‌‌ చేసి కొత్త వారిని తీసుకోవడం వల్ల ప్రధాన లోపాలన్నింటినీ సరి చేసుకుంది. ఏ టైమ్‌‌లోనైనా అద్భుతమైన ఫైనల్‌‌ ఎలెవన్‌‌ను బరిలోకి దించేలా ప్లేయర్లను అందుబాటులో ఉంచుకుంది. కాకపోతే బ్యాకప్‌‌ ప్లేయర్ల విషయంలోనే కొద్దిగా లోటు కనిపిస్తున్నది. టాప్‌‌ ప్లేయర్లు గాయపడితే వారి ప్లేస్‌‌ను భర్తీ చేసే వారు లేకపోవడం పెద్ద బలహీనత. రాణా, కార్తీక్‌‌లో ఒకరు ఇంజ్యూర్‌‌ అయితే ఆ స్థాయిలో ఆడే బ్యాకప్‌‌ ప్లేయర్‌‌ లేడు. రింకూ సింగ్‌‌, రాహుల్‌‌ త్రిపాఠి, సిద్ధేశ్‌‌ లాడ్‌‌, నిఖిల్‌‌ ఉన్నా.. వాళ్లకు ఎక్స్‌‌పీరియెన్స్‌‌ లేదు. లాస్ట్‌‌ సీజన్‌‌లో ఆల్‌‌రౌండర్‌‌గా సేవలందించిన రసెల్‌‌.. ఈసారి బౌలింగ్‌‌ చేయడంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ రసెల్‌‌ గాయపడినా టీమ్‌‌ బ్యాలెన్స్‌‌ తప్పుతుంది.

అంచనా..

టీ20లకు సరిపోయే పవర్‌‌ హిట్టర్లతో పాటు ట్రెడిషనల్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌తో కేకేఆర్‌‌ బలంగా ఉంది. బౌలర్లు కూడా అంచనాలు అందుకుంటే ప్లే ఆఫ్స్‌‌ ఖాయం.

జట్టు

బ్యాట్స్‌‌మెన్‌‌: ఇయాన్‌‌ మోర్గాన్‌‌, నితీశ్‌‌ రాణా, రాహుల్‌‌ త్రిపాఠి, రింకూ సింగ్‌‌, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, సిద్ధేశ్‌‌ లాడ్‌‌, టామ్‌‌ బాంటన్‌‌,

వికెట్‌‌ కీపర్లు: దినేశ్‌‌ కార్తీక్‌‌ (కెప్టెన్‌‌), నిఖిల్‌‌ నాయక్‌‌.

ఆల్‌‌రౌండర్లు: రసెల్‌‌, కమలేష్ నాగర్‌‌కోటి, సునీల్‌‌ నరైన్‌‌, శివమ్‌‌ మావి.

బౌలర్లు: కుల్దీప్‌‌ యాదవ్‌‌, ఫెర్గుసన్‌‌, మణి మారన్‌‌, సిద్ధార్థ్‌‌, కమిన్స్‌‌, ప్రసిద్‌‌ కృష్ణ, సందీప్‌‌ వారియర్‌‌, వరుణ్‌‌ చక్రవర్తి,  అలీ ఖాన్‌‌.

 

Latest Updates