1400 లీట‌ర్ల న‌కిలీ హ్యాండ్ శానిటైజ‌ర్ స్వాధీనం.. ఇద్ద‌రు అరెస్ట్

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో ఇప్ప‌టికే ల‌క్ష‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వైర‌స్ బారిన ప‌డ‌కుండా చాలా మంది ప్ర‌జ‌లు మాస్క్‌లు ధరిస్తూ.. శానిటైజ‌ర్ లు వాడుతూ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ క‌రోనా విపత్తును అవ‌కాశంగా తీసుకున్న కొంద‌రు ప్ర‌బుద్ధులు.. న‌కిలీ హ్యాండ్ శానిటైజర్‌ను త‌యారు చేసి మార్కెట్ లోకి వ‌దులుతున్నారు. కోల్‌కతాలోని హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎజ్రా స్ట్రీట్ ప్రాంతంలో నకిలీ శానిటైజర్ త‌యారు చేస్తున్నార‌న్న ప‌క్కా స‌మ‌చారంతో పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించి.. ఓ గోడౌన్ నుంచి 1,400 లీటర్ల నకిలీ హ్యాండ్ శానిటైజర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

గురువారం కోల్‌కతా పోలీసుల యాంటీ రౌడీ స్క్వాడ్ (ఎఆర్‌ఎస్) తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్రాంచ్ (ఇబి)… సెంట్రల్ కోల్‌కతాలోని రెండు ప్రదేశాలపై దాడి చేసి, నకిలీ శానిటైజర్లను స్వాధీనం చేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా శానిటైజ‌ర్ ల‌కు భారీ డిమాండ్ ఉన్న నేప‌థ్యంలో .. ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్రాంచ్ మార్కెట్లో నకిలీ శానిటైజర్ లు వస్తున్నాయ‌ని, వాటిని త‌యారు చేస్తున్న వారిని ప‌ట్టుకునేందుకు ఆరా తీసింది. ఎటువంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా ఓ ఫ్యాక్ట‌రీని న‌డుపుతూ అందులో శానిటైజ‌ర్‌లు త‌యారు చేస్తున్న రాజీబ్ పంజాబీ (43), జియావుద్దీన్ బాషా (43) అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.వారు త‌యారు చేసిన శానిటైజ‌ర్ పై ఎలాంటి మ్యానుఫాక్చ‌రింగ్ డేట్ కానీ.. స‌రైన డాక్యుమెంట్స్ కూడా లేక‌పోవ‌డంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ శానిటైజ‌ర్ త‌యారీలో మనుషుల‌కు హాని కలిగించే వివిధ రసాయనాలను వాడుతున్నార‌ని ఒక ఉన్నత పోలీసు అధికారి తెలిపారు.

ఆ గోడౌన్‌లో నిల్వ చేసిన నకిలీ శానిటైజర్‌తో ఉన్న అనేక ప్లాస్టిక్ కంటైనర్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రితో అదుపులోకి తీసుకున్నామ‌ని, ఈ అక్ర‌మ వ్యాపారంతో సంబంధ‌మున్న మ‌రికొంద‌ర్ని ప‌ట్టుకునేందుకు ద‌ర్యాప్తు జ‌రుగుతుంద‌ని ఆ ఉన్న‌తాధికారి తెలిపారు.

Latest Updates