చేతకాని ప్రభుత్వం వల్లే విద్యార్థుల చావులు: కోమటి రెడ్డి

చేతకాని ప్రభుత్వం వల్లే 25 మంది విద్యార్థులు చనిపోయారని అన్నారు కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఇంటర్ అవకతవకలపై ఈ రోజు గాంధీ భవన్ లో దీక్షచేస్తున్న యూత్ కాంగ్రెస్ విద్యార్థి నాయకులను వెంకట్ రెడ్డి కలిసి సంఘీభావం తెలిపారు. వీరితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కుసుమ కుమార్, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. మీడియాతో మాట్లాడిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. తెలంగాణ ఏర్పడ్డాక విద్యార్థులు చనిపోవడం బాధాకరమని అన్నారు. ఐదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ బ్రష్టు పట్టించారని చెప్పారు.

విద్యార్థుల ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత సీఎం  కేసీఆర్ దేనని అన్నారు వెంకట్ రెడ్డి.  చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించడానికి కేసీఆర్ కు  తీరిక లేదని విమర్శించారు.  సెక్రటేరియట్ కు రానాన్ని రోజులు  పాలన ఇలాగే ఉంటుందని అన్నారు. గ్లోబరినా కంపెనీ పై కాకినాడ లో క్రిమినల్ కేస్ ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఇంటర్ బాధ్యతలను అప్పగించిందని ప్రశ్నించారు. అసమర్ధుడు విద్యాశాఖ మంత్రిగా ఉండటం వల్లే విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయని విమర్శించారు. 25మంది విద్యార్థుల ఉసురు కేసీఆర్ కు తాకుతుందని వెంకట్ రెడ్డి అన్నారు.

Latest Updates